logo

ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు

వరంగల్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 05 Oct 2022 01:33 IST


నిందితుల అరెస్టు చూపుతున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కమిషనరేట్‌లో సీపీ తరుణ్‌జోషి నిందితుల వివరాలు వెల్లడించారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఉడట హరీశ్‌, రాయపర్తికి చెందిన వొల్లెల సుధాకర్‌(దివ్యాంగుడు), బొమ్మెర కిరణ్‌ ముగ్గురు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరి మధ్య స్నేహం ఉంది. వీరు ద్విచక్ర వాహనాలు చోరీ చేసి విక్రయించి వచ్చే ఆదాయంతో జల్సాలు చేసేవారు. సెప్టెంబరులో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఠాణా పరిధిలో నాలుగు, పాలకుర్తి, మాదాపూర్‌ ఠాణాల పరిధిలో రెండు, సుబేదారి, జీఆర్పీ కాజీపేట, భువనగిరి, ఠాణాల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ద్విచక్ర వాహనాలను హరీశ్‌ చోరీ చేసి కిరణ్‌, సుధాకర్‌ ద్వారా విక్రయించారు. గతంలో హరీశ్‌ చోరీ కేసులో ములుగు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవల కమిషనరేట్‌లో వరుస ద్విచక్ర వాహనాల చోరీలు జరగడంతో పోలీసులు నిఘా పెంచారు. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నంబరులేని ద్విచక్ర వాహనంపై హరీశ్‌ వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనుమానంతో విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. హరీశ్‌ ఇచ్చిన సమాచారంతో కిరణ్‌, సుధాకర్‌ ఇంట్లో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ వైభవ్‌గైక్వాడ్‌, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు నరేశ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై లవణ్‌కుమార్‌, పాలకుర్తి ఎస్సై శ్రీకాంత్‌, ఏఏవో సల్మాన్‌పాషా, హెడ్‌కానిస్టేబుళ్లు శ్యాంసుందర్‌, అశోక్‌, స్వర్ణలతలను సీపీ తరుణ్‌జోషి అభినందించారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts