logo

త్వరలో జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌

ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ సమీకృత భవన సముదాయం, వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రానున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్‌ చెప్పారు.

Published : 04 Oct 2022 03:38 IST

కలెక్టరేట్‌ పనులపై వివరాలు తెలుసుకుంటున్న మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్యే

శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ శశాంక, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ తదితరులు

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ సమీకృత భవన సముదాయం, వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రానున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్‌ చెప్పారు. సోమవారం జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌తో కలిసి కలెక్టరేట్‌ భవన నిర్మాణాలను పరిశీలించారు. రెండంతస్తుల్లో నిర్మాణం చేసిన విభాగాలు, భవన పరిసరాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలు ఏర్పాటు కాకముందు సర్పంచి నుంచి మండల స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌ను కలవాలంటే ఒక్క రోజు ముందే సమయం తీసుకోవలసి వచ్చేదన్నారు. వారితో పాటు ప్రజలు కూడా దూర ప్రాంతంలో ఉన్న కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం తక్కువ దూరంలో జిల్లా కేంద్రాలు ఉండేలా కేసీఆర్‌ ప్రజలకు పరిపాలనను చేరువకు తెచ్చారన్నారు. కలెక్టరేట్‌ నిర్మాణానికి రూ. 53 కోట్లు మంజూరు చేశారన్నారు. వేగంగా పనులు పూర్తైన వైద్య కళాశాలకు జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి ఇచ్చిందన్నారు. ఈ ఏడాది కౌన్సెలింగ్‌లోనే 150 మంది విద్యార్థులకు ఈ కళాశాలలో సీట్లు కేటాయిస్తారని మంత్రి తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతుందన్నారు. ఇదే తరహాలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను అమలుచేసేందుకు యావత్‌భారత దేశం కేసీఆర్‌ కోసం ఎదురు చూస్తోందన్నారు. దసరా రోజున హైదరాబాద్‌లో జాతీయ పార్టీని ప్రకటించరున్నారని మంత్రి వెల్లడించారు. జాతీయ పార్టీని ప్రారంభించిన తర్వాత తొలిసారిగా మహబూబాబాద్‌  జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరవుతారన్నారు. జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రికి ఘనస్వాగతం చెప్పేందుకు రెండు లక్షల మందిని సమీకరించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ వేదికపైనే ముఖ్యమంత్రి జిల్లా ప్రజలకు తీపి కబురు చెబుతారన్నారు. మల్యాలలో ఉద్యాన పాలిటెక్నిక్‌, డిగ్రీ కళాశాలను ప్రకటిస్తారని సత్యవతి చెప్పారు. తెరాస పార్టీ జిల్లా కార్యాలయం కూడా ప్రారంభిస్తారన్నారు. కలెక్టరేట్‌లో 32 ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. కలెక్టర్‌ కె.శశాంక, జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, ఆర్డీవో కొమురయ్య, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మూల మధుకర్‌రెడ్డి, రహదారులు, భవనాల శాఖాధికారులున్నారు.

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు

మహబూబాబాద్‌:  గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ జిల్లా ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై  మంచి విజయాలను అందించే దసరా వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా నిర్వహించుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని