logo

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులను సీసీఎస్‌, మామునూర్‌ పోలీసులు సంయుక్తంగా

Published : 29 Sep 2022 02:03 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులను సీసీఎస్‌, మామునూర్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఒక్కరు పరారీలో ఉన్నాడు. సీపీ తరుణ్‌జోషి కమిషనరేట్‌లో బుధవారం వివరాలను వెల్లడించారు.  ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్‌ ఖాసీం, షేక్‌ నాగుల్‌ మీర, తల్లాడి భాస్కరదుర్గప్రసాద్‌లను అరెస్టు చేసి 166 గ్రాముల బంగారు నగలు, కారు, ల్యాప్‌టాప్‌, రెండు చరవాణిలు, రూ.5వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్రి రాజేశ్‌ పరారీలో ఉన్నాడు. ఖాసీం, నాగుల్‌ సోదరులు, భాస్కరదుర్గప్రసాద్‌, రాజేశ్‌ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరి మధ్యలో స్నేహం కుదిరింది. నలుగురు దినసరి వేతనంపై పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చోరీలను ఎంపిక చేసుకొని ఏలూరు, ఖమ్మం జిల్లాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకునే వారు. నాగుల్‌మీర బంధువులు మామునూర్‌లో ఉండడంతో.. వరంగల్‌ జిల్లాపై అవగాహన పెంచుకున్నారు. కమిషనరేట్‌ పరిధిలోని మిల్స్‌కాలనీ ఠాణా పరిధిలో రెండు, మామునూర్‌, సంగెం, కేయూసీ, ముల్కనూర్‌, లింగాలఘనపురం ఠాణాల పరిధిలో ఒక్కొక్క చోరీ చేశారు. వరుసగా ఘటనలు జరగడంతో క్రైం అదనపు డీసీపీ కె.పుష్పారెడ్డి ఆదేశాల మేరకు సీసీఎస్‌ ఏసీపీ డేవిడ్‌రాజ్‌ ఆధ్వర్యంలో నిఘాను పెంచారు. బుధవారం నాయుడు పెట్రోల్‌ బంక్‌ సమీపంలో తనిఖీలు చేస్తుండగా నిందితులు కారులో వచ్చారు. అనుమానంతో వారిని తనిఖీ చేయగా వారి వద్ద 166 గ్రాముల బంగారు నగలు, ల్యాప్‌టాప్‌, రూ.5వేల నగదు లభించింది. కారుతో పాటు వాటిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో ప్రతిభ చూపిన అదనపు డీసీపీ కె.పుష్పారెడ్డి, ఏసీపీలు డేవిడ్‌రాజ్‌, నరేశ్‌కుమార్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌. రమేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌రావు, మామునూర్‌ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌, ఏఏవో సల్మాన్‌పాషాలను సీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని