logo

ఫోర్జరీ సంతకం కేసు విచారణ

వర్ధన్నపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రవేశాలు పొందిన కేసులో ఐనవోలు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

Published : 28 Nov 2022 05:04 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వర్ధన్నపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రవేశాలు పొందిన కేసులో ఐనవోలు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. గతేడాది నుంచి ప్రవేశాల దందా కొనసాగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు పలు గ్రామాల్లో ఎజెంట్లను నియమించుకుని పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసి ప్రవేశాలు కల్పించినట్లు తెలుస్తోంది. ఇతర పాఠశాలల్లో కూడా ప్రవేశాలు పొందినట్లుగా ప్రాథమికంగా గుర్తించి ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే పలు మైనార్టీ గురుకుల పాఠశాల ప్రవేశాల రిజిస్టర్లను తనిఖీలు చేసి అనుమానం ఉన్న వాటి వివరాలు సేకరించారు. నిందితుడికి ఎవరైనా సహకరించారా? దీని వెనక ఎవరి ప్రమేయం ఉంది? ఇప్పటి వరకు ఎంత మంది నుంచి డబ్బులు తీసుకున్నారు ఎవరికి ఇచ్చారనే కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా..

నిందితుడు ఈ మెయిల్‌ ద్వారా సిఫారసు లేఖను సృష్టించారు. దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసును చేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉపయోగించిన మెయిల్‌ ఐడీ, చరవాణిని ఆధారంగా నగర కమిషనరేట్‌లోని సైబర్‌ విభాగం సాయంతో కేసు విచారణ జరుగుతోంది. విచారణలో ఇతర పాఠశాలల్లో ఫోర్జరీ సంతకాలతో ప్రవేశాలు పొంది ఉంటే అక్కడ కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. నిందితుడి అరెస్టుకు సంబంధించి ‘న్యూస్‌టుడే’ పోలీసు అధికారులను వివరణ కోరగా ఎవరిని అదుపులోకి తీసుకోలేదన్నారు. కేసు విచారణలో ఉందని, వివరాలను చెప్పేందుకు నిరాకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని