logo

చివరికి అడియాసలే..!

జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న రెండోదశ ఎస్సారెస్పీ కాలువల నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు. అక్కడక్కడ ఉప కాలువల నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగడం లేదు. దాంతో వాటి పరిధిలోని చివరి ఆయకట్టు, చెరువులకు గోదావరి జలాలు అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Published : 03 Oct 2022 01:54 IST

నర్సింహులపేటలో అసంపూర్తిగా ఉన్న కాలువ

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న రెండోదశ ఎస్సారెస్పీ కాలువల నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు. అక్కడక్కడ ఉప కాలువల నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగడం లేదు. దాంతో వాటి పరిధిలోని చివరి ఆయకట్టు, చెరువులకు గోదావరి జలాలు అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పనులను పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ కోసం సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు రైతులను సంప్రదిస్తున్నా.. వారు భూమి ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. గతంలో వారికి రావాల్సిన పరిహారం సొమ్మును ఇతరులకు చెల్లించారని..ఇప్పుడు కూడా అలానే తమకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో ముందుకు రావడం లేదని సమాచారం.

అడ్డంకులు ఇవే..
రెండో దశ కాలువల ఉపకాలువల నిర్మాణానికి తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. అక్కడ దాదాపు పనులన్నీ పూర్తి అయ్యాయి.

డోర్నకల్‌ నియోజకవర్గం పరిధిలోని దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ, చిన్నగూడూరు పరిధిలోనే అడ్డంకులు ఉన్నట్లు సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

దంతాలపల్లి మండలంలో 10 ఎల్‌ ఉపకాలువ నిర్మాణానికి బోడ్లాడ సమీపంలో రెండు ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. రామవరం గ్రామంలోనూ 9ఆర్‌ కాలువకు సంబంధించి 2 కిలోమీటర్ల పరిధి నుంచి 2.65 కిలోమీటర్ల వరకు కావాల్సిన భూసేకరణ చేయాల్సి ఉంది.

నర్సింహులపేట మండలంలోని సోమ్లాతండాలోని 6ఎల్‌, 11ఎల్‌, కొమ్ములవంచ ప్రాంతంలోని 10 ఎల్‌ ఉపకాలువ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ఇంకా కాలేదు. కొమ్ములవంచ వద్దనే మూడెకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంది. 

మరిపెడ మండల పరిధిలో సుమారు 20 ఎకరాలకు వరకు భూసేకరణ చేయాల్సి ఉందని అ ప్రాంత ఇంజినీరింగ్‌ అధికారి తెలిపారు. చాలా వరకు కాలువల నిర్మాణం పూర్తైన్నప్పటికీ మధ్యలో పెద్ద రాళ్లు రావడం వాటిని తొలగించక, కొన్ని చోట్ల రైతులు మొదట్లో భూములు ఇవ్వకపోవడంతో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ అడ్డంకులను సకాలంలోనే తొలగించి చివరి ఆయకట్టు రైతులందరికీ సాగు నీరందిస్తామని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

మొదటి దశ రైతుల్లో ఆనందం
ఎస్సారెస్పీ స్టేజీ-1కు ఎలాంటి అడ్డంకులు లేవు. వరంగల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజపల్లిలోని ప్రధాన కాలువ నుంచి డీబీఎం-48 నుంచి ప్రారంభమై మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం వెన్నారం వరకు కొనసాగింది. దీని పరిధిలో 1,35,846 ఎకరాల ఆయకట్టు ఉంది. మట్టి, చెట్ల పొదలతో కూరుకుపోయిన కాలువలను సుమారు నాలుగేళ్ల కిందట రూ.100 కోట్ల నిధులతో పునరుద్ధరణ పనులు చేయించారు. ఇప్పుడు ఈ కాలువల ద్వారా చివరి ఆయకట్టుకు పుష్కలంగా సాగు నీరందుతున్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని