logo

విన్నపాలు.. ఆవేదనలు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం.. దరఖాస్తుదారులు లేక వెలవెలబోయింది. అధికారులు అందరూ హాజరైనప్పటికీ.. ప్రజల కోసం అధికారులే ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో కార్యక్రమం గంట ఆలస్యంగా ప్రారంభమైంది.

Published : 04 Oct 2022 03:38 IST

ఓ రైతు అర్జీని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌

జనగామఅర్బన్‌, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం.. దరఖాస్తుదారులు లేక వెలవెలబోయింది. అధికారులు అందరూ హాజరైనప్పటికీ.. ప్రజల కోసం అధికారులే ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో కార్యక్రమం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ముందుగా అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ శివలింగయ్య పాల్గొన్నారు. తక్కువ మంది ఉండడంతో కలెక్టర్‌ ప్రజావాణిని గంట ముందుగానే ముగించారు. కేవలం ఆరు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వాటిని ఆయా శాఖల అధికారులకు బదిలీ చేశారు. ఇందులో మూడు భూ సంబంధిత సమస్యలు, మరో మూడు ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.


పంట ఎండుతోంది.. నియంత్రిక బిగించండి

వీరు గోవర్థనగిరి శివారులోని గోపాలస్వామితండాకు చెందిన రైతులు విజయ్‌కుమార్‌, గుగులోతు భోజ్యా, బానోతు హేము. స్థానికంగా పదెకరాల్లో వరిపంట సాగు చేస్తున్నారు. కొత్త విద్యుత్తు నియంత్రిక కోసం ఒక్కో రైతు రూ.8 వేల చొప్పున డీడీలు కట్టారు. కేవలం స్తంభాలు వేసిన సిబ్బంది నియంత్రిక బిగించడం మరిచారు. ఏఈలను అడిగితే రేపు మాపు అంటూ ఆర్నెల్లుగా దాట వేస్తున్నారని, నియంత్రికను బిగించడం లేదని,  పంట చేతికందే సమయంలో నీరు లేక ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నియంత్రిక బిగించి తమ పంటను కాపాడాలని కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్‌ వారి దరఖాస్తును విద్యుత్తుశాఖ ఎస్‌ఈకి బదిలీ చేశారు.


తన పేరిట భూమిని పట్టా చేయాలని..

జనగామ మండలం మరిగడి శివారులోని సర్వే నెంబర్‌ 165లో రైతు గుగులోతు మీట్యా తండ్రి పిక్లా పేరిట 6.24 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తన పేరిట పట్టా చేయాలని మీట్యా అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ను కోరారు. రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం శాశ్వత పట్టాను రికార్డు చేశారని, 1954-55లో కాస్తూ పహాణీలో తన తండ్రి పేరు నమోదు చేసినప్పటికీ,   కొందరు గ్రామస్థులు అక్రమంగా వారి పేరిట కాస్తుకాలంలో రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు.  


తన ఉద్యోగం తనకు ఇప్పించాలని !

గ్రామ కారోబార్‌గా పదేళ్లపాటు సేవలందించిన తన స్థానంలో లంచం తీసుకొని వేరే వ్యక్తిని నియమించారని, దీనిపై విచారణ జరిపి తన ఉద్యోగం తనకు దక్కేలా చూడాలని జనగామ మండలం యశ్వంతాపూర్‌కు చెందిన పసుల లాబాన్‌ అధికారులకు విన్నవించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ అర్జీని జిల్లా పంచాయతీ అధికారి రంగాచారికి బదిలీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని