logo

బీసీ రుణాలకు దరఖాస్తుదారుల ఎదురుచూపులు

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాల పథకాన్ని ప్రవేశపెట్టింది.

Updated : 01 Oct 2022 06:42 IST

దరఖాస్తులు అందజేస్తున్న యువకులు (పాతచిత్రం)

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాల పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో వేలాది మంది యువకులు యూనిట్ల వారీగా దరఖాస్తు చేసుకున్నారు. వీరు రుణాల కోసం ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నిరుత్సాహమే మిగిలింది.
జిల్లాలో బీసీ సంక్షేమశాఖ ద్వారా 2017-18లో స్వీకరించిన అర్జీలకు నేటికీ మోక్షం లభించలేదు. జిల్లా జనాభాలో బీసీలే అత్యధికంగా ఉన్నారు. ఆయా వర్గాలకు చెందిన కులవృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోలేక ఉపాధికి దూరమై అవస్థలు పడుతున్నారు. విద్యావంతులకు ఉద్యోగావకాశాలు లేక ఉసూరుమంటున్నారు. బీసీ కార్పొరేషన్‌ రుణాలివ్వకపోవడంతో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు.


జిల్లాలో బీసీ జనాభా (2011 లెక్కల ప్రకారం): 3.59 లక్షలు
రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారు: 4,645
కేటగిరీ - 1కి వచ్చిన దరఖాస్తులు: 1409
అర్హులుగా గుర్తించింది: 832
వీరికి కేటాయించింది: రూ.4.16 కోట్లు


జిల్లాలో ఇదీ పరిస్థితి !
కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. నిరుద్యోగులకు ఉపాధి కొరవడింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీసీˆ కార్పొరేషన్‌ నుంచి నిరుద్యోగులకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 4,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.లక్షలోపు యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారికి శతశాతం రాయితీ కింద రూ.50 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులైనా పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. కేటగిరీ-1లో 1409 దరఖాస్తులు రాగా 832 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.4.16 కోట్లు రావాల్సి ఉంది. 577 మందివి పెండింగ్‌లో ఉన్నాయి. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి మౌఖిక పరీక్షలు నిర్వహించినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా మంజూరు కాకపోవడం శోచనీయం.

ఐదేళ్లుగా నిరీక్షణ !
జనగామ గ్రామీణం, పట్టణ ప్రాంతాల నుంచి అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. యూనిట్‌ విలువ ఆధారంగా విభాగాలుగా విభజించారు. రూ.లక్షలోపు యూనిట్లకే నిధులు మంజూరు చేసి కొంతమందికే నిధులు పంపిణీ చేసి మిగతా వారికి నిరాశ మిగిల్చారు.  ఇక రూ.లక్షకు మించిన యూనిట్లకు సంబంధించిన ఊసే లేదు. నాడు సార్వత్రిక ఎన్నికల నిబంధనతో  రుణాల మంజూరు ఆగిపోయిందని అధికారులు చెప్పారు. ఎన్నికలు ముగిసినా ఇప్పటికీ రుణాలు అందకపోవడంతో యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


స్పష్టత కరవైంది
-జి.సిద్ధార్థ, నిడిగొండ, రఘునాథపల్లి

స్వయం ఉపాధికి కారు కొనుగోలు చేసేందుకు రూ.5 లక్షల రుణానికి దరఖాస్తు చేసుకున్నాను. ఐదేళ్లు గడిచింది. దరఖాస్తు చేసుకునేందుకు రూ.వెయ్యి వరకు ఖర్చయింది. ఇప్పటివరకూ ఎలాంటి రుణం అందలేదు. అసలు రుణం వస్తుందో రాదో అనే దానిపై స్పష్టత కరవైంది. ప్రభుత్వం వెంటనే రుణాలందిస్తే ఎంతో మంది యువతకు ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నా.


ప్రభుత్వం ఆదేశాలిస్తేనే.. !
-రవీందర్‌, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి

బీసీˆ కార్పొరేషన్‌ రుణాలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న చాలామంది రుణాల మంజూరు కోసం అడుగుతున్నారు. కేవలం రూ.50వేల యూనిట్ల వారికి మాత్రం కొందరికి అందజేశాం. అసలు వస్తాయా రావా అనేది ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే చెప్పగలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని