logo

భద్రకాళికి బ్రహ్మోత్సవం!

తెలంగాణ ఇంద్రకీలాద్రి, ఓరుగల్లు ప్రజల కొంగు బంగారమై పూజలు అందుకుంటున్న భద్రకాళి అమ్మవారి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందనుంది. భద్రకాళి ఆలయాభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు రచించి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసి పెట్టారు. ఇందుకు అనుగుణంగా ఓరుగల్లు నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు.

Published : 04 Oct 2022 03:38 IST

మాడవీధుల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు

ఈనాడు, వరంగల్‌ కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

తెలంగాణ ఇంద్రకీలాద్రి, ఓరుగల్లు ప్రజల కొంగు బంగారమై పూజలు అందుకుంటున్న భద్రకాళి అమ్మవారి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందనుంది. భద్రకాళి ఆలయాభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు రచించి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసి పెట్టారు. ఇందుకు అనుగుణంగా ఓరుగల్లు నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు. గతేడాది నుంచి పెండింగ్‌లో ఉన్న భద్రకాళి దేవాలయం మాడవీధుల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మాడవీధుల నిర్మాణానికి స్పెషల్‌ డెవలప్‌మెంటు ఫండ్స్‌ (ఎస్డీపీ) ద్వారా రూ.20 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం రాత్రి  జీవో నెంబరు 299 జారీ చేసింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ద్వారా రూ.10 కోట్లు ఇచ్చేందుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ  ఉత్తర్వులు  ఇచ్చింది. మొత్తం రూ.30 కోట్లతో మాడవీధుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ చొరవతో భద్రకాళి దేవాలయం అభివృద్ధి కోసం భారీ నిధులు వచ్చాయి.

* రూ.10 కోట్లతో రాజగోపురం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దేవాదాయ శాఖ నిధులతో పనులు చేపడుతారు. దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.


భద్రకాళి ఆలయం మాడవీధుల్లో శాకంబరి, నవరాత్రులు, కల్యాణ బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారి ఊరేగింపు జరిపేలా 60 అడుగుల వెడల్పుతో మాడవీధులను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఇది బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారిని మాడవీధుల్లో ఊరేగించిన విధంగా ఉండనుంది.


తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయంలో ఉన్న తరహాలో 9 అంతస్తులతో రూ.8 కోట్లతో రాజగోపురం నిర్మించాల్సి ఉంది. ఇది పూర్తయితే ఓరుగల్లు నగరం నలుమూలల నుంచి రాజగోపురం భక్తులకు దర్శనమిస్తుంది.  


‘బండ్‌’పైనా దృష్టి సారించాలి

కొనసాగుతున్న భద్రకాళి బండ్‌ రెండో విడత పనులు

భద్రకాళి ఆలయానికి మణిహారంలా ఉన్న భద్రకాళి బండ్‌ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మొదటి దశలో కిలోమీటరు మేర ‘అమృత్‌’ పథకంలో బండ్‌ను సుందరీకరించారు. రెండో దశలో రూ.60 కోట్లతో రెండున్నర కిలోమీటర్ల మేర భద్రకాళి బండ్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. గిరిజన విశ్వవిద్యాలయం నుంచి పోతన రోడ్డు వరకు ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆలయం నుంచి కాపువాడ వరకు ఇందులోనే మినీ బండ్‌ పనులు పూర్తయ్యే దశకు చేరాయి. నాలుగు నెలలుగా స్మార్ట్‌సిటీ పనులు నిధులు రాక నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ నగరం పథకానికి రూ.193 కోట్లు నిధులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్ రూ. 250 కోట్లు రావాల్సి ఉంది. ఈ ఏడాది పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నగరానికి వచ్చినప్పుడు స్మార్ట్‌సిటీపై సమీక్షించి రూ.250 కోట్లు విడుదల చేయాలని చెప్పారు. ఈ నిధులు ఇంకా రాలేదు. ఈ పనులన్నీ పూర్తి చేస్తే భద్రకాళి దేవస్థానం అద్భుత క్షేత్రంగా అలరారుతుంది.


రాజగోపురం, మాడవీధులతో పరిపూర్ణత్వం

- శేషు, ప్రధానార్చకుడు, భద్రకాళి దేవస్థానం

ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో రాజగోపురం, మాఢవీధులతో పరిపూర్ణత్వం చెందుతోంది. ఆలయ శిఖరం శిరస్సు, రాజగోపురం పాదాలు, స్తంభాలు బహులు (భుజాలు), ఇటుకలు, రాళ్లు ఎముకలు, దీపం ప్రాణం, గర్భాలయం ఉదరం అంటారు. రాజగోపురం, మాడ వీధులు ఏర్పాటు చేస్తే భద్రకాళి ఆలయం దివ్య క్షేత్రంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని