logo

నకిలీ భూ పత్రాల తయారీదారుల అరెస్టు

నకిలీ భూ పత్రాలు తయారు చేస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.

Published : 27 Nov 2022 05:21 IST

వివరాలు వెల్లడిస్తున్న అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: నకిలీ భూ పత్రాలు తయారు చేస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి భూములకు సంబంధించిన నకిలీ కన్వర్జేషన్‌, ప్రొసీడింగ్స్‌, 13 బీ, సీ ఫారాలు, తహసీల్దార్‌, ఆర్డీవోలకు సంబంధించిన నకిలీ స్టాంపులు, గ్రామాల నక్ష నకళ్లు, స్టాంపు పేపర్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ వివరాలు వెల్లడించారు. నెక్కొండ మండలానికి చెందిన మద్ది వెంకట్‌రెడ్డి, కల్వచర్ల రఘు నకిలీ పత్రాలు తయారు చేశారు. మద్ది వెంకట్‌రెడ్డి 1973 నుంచి 2012 వరకు రెవెన్యూ విభాగంలో నెక్కొండ, పర్వతగిరి మండలాల్లో పట్వారీ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వోగా పనిచేసిన అనుభవం ఉండడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో భూములకు సంబంధించిన అన్ని రకాలైన నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి రఘుతో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అవసరం ఉన్న వారికి ఇచ్చి డబ్బులు తీసుకొనే వారు. భూ పత్రాలు పొందిన పలువురు బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావడంతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు నరేశ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, ఎస్సైలు లవణ్‌కుమార్‌, నెక్కొండ, పర్వతగిని ఎస్సైలు పర్వీన్‌, దేవేందర్‌లను గైక్వాడ్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని