logo

హృదయం.. ఇలా పదిలం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రోజురోజుకు గుండె జబ్బు బాధితులు పెరుగుతున్నారు. చిన్న పిల్లల్లో పుట్టుకతో గుండె రంధ్రాలు ఏర్పడుతుండగా..  18 సంవత్సరాల పైబడిన వారు ఇటీవల గుండె జబ్బుకు గురవుతున్నారు. అప్పటి వరకు చురుగ్గా పనిచేసిన

Published : 29 Sep 2022 02:03 IST

నేడు ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినం

న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి

* ఇటీవల జనగామ జిల్లా లింగాలఘనపురానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని తమ అపార్టుమెంటులో ఆగస్టు 15న జెండా వందనం అనంతరం స్వాతంత్రోద్యమం గురించి వివరిస్తూ కార్డియాక్‌ అరెస్టుతో మాట్లాడుతూనే కుప్పకూలిపోయి మరణించారు.

* వరంగల్‌ ఎన్‌ఐటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి దుబాయ్‌లోని ఆయిల్‌ కంపెనీలో నెలకు రూ.58 లక్షల వేతనంతో ఉద్యోగానికి ఎంపికైన అభిజిత్‌రెడ్డి(22) కార్డియాక్‌ అరెస్టుతో రెండు రోజుల  కిందట చనిపోయారు. ఈయన రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద కుమారుడు.

* గత నెలలో వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పల్లయ్యబోడు తండాకు చెందిన నీహాన్‌(8) అనే బాలుడికి శస్త్రచికిత్సకు ముందు  మత్తు మందు ఇస్తుండగా బాలుడికి అకస్మాత్తుగా కార్డియాక్‌ అరెస్టు అయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా బాలుడి ప్రాణాలు దక్కలేదు.

కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న గుండె జబ్బు బాధితులు

మ్మడి వరంగల్‌ జిల్లాలో రోజురోజుకు గుండె జబ్బు బాధితులు పెరుగుతున్నారు. చిన్న పిల్లల్లో పుట్టుకతో గుండె రంధ్రాలు ఏర్పడుతుండగా..  18 సంవత్సరాల పైబడిన వారు ఇటీవల గుండె జబ్బుకు గురవుతున్నారు. అప్పటి వరకు చురుగ్గా పనిచేసిన మనిషి.. హఠాత్తుగా గుండె పట్టుకుని విలవిల్లాడుతూ పడిపోవటం..వారిని కుటుంబసభ్యులు, స్నేహితులు ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం.

కార్డియాక్‌ అరెస్టు అంటే..
గుండె అకస్మాత్తుగా, అనుకోకుండా కొట్టుకోవడం, ఆగిపోవడాన్ని కార్డియాక్‌ అరెస్టు అంటారు. దాన్నే హృదయ ధమని వ్యాధిగా పిలుస్తారు. గుండె కండరాలకు సరఫరా చేసే ఆక్సిజన్‌తో కూడిన రక్తం తగ్గినప్పుడు క్రమంగా కండరాల నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా దాని పనితీరులో మార్పులు సంభవించడం వల్ల వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ (ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం)కు దారి తీస్తుంది. ఇది అందరిలో ఒకేలా జరగదు. 15- 25 కేసుల్లో నాన్‌ కార్డియాక్‌ కారణమై ఉంటుంది. కొంత మందిలో ఛాతీనొప్పి, ఊపిరి ఆడకపోవడం, వికారం, అధిక హృదయ స్పందన వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో కార్డియోపల్మొనరీ రెసిసిటేషన్‌(సిపిఆర్‌) ద్వారా చికిత్స అందించినట్లయితే వారిని కాపాడుకోవచ్చు. దాదాపు 50 శాతం మందిలో కార్డియాక్‌ అరెస్టుకు ముందు ఎలాంటి హెచ్చరిక లక్షణాలు కనిపించవని వైద్యులు అంటున్నారు.

లక్షణాలు
ఛాతీ నొప్పి, అలసట, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం, బలహీనత, వాంతులు, హఠాత్తుగా పడిపోవడం,  స్పృహ కోల్పోవడం, అసాధారణ శ్వాస తీసుకోవడం, శరీరం వెంటనే చల్లబడటం.

నివారణ చర్యలు
కార్డియాక్‌ అరెస్టుకు గురైన వారికి తక్షణమే కార్డియో పల్మొనరీ(పునరుజ్జీవనం) శ్వాసక్రియను కొనసాగించాలి. డిఫైబ్రిలేటర్‌ అనే పరికరం ద్వారా గుండెకు విద్యుత్తు షాక్‌లు ఇవ్వడం వల్ల గుండె కొట్టుకునేలా చేస్తారు. ఛాతీ కుదింపులు చేయడం వల్ల రక్తప్రసరణ కొనసాగేలా చేస్తే మరణాన్ని నివారించవచ్చు.

జాగ్రత్తపడాలి..
డాక్టర్‌ అత్తె భగీరథ, కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి

గుండె కొట్టుకోవడం ఆగితే దాన్ని కార్డియాక్‌ అరెస్టు అని, గుండెకు తగినంత  రక్తం సరఫరా కాకపోతే వచ్చే దాన్ని హార్ట్‌ ఎటాక్‌ అని చెప్పవచ్చు. రక్తపోటు, మధుమేహం, పొగతాగే వారికి ఎక్కువగా గుండె జబ్బులొచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారు, గుండె బలహీనంగా ఉన్నవారు, గుండె విఫలమైనవారు జాగ్రత్త పడాలి.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts