logo

సిబ్బంది కొరత.. కదలని దస్త్రం!

జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఖాళీలతో దస్త్రాలు ముందుకు కదలడం లేదు. భూ సమస్యల పరిష్కారంతో పాటు ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతుండడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. 

Published : 01 Oct 2022 06:16 IST

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఖాళీలతో దస్త్రాలు ముందుకు కదలడం లేదు. భూ సమస్యల పరిష్కారంతో పాటు ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతుండడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.  ఇద్దరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టరు పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. సాధారణ బదిలీల్లో ఒక పోస్టు ఖాళీ కాగా, మరొకర్ని విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ 2022 మే 5న సరెండర్‌ చేశారు. ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మండల స్థాయి అధికారుల్లో తహసీల్దార్‌తో పాటు నయాబ్‌ తహసీల్దార్‌ ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయంలో వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించడంతో తహసీల్దార్‌ అధిక సమయం ఆ పనిలోనే నిమగ్నమవాల్సి వస్తోంది. జిల్లా కేంద్రం కావడంతో మంత్రులు, ఇతర అధికారిక పర్యటనలో ప్రొటోకాల్‌లో ఈ కార్యాలయం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తోంది. గతంలో మండలంలో 21 వీఆర్‌ఏ పోస్టులకు 15 మంది విధులు నిర్వహించేవారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించి వేరే కార్యాలయాల్లో సర్దుబాటు చేశారు. 61 మంది వీఆర్‌ఏలు ఉండగా సమ్మెలో ఉండడం కూడా సమస్య తీవ్రంగా మారింది. విభాగాల సిబ్బంది ప్రస్తుతం లేకపోవడంతో ఉన్నవారిపై పని ఒత్తిడి పెరుగుతోంది. మండలంలోని 41 గ్రామాల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగి వెళుతున్నారు. కొన్ని సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర విచారణ చేసి వాస్తవ నివేదిక ఇవ్వాల్సిన అధికారులు గ్రామాల్లోని కొందరి వ్యక్తులపై ఆధారపడడంతో దళారులుగా అవతారమెత్తి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
సమస్యలు ఇవీ...
రోజూ 200 వరకు ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, జనన, మరణ సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రాల్లో  దరఖాస్తులు చేసి వాటి కోసం కార్యాలయానికి వస్తున్నారు. విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఆదాయానికి సంబంధిత పత్రాలు త్వరగా జారీ అవుతున్నా, నివాసం, కుల ధ్రువీకరణ పత్రంలో జాప్యం జరుగుతోంది.
* కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం లబ్ధిదారుల ఎంపిక,  భూముల సమస్య, పేర్లు మార్పిడి, ఇతర తప్పొప్పుల సవరణ, పీవోటీ స్థలాల పరిష్కారంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
* ఇటీవల ప్రభుత్వం జిల్లా కేంద్రంలో జీవో 58, 59 ఉత్తర్వుల అమలులో భాగంగా నియమించిన సర్వే బృందానికి కూడా రెవెన్యూ అధికారుల సహకారం  ఉండాల్సిందిగా అదీ కూడా అదనపు భారంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని