logo

మారుతున్నాం.. మహాత్మా!

నవ సమాజ నిర్మాణంలో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత ముఖ్యమైంది. బహిరంగ మల విసర్జన దారుణం. సభ్య సమాజం తల దించుకునేలా మహిళలు సిగ్గుతో కుమిలి పోతున్నారు.  పారిశుద్ధ్య స్థితిని మెరుగు పరచాలి. దేశం అభివృద్ధి పథాన పయనించేందుకు అది తొలి మెట్టు అవుతుంది.

Published : 02 Oct 2022 03:56 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో ఓరుగల్లుకు మెరుగైన ర్యాంకులు
నేడు గాంధీ జయంతి
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌, నర్సంపేట, వర్ధన్నపేట

నవ సమాజ నిర్మాణంలో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత ముఖ్యమైంది. బహిరంగ మల విసర్జన దారుణం. సభ్య సమాజం తల దించుకునేలా మహిళలు సిగ్గుతో కుమిలి పోతున్నారు.  పారిశుద్ధ్య స్థితిని మెరుగు పరచాలి. దేశం అభివృద్ధి పథాన పయనించేందుకు అది తొలి మెట్టు అవుతుంది.

- మహాత్మాగాంధీ

స్వచ్ఛత కోసం పరితపించిన బాపూజీ అడుగుజాడల్లో మన నగరాలు, పురపాలికలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2022 పోటీలో జాతీయ స్థాయిలో మన పట్ణణాలు ముందడుగు వేశాయి. గతం కంటే మెరుగైన ర్యాంకులు సాధించి దేశంలో ఏ నగరానికీ, పట్టణానికీ తీసిపోమని నిరూపించాయి. శనివారం సాయంత్రం దిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛభారత్‌ ర్యాంకులు ప్రకటించింది.  ఆదివారం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని మన పట్టణాలు సాధించిన స్వచ్ఛ ప్రగతిపై ప్రత్యేక కథనం..

2021లో వరంగల్‌కు 115వ ర్యాంకు రాగా, ఈసారి 31 ర్యాంకులు పైకి ఎగబాకింది.  సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌, సర్వీస్‌ లెవల్‌ బెంచి మార్కింగ్‌ (డాక్యుమెంటేషన్‌)లో గ్రేటర్‌ వరంగల్‌ మంచి ప్రతిభ కనబరిచింది.

స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ నిర్వహిస్తోంది. పట్టణాల్లో పారిశుద్ధ్యం పనులు మెరుగుపరిచే లక్ష్యంతో ఆరోగ్యకరమైన పోటీ చేపట్టింది. 2021-22 సంవత్సరానికి ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 4355 పట్టణాలు పాల్గొన్నాయి. నాలుగైదు నెలలుగా స్వచ్ఛ భారత్‌ టీంలో పట్టణాల్లో పారిశుద్ధ్యం విధానాలు, ప్రణాళికలు పరిశీలించి మార్కులు ఖరారు చేశారు.


పౌరుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్న బల్దియా సిబ్బంది

జనాభా ప్రాతిపదికన నిర్వహించిన స్వచ్ఛ పోటీల్లో..
* నగరాల విభాగంలో వరంగల్‌ స్థానం: 84
* పట్టణాల విభాగంలో  వర్ధన్నపేట:  7  నర్సంపేట: 17   పరకాల: 12

మరింత మెరుగుపడాలి..
వరంగల్‌కు చెత్త రహితం, శుద్ధీకరణ, ప్లాస్టిక్‌ తదితర అంశాల్లో సున్నా మార్కులొచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ మార్కులు తగ్గడానికి ప్రధాన కారణం చెత్త శుద్ధీకరణ లేకపోవడమేనని నిపుణులంటున్నారు. వరంగల్‌ను చెత్త రహితం చేయడం, చెత్త శుద్ధీకరణ కోసం ప్రారంభించిన బయోమైనింగ్‌ ప్రాజెక్టు పనులు ఆపేయడంతో మార్కులు తగ్గాయి.

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 పోటీలో 4355 పట్టణాలు పాల్గొన్నాయి.
* సర్వీస్‌ లెవల్‌ బెంచి (ఎస్‌ఎల్‌బీ)లో 3 వేలు, సర్టిఫికేషన్‌లో 2250, సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌లో 2250 చొప్పున మొత్తం 7500 మార్కులు నిర్ణయించారు.
* గ్రేటర్‌ వరంగల్‌కు ఎస్‌ఎల్‌బీలో 2145, సర్టిఫికేషన్‌లో 600, సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌లో 1932 మార్కులొచ్చాయి. 4677 మార్కులతో 84వ స్థానం దక్కింది.

టాప్‌-10 మా లక్ష్యం : - గుండు సుధారాణి, మేయరు
గతేడాది కంటే ర్యాంకు మెరుగైంది. జాతీయ స్థాయిలో 84 సాధించడం సంతోషంగా ఉంది. కమిషనర్‌, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల కృషితోనే జరిగింది. వచ్చే ఏడాది టాప్‌-10లో నిలిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని