logo

సరిహద్దులు దాటుతున్న గంజాయి

గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిఘా కళ్లుగప్పి  సరిహద్దులు దాటుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చింతూరు ఏజెన్సీ అడ్డాగా మాఫియా నడుస్తోంది. జిల్లాలోని మార్గాలను అసాంఘిక కార్యకలాపాలకు  వేదికగా మార్చుకుంది. ద్విచక్రవాహనాలు,

Published : 29 Sep 2022 02:03 IST

న్యూస్‌టుడే, వెంకటాపురం

గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిఘా కళ్లుగప్పి  సరిహద్దులు దాటుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చింతూరు ఏజెన్సీ అడ్డాగా మాఫియా నడుస్తోంది. జిల్లాలోని మార్గాలను అసాంఘిక కార్యకలాపాలకు  వేదికగా మార్చుకుంది. ద్విచక్రవాహనాలు, కార్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. యువతను మత్తుకు బానిస చేస్తోంది. అప్పుడప్పుడు పోలీసులకు చిక్కుతున్న సంఘటనలతో అక్రమం గుట్టు ప్రస్ఫుటమవుతోంది. నిఘా వ్యవస్థ బలోపేతంతోనే ఈ దందాకు అడ్డుకట్ట పడనుంది.

ప్యాకెట్ల నుంచి తీసిన సరకు

గోదావరి పరివాహక రహదారుల మీదుగా మాదక ద్రవ్యాల అక్రమ తరలింపు సాగుతోంది. పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్న గంజాయిని దొడ్డిదారిన తెలంగాణలోకి తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరిసీతారామరాజు జిల్లా మీదుగా వాహనాలను భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోకి చేర్చుతున్నారు. పోలీసుల నిఘాపై రెక్కీలు నిర్వహిస్తూ రూటు మార్చుతున్నారు. భద్రాచలం, మణుగూరు, ఏటూరునాగారం మార్గాలతో పాటు దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం రహదారుల ద్వారా జిల్లాలోని హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారి మీదుగా రాజధానికి గంజాయిని రవాణా చేస్తున్నారు. ఆయా మార్గాలపై పోలీసుల నిఘా ఉన్న క్రమంలో వాజేడు మండలం చెరుకూరు మార్గంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం తాళ్లగూడెం, పూసూరు-ముళ్లెకట్ట వారధిని దాటిస్తూ అటవీ మార్గమైన తుపాకులగూడెం రోడ్డు ద్వారా మహాముత్తారం, పలిమెల మండలాల మీదుగా భూపాలపల్లి జిల్లా మహారాష్ట్రకు తరలిస్తూ అసాంఘిక మార్గాలుగా మార్చారు.

జిల్లాలో పట్టుబడ్డ ఘటనలు

ఈ నెల 19న అక్రమంగా కారులో తరలిస్తున్న 105 కిలోల గంజాయిని వెంకటాపురం మండల కేంద్రం శివారులో పోలీసులు పట్టుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి రూ.10 లక్షల నిల్వలను సీజ్‌ చేశారు. అక్రమానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది జనవరి 25న మంగపేట మండలం తిమ్మంపేట మూలమలుపు వద్ద మణుగూరు మార్గంలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.30 కోట్ల విలువైన 612 కేజీల గంజాయిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేసి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

గోవిందరావుపేట మండలం పస్రాలో 2020లో 17.5 కేజీలు, 2021లో 2.25 కేజీల గంజాయి నిల్వలను అక్రమార్కుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు.

2020 నవంబర్‌ 1న ద్విచక్రవాహనాలపై బస్తాల్లో తరలిస్తున్న సుమారు 54 కేజీల గంజాయిని ములుగు మండలం పందికుంట ఎక్స్‌ రోడ్డు వద్ద పోలీసులు చేజిక్కించుకున్నారు. పట్టుబడిన సరకు విలువ రూ.4.32 లక్షలు కాగా ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

2020 ఆగస్టు 5న ములుగు మండలం ఇంచర్ల-ఎర్రగట్టమ్మ వద్ద రూ.13.92 లక్షల విలువైన 174 కిలోల నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.


వాహనాల నంబర్లు మార్చి!

సెప్టెంబర్‌ 19న వెంకటాపురం శివారులో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న పోలీసులు

గంజాయిని సేకరిస్తున్న అక్రమార్కులు తరలింపునకు సులభంగా ప్యాక్‌ చేస్తున్నారు. సుమారు 6 కిలోల బరువు ఉండేలా చతురస్రాకారంలో ముద్దలుగా చేసి వాహనాల్లో నిల్వ చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వాహనాలకు ఆంధ్రప్రదేశ్‌ బోర్డును తగిలిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వాహనాలకు తెలంగాణ నంబరు ప్లేట్లను నకిలీవి సృష్టించి వాహనాలకు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వెంకటాపురంలో పోలీసులకు చిక్కిన వాహనాల ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. నిఘా అధికారులను ఏమార్చేందుకు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నంబర్‌ ప్లేట్లను మార్చుతున్నట్లు సమాచారం.


యువత మత్తుకు బానిస  
మన్యంలోని యువత మత్తుకు బానిస అవుతోంది. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పలు గ్రామాల్లో రహస్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. మార్కెట్లో లభ్యమయ్యే సిగరెట్‌లోని నిల్వలను తొలగిస్తున్న స్మగ్లర్లు అందులో గంజాయిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సిగరెట్‌ను రూ.150 నుంచి రూ.200లకు విక్రయిస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts