logo

ఉద్రిక్తతల నడుమ ఆగిన ప్రజాప్రస్థానం

నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో తెరాస నాయకులు విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. శంకరంతండాలో మధ్యాహ్న విడిది వద్ద ఆమె మాట్లాడారు.

Published : 29 Nov 2022 03:51 IST

నర్సంపేట, నర్సంపేట రూరల్‌, చెన్నారావుపేట, నెక్కొండ,  న్యూస్‌టుడే

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలో తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. పలుచోట్ల కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చివరకు షర్మిల అరెస్టుతో యాత్ర అర్ధంతరంగా ఆగిపోయింది.

హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలం

నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో తెరాస నాయకులు విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. శంకరంతండాలో మధ్యాహ్న విడిది వద్ద ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పట్టించుకోనందునే రహదారులు దెబ్బతిన్నాయన్నారు. ఆయన తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరని ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకోవడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు శాంతికుమార్‌, అమరేందర్‌రెడ్డి, ఖాజాబీ, కృష్ణ, సంజీవ్‌, కల్పనగాయత్రి, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

భారీ బందోబస్తు

షర్మిల యాత్రకు తెరాస నుంచి నిరసన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 120 మంది పాల్గొన్నారు. నర్సంపేట ఏసీపీ సంపత్‌కుమార్‌, మామునూర్‌ ఏసీపీ నరేశ్‌కుమార్‌, పరకాల ఏసీపీ శివరామయ్య నేతృత్వంలో ఏడుగురు సీఐలు, 14 మంది ఎస్సైలు, 50 మంది కానిస్టేబుళ్లతో పాటు హోంగార్డులు బందోబస్తులో పాల్గొన్నారు.

స్వల్ప లాఠీఛార్జి:     షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తుండగా వైతెపా శ్రేణులు రోడ్డుకు అడ్డంగా పడుకొని నినాదాలు చేశాయి. దీంతో పోలీసులు వారిపై స్వల్ప లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. వాహనాల   అద్దాలను పగలగొట్టిన  నాయకులపైనా లాఠీ ఝళిపించారు.

ఉమ్మడి వరంగల్‌లో ..  

ఈనెల 19న హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పలపల్లి గ్రామం నుంచి వైతెపా అధ్యక్షురాలు షర్మిల తన ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల మీదుగా ఈనెల 26న మధ్యాహ్నం వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం బోలోనిపల్లి నుంచి నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగింది. రెండు రోజుల పాటు విజయవంతంగా సాగింది. ఆదివారం  3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా నర్సంపేటలోని వైఎస్సార్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన  పైలాన్‌ను తల్లి విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. సోమవారం నర్సంపేట మండలం రాజపల్లి నుంచి యాత్రను చెన్నారావుపేట మండలం మీదుగా నెక్కొండ వరకు కొనసాగేలా రూట్‌ మ్యాప్‌ రూపొందించుకుని బయల్దేరారు.
సూరిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో దహనమవుతున్న వైఎస్‌ఆర్‌ విగ్రహం. వైతెపా కార్యకర్తలు స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని