logo

నాని.. భవాని.. ప్రేరణ కొనసాగనీ..!

నిత్యజీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనే వినూత్న ఆలోచనలకు ఇన్‌స్పైర్‌ మనక్‌ పురస్కారాలు లభిస్తాయి. ఈ క్రమంలో ఈ విద్యాసంవత్సర (2022-23) ఇన్‌స్పైర్‌మనక్‌ అవార్డుల నామినేషన్ల నమోదు ప్రక్రియ

Published : 29 Sep 2022 06:13 IST

నెలాఖరు వరకు ఇన్‌స్పైర్‌ నమోదుకు గడువు
న్యూస్‌టుడే, మానుకోట

నిత్యజీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనే వినూత్న ఆలోచనలకు ఇన్‌స్పైర్‌ మనక్‌ పురస్కారాలు లభిస్తాయి. ఈ క్రమంలో ఈ విద్యాసంవత్సర (2022-23) ఇన్‌స్పైర్‌మనక్‌ అవార్డుల నామినేషన్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. ఇన్‌స్పైర్‌ అవార్డుల కోసం ప్రాజెక్టుల నమోదు ఎంత ఎక్కువగా ఉంటే జిల్లా నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రదర్శనా పోటీలకు ఎంపికలు అంత ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.

లక్ష్యం ఇదే..
10 నుంచి 15 ఏళ్ల వయసు గల విద్యార్థుల్లో వినూత్న, సృజనాత్మక శాస్త్రీయ ఆలోచలను ప్రోత్సహించేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్‌టీ), గుజరాత్‌లోని నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (నిఫ్‌) సంయుక్తంగా ఈ పథకాన్ని దశాబ్దకాలంగా అమలు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నాయి. వివిధ అంశాలపై సృజనాత్మక ఆలోచనలు, భావనలు, ఆవిష్కరణలను ఈ పథకం ద్వారా ఆహ్వానిస్తారు. ఇవి స్థానిక వైజ్ఞానిక, సాంకేతిక అవసరాలతో పాటు జాతీయ ప్రాధాన్యాన్ని కలిగి ఉండాలి. సామాజిక కోణంతో పాటు పర్యావరణ హితంగా ఉండాలి.

ఎవరు అర్హులు?
అన్ని యాజమాన్యాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలను పంపించవచ్చు. ఎంపికైన విద్యార్థులకు రూ.10 వేల ఆర్థిక సహాయం డీఎస్‌టీ నుంచి విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ అవుతాయి. వీటితో విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందించవచ్చు. ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ప్రాజెక్టుల ప్రదర్శనల పోటీలు జరుగుతాయి. జాతీయ స్థాయిలో 60 అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శన నిర్వహిస్తారు. జపాన్‌లో నిర్వహించే విజ్ఞాన యాత్రకు అవకాశం ఉంటుంది.

ఎలా నమోదు చేయాలి?
నిత్య జీవితంలో పలు సమస్యలను పరిశీలించి వాటికి పరిష్కారంగా శాస్త్రీయ ఆలోచనలను పంపించవచ్చు.  ఈ నామినేషన్లను ఆన్‌లైన్‌ ద్వారా పంపించాలి. ఇందుకు
www.inspireawards.dst.gov.in లో లాగిన్‌ కావాలి. పాఠశాల యూ-డైస్‌ సంఖ్య ఈ-మెయిల్‌, విద్యార్థుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుడి పేరు తదితర వివరాలు ఉంటే వెంటనే నమోదు చేయొచ్చు. సెలవు రోజుల్లోనూ పంపించొచ్చు.

నమోదు పెంచాలి
- బి.అప్పారావు, జిల్లా సైన్స్‌ అధికారి

ఇన్‌స్పైర్‌ నామినేషన్ల నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. అందువల్ల ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి తప్పనిసరిగా నమోదు చేయిస్తే బాగుంటుంది.

ప్రతి పాఠశాల నమోదు చేయాలి
- డాక్టర్‌ అబ్దుల్‌హై, జిల్లా విద్యాశాఖాధికారి

ఆరు నుంచి పదో తరగతిలోని ప్రతి విద్యార్థి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు వారిని ఉపాధ్యాయులు, ప్రధోనోపాధ్యాయులు ప్రోత్సహించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని