logo

పాలకమండలి సమావేశాలకు గ్రహణం!

ఏటూరునాగారం ఐటీడీఏలో పాలకమండలి సమావేశాల ఊసే లేకుండా పోయింది. సుమారు మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోవడం లేదు. వివిధ శాఖల్లో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. ఫలితంగా గిరిజనాభివృద్ధి కుంటుపడుతోంది. ఐటీడీఏలోని కీలక శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Published : 03 Oct 2022 01:54 IST

మూడేళ్లుగా నిర్వహణలో జాప్యం

ఏటూరునాగారంలోని డ్రైమిక్స్‌ యూనిట్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏటూరునాగారం ఐటీడీఏలో పాలకమండలి సమావేశాల ఊసే లేకుండా పోయింది. సుమారు మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోవడం లేదు. వివిధ శాఖల్లో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. ఫలితంగా గిరిజనాభివృద్ధి కుంటుపడుతోంది. ఐటీడీఏలోని కీలక శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌, విద్య విభాగాలు మినహా మిగతావి కానరావడం లేదు. దశాబ్ద కాలంగా వ్యవసాయ విభాగం నుంచి చేసిన కార్యక్రమాలేవీ లేవు. 60వ పాలక మండలి సమావేశాన్ని 2019 డిసెంబర్‌ 20న నిర్వహించారు. అప్పటి నుంచి 61వ సమావేశం నిర్వహణకు నోచుకోలేదు.

పలు శాఖల్లో పోస్టులు ఖాళీ
ఐటీడీఏలో పరిపాలనా, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, వైద్య, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌, ఉప విద్యా శాఖాధికారి, గిరిజన సహకార సంస్థ, మత్స్య పరిశ్రమ శాఖ, ఉద్యానవన, వ్యవసాయ, పట్టు పరిశ్రమ.. ఇలా పలు శాఖల్లో అధికారులు, సిబ్బంది పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. 2 వ్యవసాయాధికారుల పోస్టులుండగా అందులో ఒకరు పీఏవో స్థాయిలో, మరొకరు వ్యవసాయాధికారిగా పని చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం పీఏవోగా పని చేసిన లక్ష్మీ ప్రసన్నను ప్రభుత్వం మాతృశాఖకు బదిలీ చేసింది. దీంతో ఆ శాఖ మొత్తానికే ఖాళీ అయింది. ఏఈవో 1, డేటా ప్రాసెసింగ్‌ అధికారి 1, సీనియర్‌ అసిస్టెంట్‌ 3, సీనియర్‌ అకౌంటెంట్‌ 2, సబ్‌ అసిస్టెంట్‌ 1, స్టెనో కమ్‌ టైపిస్ట్‌ 1, ష్రాఫ్‌ 1, డ్రైవర్‌ 2, అటెండర్లు 1, మాలి 2, రాత్రి కాపలాదారు 1.. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశుగణాభివృద్ధి శాఖ పత్తా లేకుండా పోయింది.

యూనిట్లకు గడ్డు కాలం
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ పథకం కింద అందించిన యూనిట్లు కుంటి నడకన నడుస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 8 యూనిట్లు మంజూరు చేశారు. సెంట్రింగ్‌ యూనిట్లు, కాంక్రీటు మిక్సింగ్‌ యంత్రాలను అందజేశారు. ఈ యూనిట్లను గ్రూపులుగా ఏర్పాటు చేసి ఒక్కో గ్రూపునకు ఒక యూనిట్‌ను అందించారు. మరో ఐదు గ్రూపులకు అందించాల్సి ఉంది. రుతు రుమాళ్లు, డిటర్జెంట్‌ సబ్బుల తయారీ, డ్రైమిక్స్‌, డిటర్జెంట్‌ యూనిట్ల నిర్వాహకులు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు మాత్రమే తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. బయటి మార్కెట్‌కు అమ్మేందుకు వీలు లేకుండా పోయింది. మళ్లీ జీసీసీ ఆర్డర్‌ వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. డ్రైమిక్స్‌ యూనిట్‌ నిర్వాహకులు కూడా జీసీసీ ఇండెంట్‌ ఇస్తేనే తయారు చేసి సరఫరా చేస్తున్నారు. జీసీసీ ఆర్డర్‌ ఇవ్వకపోతే యూనిట్లు మూతపడే పరిస్థితి నెలకొంది.

తీర్మానాలు నామమాత్రమే..
సకాలంలో తదుపరి సమావేశం నిర్వహిస్తామంటూ ప్రతి పాలక మండలి సమావేశంలో తీర్మానిస్తారు. కానీ సమయానికి ఏ ఒక్క సమావేశం కూడా నిర్వహణ చేపట్టలేదు. 59వ, 60వ సమావేశాల మధ్య రెండేళ్ల విరామం నెలకొంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సి ఉంటుంది. సకాలంలో నిర్వహిస్తే సభ్యులంతా పథకాల అమలు తీరుపై సమగ్రంగా చర్చించగలుగుతారు. తద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గిరిజనులకు అందుతున్నాయా లేదా తెలుస్తుంది. పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

సకాలంలో అందని ‘ఆర్థిక స్వావలంబన’
ఐటీడీఏలో ప్రధానంగా అమలయ్యే ఆర్థిక స్వావలంబన పథకం అడవి బిడ్డలకు సకాలంలో అందడం లేదు. వ్యవసాయ, విద్య, స్వయం ఉపాధి, వృత్తి, ఉద్యోగ శిక్షణల వంటి ఎన్నో రంగాల్లో ఈ పథకం కింద కిరాణ దుకాణాలు, జిరాక్స్‌ సెంటర్లు, ఇటుకల తయారీ వంటి చిన్న చిన్న పరిశ్రమలు, వాహనాలు, షామియానా దుకాణాల వంటి తదితర ఎన్నో రకాల యూనిట్లు, బ్యూటీషియన్‌ కోర్సులో, డ్రైవింగ్‌లో శిక్షణలు వంటి కార్యక్రమాలను అందిస్తారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3,375 మంది గిరిజనులకు రూ.34.73 కోట్ల సబ్సిడీ అందేలా వివిధ యూనిట్లను అందించేందుకు లక్ష్యంగా తీసుకున్నారు. సంబంధిత యూనిట్లలో సగానికి పైగా ఇంత వరకు లబ్ధిదారులకు అందించలేదు. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరపు యూనిట్లు కూడా ఇంకా కొందరికి అందించాల్సి ఉంది. 2018-19, 2019-20లో ప్రతిపాదనలే చేయలేదు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన యూనిట్లు ఇంకా అందలేదు.

ఈ నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు

- అంకిత్‌, పీవో, ఐటీడీఏ
ఐటీడీఏ 61వ పాలక మండలి సమావేశం ఈ నెలలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే గౌరవ సభ్యులు సమయాన్ని కేటాయించాలని కోరాం. కరోనా వ్యాప్తి కారణంగా జాప్యం జరిగింది. సంబంధిత ఎజెండా అంశాలను కూడా సిద్ధం చేశాం. అనుకూల సమయాన్ని చూసి సమావేశం ఏర్పాటు చేస్తాం.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts