logo

ఇనుగుర్తి.. సీరోలు మండలాల ఏర్పాటు

జిల్లాలో కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న రెండు నూతన మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ సోమవారం ఇనుగుర్తి, సీరోలు మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

Published : 27 Sep 2022 04:26 IST

తుది ఉత్తర్వులు జారీ

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న రెండు నూతన మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ సోమవారం ఇనుగుర్తి, సీరోలు మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఇనుగుర్తి, డోర్నకల్‌ నియోజకవర్గంలోని సీరోలును మండల కేంద్రంగా ప్రకటిస్తూ తుది ఉత్వర్వులు వెలువడ్డాయి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో 16 మండలాలతో మహబూబాబాద్‌ను జిల్లాగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇనుగుర్తి, సీరోలు గ్రామాలను కూడా మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఇనుగుర్తిని మండలంగా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. కాగా, సోమవారం రాత్రి ఇనుగుర్తి లో ప్రజలు బాణాసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు.

పరిధి ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రతిపాదించిన ముసాయిదా జాబితాల్లోని కొని గ్రామాల్లో  మార్పులు, చేర్పులు చేస్తూ నూతన మండలాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసి ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మండలాల నుంచి కొన్ని గ్రామాలను విభజిస్తూ, పక్క మండల పరిధిలోని ఇతర గ్రామాలను చేరుస్తూ నూతన మండలాలను ఏర్పాటు చేసింది. ఇనుగుర్తి మండలం పరిధిలోకి మొదటగా నెల్లికుదురు మండలంలోని రాజులకొత్తపల్లి గ్రామాన్ని ప్రతిపాదించారు. నెల్లికుదురు మండలంలోని రాజులకొత్తపల్లి గ్రామాన్ని తొలగించి మేచరాజుపల్లి గ్రామాన్ని చేరుస్తూ కొత్త మండలం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది.

 


సీరోలులో ఆరు రెవెన్యూ గ్రామాలు

కురవి మండలం నుంచి సీరోలు, కాంపల్లి, ఉప్పరిగూడెం, తాళ్ల సంకీస, చింతపల్లి, డోర్నకల్‌ మండలం నుంచి మన్నెగూడెం సహా ఆరు గ్రామాలతో సీరోలు మండలంగా ఏర్పడింది.


ఇనుగుర్తిలో అయిదు..

కేసముద్రం మండలం నుంచి ఇనుగుర్తి, కోమటిపల్లి, నెల్లికుదురు మండలం నుంచి చిన్నముప్పారం, చిన్ననాగారం, మేచరాజుపల్లి గ్రామాలతో ఇనుగుర్తి మండలంగా ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని