logo

పండగవేళ విషాదం

సద్దుల బతుకమ్మ పర్వదినాన విషాదం నెలకొంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో చెరువుల్లో పడి ఓ యువకుడు, బాలుడు మృతి చెందారు. మరో బాలుడు గల్లంతయ్యాడు.  ఈ సంఘటనలు వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపాయి.

Published : 04 Oct 2022 03:38 IST

ఈతకు వెళ్లి బాలుడి మృతి, మరొకరి గల్లంతు

చెరువులో పూలు కోయడానికి వెళ్లి యువకుడి మృత్యువాత

గల్లంతయిన రిశ్విక్‌ రాంచరణ్‌ (పాతచిత్రం)

కరీమాబాద్‌, ఏటూరునాగారం, న్యూస్‌టుడే: సద్దుల బతుకమ్మ పర్వదినాన విషాదం నెలకొంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో చెరువుల్లో పడి ఓ యువకుడు, బాలుడు మృతి చెందారు. మరో బాలుడు గల్లంతయ్యాడు.  ఈ సంఘటనలు వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపాయి.

వరంగల్‌ కరీమాబాద్‌ ఉర్సు రంగసముద్రం చెరువులో ఈతకు వెళ్లిన మాటూరి రాంచరణ్‌(12) మృతిచెందగా.. రిశ్విక్‌ అనే బాలుడు గల్లంతయ్యాడు. గిర్మాజీపేట గుట్ట కింద ప్రాంతానికి చెందిన మాటూరి రాంచరణ్‌(12), అతని స్నేహితులు రిశ్విక్‌(11), యశ్వంత్‌(12) కలిసి సోమవారం రంగసముద్రం చెరువులో ఈతకు వెళ్లారు. వీరికి ఈత రాకపోవడంతో మునిగిపోయారు.రాంచరణ్‌ మృతి విషయం తెలిసి వచ్చిన తల్లి హేమలత కుమారుడి మృతదేహంపై పడి ఏడుస్తూ జీఆర్‌గుట్ట దేవాలయానికి వెళ్తానని వెళ్లి చెరువులోకి ఎందుకు వచ్చి మాకు దూరమయ్యావురా బిడ్డా అంటూ రోదించింది. పుట్టుకతో గుండెలో రంధ్రం ఏర్పడగా ఇటీవలే ఆపరేషన్‌ చేయించినట్లు  హేమలత ఏడుస్తూ తెలిపింది.  రాంచరణ్‌ తండ్రి శ్రీనివాస్‌ సైకిల్‌పై వెళ్లి పూలవ్యాపారం చేస్తుండగా, తల్లి ఇళ్లలో పనిచేస్తుంటుంది. వారికి ఇద్దరు పిల్లలు కాగా అందులో కూతురు వివాహం చేశారు.రాంచరణ్‌ ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు.


పుట్టబోయే బిడ్డను చూడకుండానే..

శ్రీను(పాతచిత్రం)

కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన ఈరవేణి  రెండు రోజుల కిందట ములుగు జిల్లా  ఏటూరునాగారంలోని అత్తగారింటికి దసరా పండగ కోసం వచ్చారు. శ్రీను భార్య రజిత ఆరు నెలల గర్భిణి. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా బావ మరిది బాస రమేష్‌, మరో స్నేహితుడితో కలిసి  అల్లంవారిఘణపురం గ్రామ సమీపంలోని మారేడుకుంట చెరువులోని అల్లిపూలు కోసేందుకు వెళ్లారు.  ఆయన బావ మరిది, స్నేహితుడికి ఈత రాకపోవడంతో కుంటలోకి దిగలేదు. తనకు ఈత వస్తుందని చెప్పి పూలు కోసేందుకు శ్రీను చెరువులోకి దిగారు. అప్పటికే కొన్ని పూలు కోసి బావమరిదికి, స్నేహితుడికి అందజేశారు. లోతు ప్రాంతంలోకి వెళ్లి పూలు కోస్తున్న క్రమంలో అల్లిపొదలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగిపోయారు. గమనించిన బావమరిది, స్నేహితుడు కేకలు వేశారు. అప్పటికే నీటిలో మునిగిన శ్రీను నీళ్లు మింగడంతో ఊపిరాడక మృతిచెందారు. సమీపంలోని చల్పాక గ్రామానికి చెందినవారు చెరువులోకి దిగి గాలించగా శ్రీను మృతదేహం లభ్యమైంది. పోలీసులకు సమాచారం ఇచ్చి బంధువులు మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై ఇంద్రయ్య కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. * తమ కుమారుడు పుట్టబోయే బిడ్డను చూడకుండానే చనిపోయాడని మృతుడి తండ్రి సాంబయ్య, అత్తామామలు విలపించారు. పండగ వేళ జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీరని విషాదాన్ని నింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని