logo

రామప్పకు మహర్దశ

యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప కట్టడం ప్రపంచ దేశాల పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తోంది.

Published : 28 Nov 2022 05:04 IST

స్వామి పేరిట రూ.6 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

ఆలయ ప్రాంగణంలో సందర్శకులు

వెంకటాపూర్‌ (ములుగు జిల్లా), న్యూస్‌టుడే: యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప కట్టడం ప్రపంచ దేశాల పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తోంది. ఆ శుభదినం 2021 జులై 25 తర్వాత కరోనాను సైతం లెక్కచేయకుండా ప్రజలు కుటుంబ సమేతంగా తరలిరావడం ప్రారంభమైంది. ప్రస్తుతం నిత్యం 2 వేల మంది రామప్ప ఆలయాన్ని చూడడానికి వస్తున్నారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 6 వేలు దాటుతోంది. వీరంతా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని హుండీ కానుకలను సమర్పిస్తున్నారు.  దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల ఈ-హుండీ సైతం ఏర్పాటు చేశారు. ఆదాయం భారీగా పెరగడంతో ఇటీవల రామప్ప రామలింగేశ్వర స్వామి పేరు మీద రూ.6 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. రెండళ్ల వ్యవధిలో  నిర్వహణ ఖర్చులు పోనూ ఇలా ఎఫ్‌డిఆర్‌ చేయడం ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి.


* ఒకప్పుడు రామలింగేశ్వర స్వామి దర్శనానికి ప్రత్యేక రోజులు, పండగ వేళలు, శని, ఆదివారాల్లో మాత్రమే భక్తులు వచ్చేవారు. ఇప్పుడు విదేశీయుల తాకిడి సైతం బాగా పెరిగింది. తీరిక లేకుండా భక్తులు వస్తూనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది.

హరీశ్‌శర్మ, రామప్ప ఆలయ ప్రధాన పూజారి



* రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలయం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నాం

బిళ్ల శ్రీనివాస్‌, ఈవో  



* టూరిజం శాఖలో రామప్ప గైడ్‌గా రూ.200 నెలజీతం ఉన్నప్పటి నుంచి 15 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఒకప్పుడు శని, ఆదివారాల్లోనే పర్యాటకులు వచ్చేవాళ్లు. ఇప్పుడు స్వదేశీ, విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రామప్ప చరిత్రను వివరించడానికి తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తోంది.

తాడబోయిన వెంకటేశ్‌, టూరిజం గైడ్‌


* దాదాపు 35 ఏళ్ల నుంచి రామప్పలో చిల్లర దుకాణం  ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాను. నాతో పాటు 40 దుకాణాలు ఉన్నాయి. అందరూ నిరుపేదలే.. మా ఆదాయం బాగా పెరిగింది.

పిల్లలమర్రి భిక్షపతి, చిల్లర దుకాణం యజమాని, రామప్ప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని