logo

దివ్యాంగుల వ్యథ వినలేరా!

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్దుల నిమిత్తం ప్రతి నెలా నాలుగో శనివారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణికి హాజరవడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

Published : 27 Nov 2022 05:21 IST

దరఖాస్తులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీవత్స, సంక్షేమాధికారి శారద

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్దుల నిమిత్తం ప్రతి నెలా నాలుగో శనివారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణికి హాజరవడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జరిగిన ప్రజావాణిలో కేవలం ఐదు శాఖల అధికారులు మాత్రమే హాజరుకాగా.. మున్సిపల్‌, పోలీస్‌ శాఖ అధికారులు, జిల్లా న్యాయ సంబంధిత, విద్యాశాఖ, జడ్పీ తదితర శాఖల  అధికారులు  రాలేదు. నెలకోసారి జరిగే దివ్యాంగులు, వయోవృద్ధుల ప్రత్యేక ప్రజావాణికి వచ్చేందుకు అధికారులు సుముఖత చూపించకపోవడం శోచనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంపై జిల్లా పాలనాధికారి గోపి ప్రత్యేక దృష్టి సారించకపోవడం.. దరఖాస్తులను సమీక్షించకపోవడంతోనే.. అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ సమస్యలపై 12 మంది అదనపు కలెక్టర్‌ శ్రీవత్స, సంక్షేమాధికారి శారదకు దరఖాస్తులందించారు.


పింఛన్‌ ఇప్పించరూ..!

ధనుశనాథుల తరుణ్‌, రేలకుంట, నల్లబెల్లి

పుట్టుకతోనే నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తరుణ్‌కు 2021లో మానసిక వ్యాధుల విభాగానికి చెందిన వైద్యులు 75శాతం అంగవైకల్యంగా నిర్ధారించి సదరం ధ్రువపత్రాన్ని అందజేశారు. మరల రెన్యువల్‌కు వెళ్లగా.. ఎలాంటి అంగవైకల్యం లేదని వైద్యులు ధ్రువీకరించడంతో.. పింఛన్‌ మంజూరు కాలేదు. వైద్యపరీక్షలు నిర్వహించి న్యాయం చేయాలని తరుణ్‌ తల్లి శనివారం అధికారులను కోరారు.


తొలుత మంజూరుచేసి తర్వాత తొలగించారు

వేముల విశ్వేశ్వర్‌, లక్ష్మీపురం దుగ్గొండి

కాలికి గ్రహణం సోకి నడవలేని పరిస్థితిలో ఉన్న నాకు ఈ ఏడాది ఆగస్టులో పింఛన్‌ మంజూరు అయినట్లు పత్రం అందజేశారు. పింఛన్‌ చేతికి రాకముందే జాబితా నుంచి నా పేరు తొలగించారు. మా అన్నకు నాలుగు చక్రాల వాహనం ఉన్నందుకే పింఛన్‌ రద్దుచేసినట్లు అధికారులు చెప్పారు. రెండు నెలల క్రితమే రేషన్‌కార్డు నుంచి నా పేరు తొలగించారు. ఎలాంటి బతుకుతెరువు లేని నాకు పింఛన్‌ మంజూరుచేయండి.


పోలియో ఉన్నా.. రద్దుచేశారు

గద్దె కళమ్మ, వసంతాపూర్‌, ఖిలావరంగల్‌

చిన్నవయసులోనే పోలియో సోకడంతో.. రెండు కాళ్లు వంకర్లు పోయి సరిగా నడవలేని స్థితికి చేరాను. మూడేళ్లకోసారి సదరం రెన్యువల్‌ సందర్భంలో 2019లో ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లగా.. 25 శాతం మాత్రమే అంగవైకల్యం ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. చిన్నప్పటి నుంచి 56 శాతం ఉన్న అంగవైకల్యం ఒకేసారి 25 శాతానికి ఏవిధంగా పడిపోయిందో ధ్రువీకరించిన వైద్యులే చెప్పాలి. అంగవైకల్యం తక్కువగా నమోదుచేయడంతో వికలాంగుల పింఛన్‌ రద్దుచేశారు. న్యాయం చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని