logo

పురపాలికల్లో జాడలేని ఇ ఆఫీస్‌

అధికారుల టేబుళ్లపై గుట్టలు గుట్టలుగా దస్త్రాలు, ఏ దస్త్రం ఎక్కడుందో, అందులో ఎన్ని పేజీలుండాలో, ఎన్ని ఉన్నాయో, ఎవరి దరఖాస్తు ఏ దశలో ఉందో తెలియని దుస్థితి అనేక కార్యాలయాల్లో కనిపిస్తుంటుంది. దీనికి విరుగుడే ఇ ఆఫీస్‌ విధానం. దశాబ్దం కిందటే కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఇన్‌ఫర్‌మాటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) ద్వారా వివిధ స్థాయిల్లో పాలనా సౌలభ్యం కోసం ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది.

Updated : 07 Oct 2022 05:26 IST

అధికారుల టేబుళ్లపై గుట్టలు గుట్టలుగా దస్త్రాలు, ఏ దస్త్రం ఎక్కడుందో, అందులో ఎన్ని పేజీలుండాలో, ఎన్ని ఉన్నాయో, ఎవరి దరఖాస్తు ఏ దశలో ఉందో తెలియని దుస్థితి అనేక కార్యాలయాల్లో కనిపిస్తుంటుంది. దీనికి విరుగుడే ఇ ఆఫీస్‌ విధానం. దశాబ్దం కిందటే కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఇన్‌ఫర్‌మాటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) ద్వారా వివిధ స్థాయిల్లో పాలనా సౌలభ్యం కోసం ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది.

జనగామ, న్యూస్‌టుడే

ప్రభుత్వ కార్యాలయాలు, స్వతంత్ర సంస్థల్లో కాగితం వాడకుండా స్కానింగ్‌, రిజిస్టరింగ్‌, రూటింగ్‌ అనే విధానంలో కార్యాలయంలోని వివిధ విభాగాల మధ్య సమాచారం పంపిణీ, స్వీకరణ, దరఖాస్తుల నమోదు, పరిష్కారం.. ఇవన్నీ డిజిటల్‌ రూపంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. దస్త్రం తయారీ, విషయ వివరణ, సందర్భాల ఉటంకింపు, అవసరమైన ఇతర అంశాలను, వివరణలను జతపర్చడం, దస్త్రం ఆమోదం కోసం డ్రాఫ్టు తయారీ ఇదంతా కంప్యూటర్‌ తెరపైనే జరగాలి. ఒక స్థాయి నుంచి మరో స్థాయికి చేరవేయాలి.

కాగిత రహిత కార్యాలయమే లక్ష్యం

కాగితరహిత కార్యాలయాలే లక్ష్యంగా ఎలక్ట్రానిక్‌ డిజిటల్‌ పాలనతో సులభతర సేవలు అందించాలన్నది ప్రభుత్వాల ఆశయం. తొలి విడతలో 75 పట్టణ స్థానిక సంస్థల్లో, 2019లో 68 కొత్త పురపాలికల్లో ఇ ఆఫీస్‌ విధానాన్ని కొనసాగించాలని ఆదేశించారు. వరంగల్‌ కార్పొరేషన్‌ను మినహాయిస్తే, జనగామ, భూపాలపల్లి, మహబూబాద్‌, నర్సంపేట, పరకాల, కొత్తగా ఏర్పడిన డోర్నకల్‌, తొర్రూరు, వర్ధన్నపేట, మరిపెడ మున్సిపాల్టీల్లో ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా కార్యాలయాల నిర్వహణ జరగడం లేదనే విమర్శలున్నాయి. వివిధ విభాగాలను పరిశీలించే అధికారుల్లో కొందరికి కంప్యూటర్‌ పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉండడంతో కొత్త విధానం స్థానంలో దస్త్రాలతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇ ఆఫీస్‌ విధానంపై కొన్ని పురపాలికల్లో అవగాహన లేదు.

ఏం చేయాలి

నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర సాంకేతిక సమాచార విభాగం ఇ ఆఫీస్‌ విధానం అమలుకు సంబంధించి గతంలోనే పుర కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది. కమిషనర్లకు, కొందరు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పురపాలికలోని అధికారులకు ప్రత్యేక కార్యవిభాగం, డెస్కుటాప్‌ కంప్యూటర్‌, కార్యాలయంలో అంతర్జాలం, అంతర్గత అనుసంధాన (లాన్‌) సౌకర్యం ఉండాలి. ఆయా విభాగాల అధికారులు డిజిటల్‌ సంతకాలు సేకరించుకోవాలి. వివిధ పురపాలికల్లో గతంలో కొందరికి డిజిటల్‌ సంతకాలను సమకూర్చినా, ఇప్పుడు కమిషనర్లు, డీఈ, టీపీవో స్థాయిలోనే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇఆఫీస్‌ విధానాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ ఒప్పంద ప్రాతిపదికన సిస్టం మేనేజర్లను, సిస్టం అసిస్టెంట్లను నియమించింది. కానీ వీరిని కొన్ని చోట్ల ఇతర విభాగాల్లో నియమిస్తున్నారు. జనగామ పుర కార్యాలయంలో కంప్యూటర్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. జనగామ మున్సిపల్‌ కార్యాలయంలో పాత కంప్యూటర్లకు తోడు, రూ.3 లక్షలతో కొత్తగా 5 కొనుగోలు చేయనున్నారు.

ఇదీ ప్రయోజనం

కాగితపు దస్త్రాలను ఏళ్ల తరబడి కాపాడటం కష్టం. ఇ ఫైల్స్‌ ఎన్నేళ్లయినా చెక్కుచెదరవు. సులభంగా ఎప్పుడైనా, ఎక్కడికైనా, ఎవరికైనా పంపించవచ్ఛు పారదర్శకత, జవాబుదారీతనం, సులభతర నిర్వహణ ఇందులోనే సాధ్యం. దస్త్రాలను మాయం చేయడం, అక్రమంగా మార్పులు, చేర్పులు చేసేందుకు వీలు కాదు. ఒక అధికారి నుంచి మరో అధికారికి, ఒక శాఖ నుంచి మరో శాఖకు పంపించడం సులువు. కాగితపు ఖర్చులు, మానవవనరుల వినియోగం తగ్గుతుంది. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.

ఇబ్బందులపై సమీక్షిస్తాం : పోకల జమున, ఛైర్‌పర్సన్‌

ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా కార్యాలయాన్ని నూతన విధానంలో నిర్వహించేందుకు ఉన్న ఇబ్బందులు, లోటుపాట్లపై సమీక్షిస్తాం. ఆన్‌లైన్‌ చెల్లింపులు, దరఖాస్తులు కొన్ని విభాగాలకు సంబంధించి స్వీకరణ జరుగుతోంది. ఇఆఫీస్‌ విధానం అమలుపై నివేదిక తయారు చేయించి, పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని