logo

పల్లె దారులకు మంచి రోజులు

జిల్లాలో ఈ ఏడాది కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పల్లె రహదారులకు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మహర్దశ పట్టనుంది.

Updated : 27 Nov 2022 05:50 IST

‘‘ రాష్ట్రంలోని రహదారులు అద్దాల్లా ఉండాలి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. వానలకు పాడైపోయిన రహదారులను నెలన్నరలోగా బాగు చేయాలి. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.’’
-ఇటీవల సంబంధిత శాఖ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్‌


ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: జిల్లాలో ఈ ఏడాది కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పల్లె రహదారులకు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మహర్దశ పట్టనుంది. వరదల కారణంగా కోతకు గురైన, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు మోక్షం కలగనుంది. భారీ వర్షాలకు వరద నీరు వాటిపై నుంచి పొంగిపొర్లడంతో కోతకు గురయ్యాయి. కల్వర్టులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా దంతాలపల్లి, నర్సింహులపేట, పెద్దవంగర, కొత్తగూడ, మరిపెడ, డోర్నకల్‌ ప్రాంతాల్లో కోతకు గురైన రోడ్లు ప్రమాదకరంగా మారాయి. ఇవే కాకుండా గుంతలు పడిన వాటిని సైతం బాగు చేస్తారు. చాలా వరకు రోడ్లు కొత్తగా కనిపించేలా పూర్తిస్థాయిలో తారు వేయనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీంతో పల్లె ప్రాంతాల్లోని రోడ్లు బాగుపడనున్నాయి. ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

133 కి.మీ. రోడ్లు.. రూ.16.54 కోట్లు..

జిల్లా వ్యాప్తంగా 133 కి.మీ పొడువున రోడ్లు పాడైనట్లు గుర్తించారు. వాటి మరమ్మతుకు రూ.16.54 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇందులో డోర్నకల్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 41.15 కి.మీటర్ల పొడువున పాడైన రోడ్లను బాగు చేయడానికి రూ.6.92 కోట్లు, మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 37.40 కి.మీ రోడ్డు మరమ్మతుకు రూ.3 కోట్లు, ములుగు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 54.45 కి.మీటర్ల పొడువు కోతకు, దెబ్బతిన్న రహదారులను బాగు చేయడానికి రూ.6.61 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు రూపొందించారు.

బీటీ రహదారుల మరమ్మతులకు..

జిల్లాలో వర్షాలకు, వివిధ కారణాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న బీటీ రోడ్లు మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. జిల్లాలోని 16 మండలాల్లో 568.24 కి.మీటర్ల పొడువు కలిగిన రహదారులకు బీటీ రెన్యువల్‌ చేసేందుకు రూ.253.40 కోట్లు కావాలని సంబంధిత ఇంజినీరింగ్‌శాఖ అధికారులు అంచనాల ప్రతిపాదనలు తయారు చేశారు. డిసెంబరు 10 నాటికి వీటికి అనుమతితో పాటు టెండర్లు కూడా పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, సీఎం చెప్పినట్లుగా సకాలంలో పనులు పూర్తవుతాయని ఇంజినీరింగ్‌ అధికారి ఒకరు చెప్పారు. ఇవి పూర్తికాగానే మరో 92.15 కి.మీ రహదారికి బీటీ రెన్యువల్‌ చేయడానికి రూ.31.50 కోట్లు అవసరమని, వాటికీ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనుమతికి కొంత సమయం పడుతుందని ఆ శాఖ ఇంజినీరింగ్‌ అధికారి తెలిపారు.


ఈ రోడ్డు తొర్రూరు మండలం హరిపిరాల నుంచి రావులపల్లి వరకు 4.60 కి.మీ వరకు ఉంటుంది. ఇందులో వర్షాలకు 3.969 కి.మీ వరకు దెబ్బతింది. బీటీ రెన్యువల్‌, గుంతలను పూడ్చడం, ఇతర మరమ్మతులకు రూ.1.15 కోట్లు ఖర్చు అవుతుందని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ నిధులతో రోడ్డును బాగు చేయనున్నారు.
ఇది అవుతాపురం నుంచి కొడకండ్లకు వెళ్లే రహదారి. జులైలో కురిసిన భారీ వర్షానికి అక్కడి పెద్ద చెరువు మత్తడి పోసింది. దీంతో రహదారిపై ఉన్న లోలెవెల్‌ కల్వర్టు వరద తాకిడికి కొట్టుకుపోయింది. అవుతాపురం నుంచి పోచంపల్లి, గంట్లకుంట గ్రామాల మీదుగా కొడకండ్లకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో మట్టిపోసి చదును చేశారు. అయినా ఆ ప్రాతంలో ప్రయాణ కష్టాలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని