logo

మున్సిపల్‌ స్థలానికి ఎసరు

నగర నడిబొడ్డున సుమారు రూ.15- 20 కోట్ల విలువైన మున్సిపల్‌ స్థలంపై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Published : 28 Nov 2022 05:04 IST

గ్రేటర్‌ వరంగల్‌ స్థలంలో కొనసాగుతున్న హోటళ్లు

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌:  నగర నడిబొడ్డున సుమారు రూ.15- 20 కోట్ల విలువైన మున్సిపల్‌ స్థలంపై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు సొంత స్థలం అన్నట్లుగా ఇతరులకు అద్దెకు ఇచ్చారు. తాత్కాలిక హోటళ్లు, డబ్బాల నుంచి నెల నెలా అద్దె వసూలు చేసుకుంటున్నారు. స్థలం వెనుక భాగంలో ఇష్టానుసారంగా తాత్కాలిక నిర్మాణాలు జరుగుతున్నా.. బల్దియా టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు చూసీచూడనట్లుగా ఉంటున్నారు. మున్సిపల్‌ స్థలంలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం ఏమిటని స్థానికులు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తే రాష్ట్ర హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని తప్పించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

వరంగల్‌ బస్టాండ్‌ ఎదురుగా లక్ష్మీపురం శివారులో గ్రేటర్‌ వరంగల్‌కు చెందిన 72, 73 ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. సుమారు 1100 గజాల స్థలం ఉంటుంది. ఈ ప్లాట్ల వెనుక భాగంలో ప్రహరీ, తాత్కాలిక నిర్మాణాలు జరిగాయి. వీటిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యల్లేవు. గత 30 ఏళ్లుగా ఈ స్థలంలో హోటల్‌ నడుపుకునే ప్రైవేటు వ్యక్తి బల్దియాపై రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. గత 10-12 ఏళ్లుగా కేసు కొనసాగుతోంది. కొన్ని నెలల క్రితం మున్సిపల్‌ స్థలంలో కొత్తగా రెండు హోటళ్లు తాత్కాలిక నిర్మాణాలతో వెలిశాయి. నాలుగు డబ్బాలు ఏర్పాటు చేశారు. వీరి నుంచి నెల నెలా అద్దె వసూలు చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు? వసూలు చేస్తున్న అద్దె సొమ్ము ఎవరి జేబులోకెళ్తోంది.. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, ఉద్యోగులెందుకు మౌనం వెనుక మతలబు ఏమటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

విచారణ చేపడతాం:

డీ.బషీర్‌, ఇన్‌ఛార్జి ఏసీˆపీˆ, కాశీబుగ్గ సర్కిల్‌

వరంగల్‌ బస్టాండ్‌ ఎదురుగా 72, 73 ప్లాట్ల మున్సిపల్‌ స్థలం ఉంది. దీనిపై ఓ ప్రైవేటు వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. ఇంకా తుది నిర్ణయం వెలువడ లేదు. మున్సిపల్‌ స్థలాన్ని అద్దెకివ్వడం, నెల నెలా అద్దె వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేపడతాం. తాత్కాలిక నిర్మాణాలపై చర్యల కోసం లీగల్‌సెల్‌ సలహా తీసుకుంటాం.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని