logo

రామప్ప ప్రాశస్థ్యం.. విశ్వవ్యాప్తం!

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు నిర్వహించిన వరల్డ్‌ హెరిటేజ్‌ వాలంటీర్‌ శిబిరం శుక్రవారం పూర్తైంది. 12 రోజుల పాటు వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ, సాంకేతిక పరిజ్ఞానం, యునెస్కో గుర్తింపు ఎలా వచ్చింది..

Published : 01 Oct 2022 06:16 IST

వెంకటాపూర్‌ (ములుగు జిల్లా), న్యూస్‌టుడే: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు నిర్వహించిన వరల్డ్‌ హెరిటేజ్‌ వాలంటీర్‌ శిబిరం శుక్రవారం పూర్తైంది. 12 రోజుల పాటు వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ, సాంకేతిక పరిజ్ఞానం, యునెస్కో గుర్తింపు ఎలా వచ్చింది.. అనే అంశాలపై వాలంటీర్లకు తరగతులు, క్షేత్ర పరిశీలన నిర్వహించారు. శిబిరం విజయవంతంగా ముగిసిన సందర్భంగా వాలంటీర్లు, నిర్వాహకులు తమ మనోభావాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.


మరింత ప్రచారం లభించనుంది..
- కుసుమ సూర్యకిరణ్‌,  అసిస్టెంట్‌ టూరిజం ప్రోగ్రాం అధికారి

నేను 20 సంవత్సరాల నుంచి పర్యాటక శాఖలో పనిచేస్తున్నా. యునెస్కో గుర్తింపుతో భారతదేశంలోని 40, ప్రపంచంలోని 1146 కట్టడాల జాబితాలో రామప్ప చేరడంతో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి వరల్డ్‌ హెరిటేజ్‌ వాలంటీర్ల శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం యునెస్కో గుర్తింపే. కాకతీయ కట్టడాలు, పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రచారం లభించనుంది.


మరిన్ని శిబిరాలతో ప్రయోజనకరం -గుగులోతు మహేష్‌, శిబిరం ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడు
నేను కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌ను. రామప్ప యునెస్కో గుర్తింపు పొందడం కోసం జపాన్‌లో నా వంతు కృషి చేశాను. ప్రస్తుతం శిబిరంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల, దేశాల వాలంటీర్లతో నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నా. జిల్లాను టూరిజం హబ్‌గా చేయాలంటే టాంజిబుల్‌, ఇన్‌టాంజిబుల్‌ కల్చర్లతో కూడిన టూరిజం ప్యాకేజీని ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుంది.


ఏటా నిర్వహిస్తాం
- పాండురంగారావు, ఇంటాక్‌ కన్వీనర్‌, విశ్రాంత ప్రొఫెసర్‌

యునెస్కో గుర్తింపుతో రామప్పకే కాదు పూర్వ వరంగల్‌ జిల్లాలోని లివింగ్‌, బిల్టు, నాచురల్‌, ఇంటాంజిబుల్‌ హెరిటేజ్‌ ప్రాంతాలకు మహర్దశ రానుంది. ఈ క్యాంపు ద్వారా రామప్పతో పాటు ఈ ప్రాంతంలోని అన్ని రకాల హెరిటేజ్‌ ప్రాంతాల గురించి వివరించాం. ప్రపంచ స్థాయిలో వీటి ప్రాశస్థ్యాన్ని తీసుకువెళ్లేందుకు వాలంటీర్లు కృషి చేస్తారనే నమ్మకం కలిగింది. ఏటా శిక్షణ శిబిరాలు జరుగుతూనే ఉంటాయి.


మొదటి అడుగు పడింది
-శ్రీధర్‌రావు, ఇంటాక్‌ సభ్యుడు

యునెస్కో ఆదేశాల మేరకు నిర్వహించిన మొదటి శిబిరం ఇది. ప్రపంచంలోని చాలా దేశాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. కాని వారికి వీసాలు అనుమతించడం వీలు కాలేదు. నాలుగు దేశాల వారికి మాత్రమే వీలు కలిగింది. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వచ్చిన 50 మంది వాలంటీర్లతో నిర్వహించిన మొదటి శిబిరం చాలా విజయవంతమైంది. వాలంటీర్లంతా వివిధ రంగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు కావడంతో లక్ష్యం పూర్తవుతుందని భావిస్తున్నాం.


అదృష్టంగా భావిస్తున్నా
ఎస్‌.గీతశ్రీ, ఏటూరునాగారం

స్థానికురాలినే అయినా బొగత జలపాతం, మల్లూరుగుట్ట, మేడారం, లక్నవరం, రామప్ప లాంటి పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యత అస్సలు తెలియదు. శిబిరంతో పక్క జిల్లాలోని పాండవుల గుట్ట, గణపురం కోటగుళ్లు, వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట లాంటి ప్రదేశాలపై కూడా పట్టు వచ్చింది.


ప్రశాంతతకు మారు పేరు
ఐలా, ఇథియోపియా

రామప్ప గురించి చాలా విన్నాను. ఎప్పుడు చూద్దామన్నా.. అవకాశం రాలేదు. హెరిటేజ్‌ శిబిరం నిర్వహిస్తున్నట్లు యునెస్కో సైట్లో చూసి దరఖాస్తు చేసుకున్నా. పన్నెండు రోజుల శిక్షణలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం, సంస్కృతీ సంప్రదాయాలు, ప్రాచీన కట్టడాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అవకాశం వస్తే మరో శిబిరానికి రావడానికి కృషి చేస్తా. ఇక్కడి ప్రత్యేకతను చాటి చెప్తాను.


కొత్త విషయాలు తెలుసుకున్నా
మహిత, ఖమ్మం జిల్లా

నేను బీఏ ఆర్కిటెక్టు చదువుతున్నా. ఈ క్యాంపులో పాల్గొనడం వల్ల కాకతీయుల గొప్పదనంతో పాటు ఇతర సబ్జెక్టులపై చాలా విషయాలు తెలిశాయి. వివిధ అంశాల్లో నిపుణుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని