logo

మహిళల పోషణ స్థితిని మెరుగుపర్చాలి

ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో మహిళల పోషణ స్థితిని మెరుగు పరిచి, ములుగును పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాకాటి సునితా లక్ష్మారెడ్డి ఆదేశించారు. రక్త హీనతను

Published : 29 Sep 2022 02:03 IST

సమీక్షలో సూచనలిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునితా లక్ష్మారెడ్డి

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో మహిళల పోషణ స్థితిని మెరుగు పరిచి, ములుగును పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాకాటి సునితా లక్ష్మారెడ్డి ఆదేశించారు. రక్త హీనతను నివారించేందుకు పౌష్టికాహారం అందించాలన్నారు. పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన పోషణ మాహ్‌-2022 కార్యక్రమం కింద ఏటూరునాగారం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధి అంగన్‌వాడీ టీచర్లతో సంప్రదాయ ఆహార పదార్థాలు మహిళలు, పిల్లల ఆరోగ్య పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య అధ్యక్షతన ఆమె సమీక్షించారు. ఐటీడీఏ పీవో అంకిత్‌, కమిషన్‌ కార్యదర్శి కృష్ణకుమారి, సభ్యులు కుమ్ర ఈశ్వరీభాయి, కటారి రేవతి, కొమ్ము ఉమాదేవి, జి.పద్మ, షహీన్‌ అఫ్రోజ్‌ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ, దివ్యాంగుల విషయంలో చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా సంక్షేమాధికారిణి ఈపీ.ప్రేమలత వివరించారు. అనంతరం సునిత మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లు, వైద్యఆరోగ్య శాఖ తదితర లైన్‌ డిపార్ట్‌మెంట్లన్నీ కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల్లో పోషణ విలువలు పెంచేందుకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. జిల్లాలో 3700 మంది గర్భిణులుంటే అందులో 2700 మంది మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారని తెలిపారు. వారికి సరైన పోషకాహారం అందించాలన్నారు. అందుకు ప్రతి మూడు నెలలకోసారి ఐటీడీఏ పీవో స్థాయిలో, 6 నెలల కోసారి జిల్లా కలెక్టర్‌ స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని ప్రగతిపై చర్చించుకోవాలన్నారు. ఈ సందర్భంగా అడవి తల్లి అందాలను మహిళల గురించి వివరిస్తూ అంగన్‌వాడీ టీచర్లు ఆలపించిన గీతాన్ని విని డీడబ్ల్యూవో, సీడీపీవో, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లను ఆమె అభినందించారు.

ఆరోగ్య సమాజ నిర్మాణానికి కృషి చేయండి

భవిష్యత్‌ తరాల ఆరోగ్య సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఛైర్‌పర్సన్‌ చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏ బడికి వెళ్లి చూసినా పిల్లలు పోషక లోప స్థితిలో కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 65 శాతం మంది రక్త హీనతతో ఇబ్బంది పడుతున్న మహిళలున్నారు. వారంతా ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఏజెన్సీలో ఎక్కువగా పోక్సో కేసులు నమోదవుతున్నాయని, ఆపదలో ఉన్న ఆడపిల్లలు 1098, 181 నంబర్లకు ఫోన్‌ చేసి సేవలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఛైర్‌పర్సన్‌ను, కమిషన్‌ సభ్యులను శాలువాతో సత్కరించారు. స్థానిక ఎంపీపీ విజయ, జడ్పీ కోఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ, అదనపు కలెక్టర్‌ వైవీ.గణేష్‌, సీడీపీవో హేమలత, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

పోషక విలువలున్న ఆహార పదార్థాలను ప్రదర్శిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

బాధిత మహిళలకు రక్షణ కల్పించాలి
ములుగు: సఖి కేంద్రంలో బాధిత మహిళలకు ఉచిత సలహా, కౌన్సెలింగ్‌తో పాటు రక్షణ కల్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునితా లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ములుగులోని సఖి కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని రిజిస్టర్లను పరిశీలించారు. గృహహింస, వరకట్న, లైంగిక వేధింపులు, ఆడ పిల్లల అమ్మకం, అక్రమ రవాణా నివారణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని