logo

విద్యార్థుల ప్రగతి తెలిసేలా..!

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రగతితో పాటు పాఠశాల సంస్థాగతమైన అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు విద్యాశాఖ ప్రతినెలా తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తోంది.

Published : 28 Nov 2022 05:04 IST

తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్న అధికారులు

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రగతితో పాటు పాఠశాల సంస్థాగతమైన అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు విద్యాశాఖ ప్రతినెలా తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తోంది. దీని కోసం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రతి నెలా మూడో శనివారం తప్పనిసరిగా అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ ఆ శనివారం ప్రభుత్వ సెలవు రోజు అయితే నాలుగో శనివారం యాథావిధిగా సమావేశం ఏర్పాటు చేయాలని సూచించింది.

చర్చించే అంశాలివే..

విద్యార్థుల హాజరు పెంపుదల కోసం తీసుకునే చర్యలపై చర్చించాలి. ఆంగ్ల మాధ్యమ బోధనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, విద్యార్థులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, అవకాశాలు, ఉపకార వేతనాలు వంటి విషయాలను తెలియజేయాలి. విద్యతో పాటు సాంస్కృతిక, ఆరోగ్య, మానసిక స్థితిగతులు, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు వంటి వాటిపై చర్చించాలి. పాఠశాల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకోవాలి. మన ఊరు-మన బడి, 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమం, మధ్యాహ్నా భోజనం పథకం అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించడం జరుగుతుంది.

ప్రయోజనాలు ఇలా..

ప్రతి నెల క్రమం తప్పకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించడంతో వీరి మధ్య స్నేహపూర్వక,  సహకార వాతావరణం నెలకొంటుంది. పిల్లల సమస్యలు, హాజరు, ప్రవర్తన తీరు, బోధన తదితర అంశాలు అవగతమవుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించాల్సిన మద్దతు, ఇంటివద్ద హోంవర్కు, అసైన్‌మెంటులతో సహకారం అందించే అవకాశం ఉంటుంది. దీంతో నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుంది. పాఠశాలలోని విద్యార్థులను తరగతుల వారీగా ప్రగతి, సామర్థ్యాలు, సృజనాత్మకత తదితర అంశాలతో విద్యార్థుల వారీగా నివేదిక రూపొదించడంతో ప్రతి పిల్లవాడిపై ఎప్పటికప్పుడు స్థితిగతులు తెలుసుకోవచ్చు.

సమావేశ లక్ష్యాలు..

* ఉత్తమ ఫలితాల సాధనకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడం* తరగతిలోని విద్యార్థుల యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడం * వివిధ రంగాల్లో పిల్లలు కనబరిచిన సామర్థ్యాన్ని బట్టి వారికి శిక్షణ అందించే విధంగా ప్రోత్సహించడం* విద్యాపరమైన, పాఠశాల సంస్థాగతపరమైన అభివృద్ధి గురించి వివరించి తద్వారా మౌలిక వసతులు కల్పనలో వారి భాగస్వామ్యాన్ని అందించడం.


రెండు నెలలుగా నిర్వహిస్తున్నాం

బి.రాధ, ప్రత్యేక అధికారి

విద్యార్థుల ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన కార్యక్రమాన్ని ప్రణాళికతో రెండు నెలలుగా నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒకే వేదిక ద్వారా అన్ని అంశాలు చర్చించడం ద్వారా సర్కార్‌ బడులపై నమ్మకం పెరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల ప్రగతి, పాఠశాల అభివృద్ధికి పాటుపడొచ్చు.


తల్లిదండ్రులే కీలకం

డి.వాసంతి, డీఈవో హనుమకొండ

ఉపాధ్యాయుడు తన మేధస్సుతో బోధించినా.. ఇంటి దగ్గర తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విషయంలో తల్లిదండ్రులే కీలకం. ఎన్ని పనులున్నా నిత్యం వారి చదువు కోసం రెండు గంటలు సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థుల ఎదుగుదలకు ఇలాంటి వేదికలు దోహదపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని