logo

5 కిలోమీటర్లు.. 500 గుంతలు

బచ్చన్నపేట నుంచి దుద్దెడకు వెళ్లే 365బీ జాతీయరహదారి గుంతలమయంగా మారింది. అడుగడుగునా గోతులు ఉండడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. బచ్చన్నపేట నుంచి ఆలీంపూర్‌ వరకు కేవలం 5 కి.మీ. పరిధిలో సుమారు 500 గుంతలు ఏర్పడ్డాయి.

Published : 03 Oct 2022 01:54 IST

బచ్చన్నపేట కమాన్‌ సమీపంలో...

బచ్చన్నపేట, న్యూస్‌టుడే: బచ్చన్నపేట నుంచి దుద్దెడకు వెళ్లే 365బీ జాతీయరహదారి గుంతలమయంగా మారింది. అడుగడుగునా గోతులు ఉండడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. బచ్చన్నపేట నుంచి ఆలీంపూర్‌ వరకు కేవలం 5 కి.మీ. పరిధిలో సుమారు 500 గుంతలు ఏర్పడ్డాయి. గతంలో ఈ రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్లేందుకు 10 నిమిషాల సమయం పట్టేదని, ప్రస్తుతం 30 నిమిషాలు పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కొమురవెల్లికి వెళ్లే వాహనాలు ఈ మార్గంలోనే వెళ్తుంటాయి. ఈ రహదారిలో నిత్యం సుమారు 4000 వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు గాయాలపాలయ్యారు. రెండు నెలల క్రితం ముస్త్యాలకు చెందిన వాహనదారుడు గుంతల కారణంగా కింద పడి మృతి చెందాడు.

భారీ వాహనాలతో రద్దీ
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు అనుసంధానమైన ఈ రహదారిలో నిత్యం వందలాది భారీ వాహనాలు తిరుగుతుంటాయి. బచ్చన్నపేట నుంచి చేర్యాల వరకు పలు చోట్ల గుంతలు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేస్తుండడంతో ప్రయోజనం ఉండడం లేదని, శాశ్వతంగా నిలిచేలా పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

తరచూ ప్రమాదాలు

-పిట్టల శ్యామ్‌, గంగాపూర్‌, బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట నుంచి ఆలీంపూర్‌కు వెళ్లే రహదారిపై అడుగడుగునా గుంతలు ఉండడంతో ప్రమాదకరంగా మారింది. ప్రతి రోజూ ఈ మార్గంలో గంగాపూర్‌కు వెళ్తాను. పెద్ద గుంతలు ఉండడంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధిక లోడు కలిగిన వాహనాలు తిరుగుతుండడంతో రోడ్డు ధ్వంసమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని