logo

అభ్యర్థుల్లో అవతారాలు కొలువై

ఆ జగన్మాత మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తింది.. అలుపెరగని పోరాటం చేసి ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు విజయం సాధించడంతో విజయ దశమిగా వేడుక చేసుకుంటున్నాం.

Published : 05 Oct 2022 02:17 IST

అమ్మవారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
నేడు విజయదశమి
-ఈనాడు, వరంగల్‌

ఆ జగన్మాత మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తింది.. అలుపెరగని పోరాటం చేసి ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు విజయం సాధించడంతో విజయ దశమిగా వేడుక చేసుకుంటున్నాం. చెడుపై మంచి గెలవాలన్నా, అనుకున్న లక్ష్యం సాధించాలన్నా మనుషులూ అనేక అవతారాలు ఎత్తాల్సిందే. ప్రభుత్వం గ్రూప్స్‌, పోలీసు, ఇతర శాఖల్లో పోటీ పరీక్షలకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో అభ్యర్థులు రాత్రింబవళ్లు చదువుతున్నారు. గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఈ నెల 16న జరగనుంది. తర్వాత ఇతర పరీక్షలు జరుగుతాయి. లక్ష్య సాధనకు పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎత్తాల్సిన అవతారాలపై ప్రత్యేక కథనం.

వివేకావతారం
చదివింది సమయానికి గుర్తు రావాలి.ప్రశ్న చూడగానే బుర్ర వెలిగేలా కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. పరీక్ష రాసేటప్పుడు ఏమాత్రం అయోమయానికి గురికాకుండా, పొరపాట్లు చేయకుండా సాధన చేయాలి. 

ఫలావతారం
ఈ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలి.  ఉదయం సాయంత్రం వేళల్లో యాపిల్‌, అరటి, జామ, కమలాఫలాలు రుచిగా ఉండడమే కాకుండా మంచి శక్తినిస్తాయి. పిజ్జాలు, బర్గర్లు ఇంకా నూనెతో కూడిన ఆహారాలు తినకపోవడం ఉత్తమం.

లిఖితావతారం
చదవడం ఎంత ముఖ్యమో నోట్సు రాసుకోవడం అంతే. ఇప్పటి వరకు సిద్ధం చేసుకున్న నోట్సులోని ముఖ్యాంశాలను మరోసారి రాసుకుంటే మరిచిపోకుండా ఉంటారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులయ్యాక మెయిన్స్‌ సాధనలో వ్యాసాలు రాయడం కీలకం.

వర్తమానావతారం
పరీక్షల్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కోవాలి. ఇందుకు దినపత్రికలు చదవాలి. వార్తా పత్రికలు చదవడం, టీవీలో వార్తలు కొద్దిసేపు చూడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.

యోగావతారం
చదువులో పడి ఒత్తిడికి గురవుతుంటారు. ఉదయం నిద్రలేవగానే కాసేపు నడక, ఆ తర్వాత కొద్ది సేపు యోగా, ధ్యానం చేయడంతో దాని నుంచి బయటపడొచ్చు. సమయం వృథా కాకుండా ప్రాణాయామం చేసి కూడా యోగా సాధన చేయవచ్చు.

సమయావతారం  
సమయం వృథా కాకుండా పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలి. చదువు, భోజనం, నిద్ర, వ్యాయామం.. ఇలా సమయాన్ని విభజించుకోవాలి. సెల్‌ఫోన్‌లో సమయంతోపాటు వాట్సప్‌ సందేశాలు చూస్తే సమయం వృథా అవుతుంది.

క్రీడావతారం
అదే పనిగా చదివితే అలసిపోతారు. సాయంత్రం కొద్దిసేపు ఇంటి ముందే షటిల్‌ ఆడుతూ ఉల్లాసంగా గడపొచ్చు.  మైదానానికి వెళ్లే సమయం ఉండదు. కాబట్టి చిన్న చిన్న ఆటలు ఆడాలి.

జలావతారం
మంచి నీళ్లు క్రమం తప్పకుండా తాగాలి. చదివే ధ్యాసలో మంచి నీరు తక్కువ తాగితే అనారోగ్య సమస్యలు  వస్తా యి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు.

పఠనావతారం
పోటీ పరీక్షల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది అభ్యర్థులు బాగా చదవడం. ప్రణాళికబద్ధంగా పునశ్చరణ (మననం) చేసుకోవడమూ కీలకం. నిపుణులు సూచించే ప్రామాణికమైన పుస్తకాల్లోని నాణ్యమైన విషయ పరిజ్ఞానాన్ని ప్రణాళికాబద్ధంగా చదివే విధంగా పఠనావతారం ఎత్తాలి.


హనుమకొండ గ్రంథాలయంలో సిద్ధమవుతూ..

ఉమ్మడి వరంగల్‌లో వివరాలు..
కానిస్టేబుళ్లు  970
ఎస్‌ఐలు 89
ఎస్సై కోసం దరఖాస్తు చేసుకున్నవారు 27,861
కానిస్టేబుల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారు  71,933


ఒక్కో విద్యకు ఒక్కో రూపం సంకేతం

- ఐనవోలు అనంతమల్లయ్య శర్మ, భద్రకాళి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి

దుర్గాదేవిని రెండు పద్ధతుల్లో పూజిస్తుంటాం. ఒకటి చండికా దేవి. చండికాదేవిలోనే మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి ఉంటారు. భయం తొలగించేది మహాకాళి అయితే, ఆరోగ్యం సిద్ధింపజేయునది శక్తి, సంపదను ఇచ్చేది మహాలక్ష్మి. విద్య బుద్ధి జ్ఞానం సరస్వతీ దేవి ఇస్తుంది. రెండో పద్ధతిలో అమ్మవారిని దశమ విద్యలుగా చెబుతారు. మనిషి జీవించే శక్తి యుక్తి బుద్ధి మేధస్సు ఇవన్నీ దశమ విద్యల్లో ఉంటాయి. అమ్మవారి రూపాల్లో ఒక్కో విద్యకు ఒక్కోటి సంకేతంగా నిలుస్తుంది. అమ్మవారి రూపాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.


ముఖ్యాంశాలు మననం చేసుకుంటే విజయం

- కళింగరెడ్డి, పోటీ పరీక్షల శిక్షకుడు, హనుమకొండ

ప్రభుత్వ పథకాలు, సోషల్‌ సైన్స్‌ మీద ఎక్కువ దృష్టి సారించాలి. లాజికల్‌ రీజినింగ్‌పై దృష్టిపెట్టాలి. ఈ పది రోజుల్లో ముఖ్యమైన అంశాలను మననం చేసుకుంటే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని