logo

అరకొర సౌకర్యాలతో ఆటలకు దూరం

శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, గొప్ప క్రీడాకారులుగా ఖ్యాతిగడించడానికి మైదానాలే వేదికలు.

Published : 28 Nov 2022 05:04 IST

జనగామ జిల్లాలోని ఓ పాఠశాలలో కబడ్డీ ఆడుతున్న విద్యార్థులు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, జనగామ అర్బన్‌: శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, గొప్ప క్రీడాకారులుగా ఖ్యాతిగడించడానికి మైదానాలే వేదికలు. చిన్ననాటి నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకుని వాటిని కెరీర్‌గా ఎంచుకుని రాణించిన వారెందరో. అలాంటి అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లో లేకుండాపోతోంది. సర్కారు బడుల్లో క్రీడలు ఆడుకునేందుకు ఆటస్థలాలు కనమరుగయ్యాయి. విద్యార్థిలోని క్రీడా నైపుణ్యాలు సానబెట్టడానికి వ్యాయామ ఉపాధ్యాయులు కీలకం. కానీ వీరి కొరత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్నింట్లో విశాలమైన మైదానం, వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడం, మరికొన్నింట్లో అవి ఉన్నప్పటికీ క్రీడా సామగ్రి లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు.

పలు పాఠశాలల్లో పరిస్థితి ఇలా..!

* జనగామ ధర్మకంచలోని జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో విశాలమైన క్రీడా మైదానంతో పాటు అనుభవజ్ఞుడైన పీఈటీ ఉన్నా.. క్రీడా సామగ్రి లేక విద్యార్థులకు సాధన కరవవుతోంది.
* సిద్దిపేట రోడ్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులున్నారు. మహిళా పీఈటీ ఉంది. ఆటస్థలం లేదు. క్రీడా వస్తువులూ అంతంతే ఉన్నాయి.
* స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు పీఈటీ ఉన్నారు. మైదానం విశాలంగా ఉంది. కిట్లు లేవు.
* ఇప్పగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 200కి పైగా విద్యార్థులు ఉన్నారు. పీఈటీ ఉన్నప్పటికీ సరిపడా కిట్లు రావడం లేదని సమాచారం.
* స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలోని పాఠశాలల్లోనూ క్రీడా సామగ్రి కొరత ఉందని సమాచారం.
జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. 430 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ఉదయం వేళ ప్రార్థన చేసేందుకే స్థలం సరిపోవడం లేదు. ఉన్న స్థలాన్ని వంటకు కేటాయించారు. పీఈటీ ఉన్నారు. ఆట వస్తువులూ అరకొరగానే ఉన్నాయి. కానీ స్థలాభావం వల్ల పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు.


పీఈటీ ఉన్నా స్థలం లేదు..

భవంతిక, పదో తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల

మా పాఠశాలలో చదువుతో పాటు ఆటలపై ఆసక్తి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ సరైన స్థలం లేదు.  దీంతో క్రీడలపై ఆసక్తి కోల్పోతున్నాం. ఆటలకు గంట సమయం ఉన్నప్పటికీ మైదానం లేక వినియోగించుకోలేకపోతున్నాం. కనీసం ఇండోర్‌ ఆటలకు అవసరమయ్యే సామగ్రి సమకూర్చాలని కోరుతున్నాం.


దృష్టి సారిస్తాం:

 రాము, డీఈవో

పిల్లల ఆటల విషయంలో దృష్టి సారిస్తాం. ప్రస్తుతం ఆటలకూ ఒక గంట కేటాయించాం. కొన్ని పాఠశాలల్లో మాత్రమే మైదానాలు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. ఆయా బడుల్లో ఇండోర్‌కు సంబంధించిన కిట్లు అందిస్తున్నాం. పీఈటీల కొరత కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని