logo

వాడీవేడిగా పుర కౌన్సిల్‌ సమావేశం

జనగామ పురపాలిక కార్యాలయంలో బుధవారం ఛైర్‌పర్సన్‌ పోకల జమున అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌హమీద్‌, వైస్‌ఛైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, కమిషనర్‌ గీత, డీఈ

Published : 29 Sep 2022 02:03 IST

వేదికపై ఛైర్‌పర్సన్‌ జమున, అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌హమీద్‌, ప్రజాప్రతినిధులు

జనగామ, న్యూస్‌టుడే: జనగామ పురపాలిక కార్యాలయంలో బుధవారం ఛైర్‌పర్సన్‌ పోకల జమున అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌హమీద్‌, వైస్‌ఛైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, కమిషనర్‌ గీత, డీఈ చంద్రమౌళి సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా అజెండా అంశాలపై చర్చించడానికి బదులు గత సమావేశంలో ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సభ్యులు కోరగా డీఈ వివరణ ఇచ్చారు. వార్డుల వారీగా సభ్యులు సమస్యలను ప్రస్తావించే క్రమంలో తెరాస సభ్యుడు సురేశ్‌రెడ్డి మున్సిపల్‌ ఆదాయ వ్యయాల తనిఖీ అంశాన్ని ప్రస్తావించారు. అది పూర్తయ్యే వరకు గుత్తేదారులకు బిల్లులు ఇవ్వవద్దన్నారు. దీనికి తెరాస ఫ్లోర్‌లీడర్‌ ఎం.పాండు అభ్యంతరం చెప్పగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భాజపా సభ్యుడు హరిశ్చంద్రగుప్త ఇదే అంశంపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ వివరణ కోరారు. ఆడిట్‌ పూర్తయ్యే వరకు గుత్తేదారులకు బిల్లులు ఆపాలని, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. దీంతో ఆయనతోనూ పాండు వాగ్వాదానికి దిగారు. భాజపా సభ్యురాలు ప్రేమలతారెడ్డి మున్సిపల్‌ నిధులను ఇతర శాఖల అవసరాలకు వెచ్చించే విధానం సరికాదని మాట్లాడుతుండగా ఆమెతోనూ వాగ్వాదానికి దిగడంతో, భాజపా సభ్యులు ఊడ్గుల శ్రీలత, బొట్ల శ్రీనివాస్‌ ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి ఆడిట్‌ జరగలేదని, ఇలాగే ఉంటే, కొన్ని నిధులు రావని అకౌంటెంట్‌ సంతోషి సభకు వివరించారు. బిల్లులు ఆపాలని చట్టంలో ఉందా? అని కమిషనర్‌ రజిత ప్రశ్నించగా.. చట్ట ప్రకారం ఆడిట్‌ జరగాలని ఉందా లేదా అని సభ్యులు ప్రశ్నించారు. అదనపు కలెక్టర్‌ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ గాదెపాక రాంచందర్‌ మాట్లాడుతూ రూ.30 కోట్ల ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదని, విభాగినుల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని  ప్రశ్నించారు. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు, కూడళ్ల వద్ద సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు, పింఛను డబ్బులు రాక లబ్ధిదారుల ఇబ్బందులు, రైల్వేకల్వర్టు అనుసంధాన పనులపై వివరణ కోరారు. సభ్యులు రామగళ్ల అరుణ, ఎం.సుమలత, ఊడ్గుల శ్రీలత, కళ్యాణి, పేర్ని స్వరూప, బండ పద్మ, అనిత, దయాకర్‌లు వార్డుల్లోని సమస్యలను వివరించారు. పట్టణంలో పందులు, కుక్కల బెడదను నివారించాలన్నారు. అజెండాలోని అన్ని అంశాలకు ఆమోదం లభించిదని కమిషనర్‌ రజిత ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని