logo

పోడు.. ముందడుగు!

ఎట్టకేలకు పోడు దరఖాస్తుల పరిశీలనకు రంగం సిద్ధమైంది. అటవీ హక్కుల పరిరక్షణ కమిటీ(ఎఫ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి నింబధనలకు అనుగుణంగా ఉన్న భూములను గుర్తిస్తున్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న

Published : 29 Sep 2022 02:03 IST

మొదలైన భూముల పరిశీలన

కొత్తపెల్లి బీట్‌లో పోడు రైతుల నుంచి వివరాలు నమోదు చేస్తున్న అటవీ సిబ్బంది

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ఎట్టకేలకు పోడు దరఖాస్తుల పరిశీలనకు రంగం సిద్ధమైంది. అటవీ హక్కుల పరిరక్షణ కమిటీ(ఎఫ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి నింబధనలకు అనుగుణంగా ఉన్న భూములను గుర్తిస్తున్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజన, ఇతర రైతులకు హక్కుపత్రాలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. హక్కుపత్రాల జారీ నిమిత్తం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ఆధారంగానే క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనపై డివిజన్‌, మండల, గ్రామస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. గిరిజనులైతే 2005 డిసెంబరు 13లోపు నుంచి సాగు చేస్తుండాలి. గిరిజనేతరులు మూడు దశాబ్దాలుగా ఆయా భూములను సాగు చేసుకుంటున్నట్లు ఆధారాలు చూపించాలి. వీటిని అటవీశాఖ వద్ద ఉన్న ఉపగ్రహ చిత్రాలతో సరిపోల్చి చూస్తారు. భూముల హద్దులను, భూ కొలతలు, అటవీ అధికారుల సంయుక్త సర్వేలో నిర్ణయించనున్నారు.

ఇలా కొనసాగుతుంది..

ముందుగా దరఖాస్తుదారుడికి పంచాయతీ కార్యదర్శి నోటీసు జారీ చేస్తారు. అనంతరం నిర్దేశించిన సమయంలో ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సభ్యులు, అటవీ, రెవెన్యూ, భూకొలతల అధికారులు క్షేత్రపరిశీలన చేస్తారు. గ్రామసభ నిర్వహించి అందరి సమక్షంలో ఆయా దరఖాస్తులకు ఆమోదం తెలుపుతారు.

దరఖాస్తును తిరస్కరిస్తే ఆర్డీవో నేతృత్వంలోని డివిజన్‌ స్థాయి కమిటీకి 60 రోజుల్లోపు తిరిగి విన్నవించుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా తిరస్కరిస్తే కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా కమిటికీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

కలెక్టర్‌ నేతృత్వంలో డీఎఫ్‌వో, గిరిజన సంక్షేమ అధికారి, ఎస్పీతో పాటు ఐదుగురు గిరిజన ప్రజాప్రతినిధులున్న కమిటీదే తుది నిర్ణయంగా ప్రభుత్వం నిర్దేశించింది.

ప్రత్యేక యాప్‌లో నమోదు
పోడు భూములకు హక్కు పత్రాల జారీ కోసం సర్వేనంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన గత రెండు రోజుల క్రితం కొనసాగుతోంది. వీఆర్‌ఏలు సర్వేలో సభ్యులుగా ఉంటారు. సర్వేనంబర్ల వారీగా ఎంత మేరకు సాగు చేస్తున్నారు.. భూ విస్తీర్ణం ఎంత ? చుట్టుపక్కల ఏయే రైతులు ఉన్నారనే వివరాలను తెలుసుకుంటారు. దీంతో రైతు సాగుచేసే భూమి దగ్గరికి వెళ్లి చరవాణిలో ప్రత్యేక యాప్‌ను తెరిచి భూమి చుట్టూ నడవాల్సి ఉంటుంది. ఇందులోనే భూమి కొలతలు కూడా నమోదవుతుంది. తర్వాత దరఖాస్తులో ఉన్న కోడ్‌ నంబరు, సర్వే నంబరు, రైతు పేరు నమోదు చేసి, అక్కడే సంబంధిత రైతు ఫొటో కూడా తీసుకుంటారు. రోజుకు పది దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశాలున్నాయి.

గడవు లోపు పూర్తయ్యేనా?
వీఆర్‌ఏల సమ్మె కారణంగా సర్వేలో అనేక సమస్యలు తలెత్తనున్నాయని పలువురు అటవీ అధికారులు తెలిపారు. ఇప్పటికే వీఆర్వోలను ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయి తనిఖీల్లో ఎఫ్‌ఆర్‌సీ సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి, భూకొలతలు, బీట్‌ అధికారులు, రెవెన్యూ శాఖనుంచి ఒకరు ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మండలానికి ఇద్దరు ఆర్‌ఐలు మాత్రమే ఉన్నారు. వీరు ఒకటి, రెండు గ్రామాలకు మాత్రమే హాజరయ్యే వీలుంటుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన గడువులోపు అంటే వచ్చే నవంబరు మొదటి వారం లోపు పూర్తి చేయడంపై సందేహాలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని