logo

పూల సంబరం.. జీవన చిత్రం

బతుకమ్మ.. ప్రకృతి పండగ. ఒకవైపు పూల గుబాళింపు, మరోవైపు మది నిండా ఆధ్యాత్మిక చింతన నింపే వేడుక. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక. మొదట మహిళలు మట్టితో తయారు చేసే ‘బొడ్డెమ్మ’ను పూజిస్తారు. తరువాత బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..

Published : 03 Oct 2022 01:54 IST

నేడు సద్దుల బతుకమ్మ

న్యూస్‌టుడే, డోర్నకల్‌

బతుకమ్మ.. ప్రకృతి పండగ. ఒకవైపు పూల గుబాళింపు, మరోవైపు మది నిండా ఆధ్యాత్మిక చింతన నింపే వేడుక. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక. మొదట మహిళలు మట్టితో తయారు చేసే ‘బొడ్డెమ్మ’ను పూజిస్తారు. తరువాత బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయత, భక్తితో బతుకమ్మను ఇంటి దేవతలా పూజిస్తారు. ఈ ఉత్సవం  ప్రకృతితో కలిసిమెలిసి జీవనం చేయమంది. పర్యావరణం, నీటి సంరక్షణ దిశగా అడుగులు వేయడానికి ప్రేరణగా  నిలుస్తుంది.  జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. నేటి సద్దుల  బతుకమ్మను పురస్కరించుకుని ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


పాటలకు ప్రేరణగా నిలుస్తూ..

బతుకమ్మ మధ్యలో ఉంచే దీపం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని సూచిస్తుంది. ఈ పండగ విశిష్టత, ప్రాధాన్యం ప్రపంచానికి తెలిపేలా కవులు, సాహిత్యవేత్తలు, కళాకారులు చేస్తున్న కృషి మాటల్లో వర్ణించలేనిది. కొందరికిది బతుకు బాట చూపుతోంది. బతుకమ్మ వస్తుందంటే చాలు చాలా మంది తమ కలాలకు పదును పెడతారు. సరికొత్త పాటలు రాస్తుంటారు.
మహబూబాబాద్‌ మండలం కొత్త రెడ్యాలకు చెందిన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుడు దేశెట్టి ప్రవీణ్‌ కుమార్‌ బతుకమ్మ ఇతివృత్తంతో అనేక రచనలు చేసి సీడీల రూపకల్పన చేశారు. వీటికిమూఢ నమ్మకాలు, పల్లె గోస, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధన కోసం వందకు పైచిలుకు పాటలు రాసి వేదికలపై ఆలపించారు. ఈయన చేతుల్లో నుంచి జాలువారిన బతుకు పాటల్లో ఇదొకటి.  

పచ్చని పచ్చని పంటల నడుమ.. మా బతుకమ్మ
ఇంటి ఇంటికి చేరినావు.. గౌరమ్మ
ఇగ అందాల ఊరిలోన.. నిలిపేమమ్మ
మా ఆడపడుచులు సంబురాలు జేసేనమ్మ..

 


నీటి సంరక్షణ బాధ్యతను గుర్తు చేస్తూ..
 

‘గుమ్మడి జూలు పూయగ బతుకు
తంగేడి పసిడి చిందర బతుకు
పచ్చని పసిరిక బయళ్ల బతుకు
పల్లెపట్టుల మాటల బతుకు
సీతాఫల కనుగడ్డుగ బతుకు
నల్లపూసల నడుమనె బతుకు’

..అంటూ ప్రజాకవి కాళోజీ ప్రకృతి బతుకమ్మను సామాజిక జీవన చైతన్యంగా బతుకుతూ వర్ధిల్లాలని బతుకమ్మకు అక్షర నీరాజనాలు పలికారు. తొమ్మిది రోజులు కొలిచాక బతుకమ్మను సమీప నీటి వనరుల్లో నిమజ్జనం చేస్తుంటాం. దీనికో శాస్త్రీయత ఉంది. తంగేడు, మందారం, గునుగు, బంతి, చామంతి, కనకాంబరం, మల్లెలు, గన్నేరు, గుమ్మడి, జడ కుచ్చులు, గులాబి, కట్ల పూలు, పోక పూలకు పూలకు ఔషధ లక్షణాలు ఉండటంతో వీటి వల్ల చెరువులు, కుంటలు, వాగులలోని నీరు శుభ్రమవుతుంది. ఈ స్ఫూర్తిని అందుకుని ఉమ్మడి జిల్లాలోని చెరువులు, కుంటల సంరక్షణ మనందరి కర్తవ్యం కావాలని మనకు నేర్పే పాఠం. నీటిని కలుషితం చేసే ఏ పనీ చేయబోమని ప్రతిజ్ఞ బూనుదాం.


ప్రకృతిని కాపాడుకుందామంటూ..


చాప్లాతండాలో కనుచూపు మేర పరచుకున్న పచ్చదనం

చెట్ల ప్రాధాన్యాన్ని పూల బతుకమ్మ మనకు చెప్పకనే చెబుతుంది. బతుకమ్మ బాటలో ప్రకృతిని ఆరాధిస్తే అది మన మేలు కోరుతుందనేది నిజం. వనాలను రక్షించాలని బతుకమ్మ చెబుతోంది. హరితహారంలో మొక్కలు నాటడంతో పాటు.. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చాప్లాతండాలో కనుచూపు మేర కానవస్తాయి. సర్పంచి బానోతు పాండూనాయక్‌, ఉప సర్పంచి ధారావతు మోహన్‌, పంచాయతీ కార్యదర్శి సంపత్‌ సమష్టి కృషి, తండావాసుల భాగస్వామంతో 2453 మొక్కలకు ప్రాణం పోశారు. హరితహారం అమల్లో తండావాసుల కృషిని చూసి పాలనా యంత్రాంగం మురిసింది. ఇలా ప్రతి ఊరూ ప్రకృతి ఆరాధనలో మమేకమైతే తెలంగాణకు హరితహారం పట్టినట్లే కదా!


జీవితంలో ఎదగాలని చెబుతూ..

పూల జాతరలో విభిన్న ఆకృతుల్లో బతుకమ్మలు తయారు చేస్తుంటారు. ఏటా ఎత్తైన బతుకమ్మలు తయారు  చేస్తుంటారు. ఇలా రూపకల్పనకు ప్రతిఒక్కరూ పోటీ పడటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అంటే జీవితంలో కూడా ఉన్నతస్థాయికి ఎదగాలని అర్థం. ఇప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఉద్యోగార్థులకు కూడా ఇది ఒక ప్రేరణ. ఆరు జిల్లాల్లో ఇప్పటికే 970 కానిస్టేబుళ్ల పోస్టులకు పరీక్ష రాసిన వారుండగా ఇప్పుడు గ్రూపు-1కి సిద్ధం అవుతున్న వారున్నారు. వీరంతా ఉద్యోగాలు పొంది జీవతంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి. ఇటీవల మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని సెయింట్‌ ఆగ్నెస్‌ ఉన్నత పాఠశాలలో పది అడుగుల బతుకమ్మను ప్రదర్శించారు. చదువుల్లో మీరింత ఎత్తుకు ఎదగాలని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు దిశా నిర్దేశం చేసింది.


పోషకాహారం ప్రాధాన్యం తెలిపేలా..

తుకమ్మ ప్రసాదం, నైవేద్యం పోషకాల సమాహారం. మధ్య తరగతి మహిళలకు పోషక విలువలు గల ఆహారం అందించడానికి బతుకమ్మ ప్రసాదాలను పెద్దలు సంప్రదాయం చేశారు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇదే స్ఫూర్తితో దైనందిన జీవనం కొనసాగిద్దాం.  బాలలు, బాలింతలు, గర్భిణులకు సరైన పోషకాహారం అందించడానికి నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు సమర్థంగా నడిచేలా పర్యవేక్షించాలి. కిశోర బాలికలకు రక్తహీనత సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్రంలో ఐరన్‌ మాత్రలు అందేలా చూడాలి.


పరిసరాల పరిశుభ్రతను సూచిస్తూ..

రోగ్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యాన్ని వేపకాయల బతుకమ్మ నేర్పుతుంది. బ్యాక్టీరియా, వైరస్‌లను వేప తరిమేస్తుందని మన పురాతన వైద్యం చెబుతూనే ఉంది. ఇవి మనకు దూరంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ముఖ్యం. బహిరంగ మల విసర్జన మన స్త్రీల ఆత్మగౌరవానికి ఎంత భంగపరుస్తుందో అంతేవిధంగా వ్యాధులకు కారణమవుతోంది. మరుగుదొడ్డి నిర్మించుకుంటే మన ఆరోగ్యంతోపాటు పరిసరాలకు పరిశుభ్రతకు పెద్దపీట వేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని