logo

పుట్టుకతో గుండె లోపాలున్న పిల్లలకు శస్త్రచికిత్సలు

పుట్టుకతో గుండె లోపాలు(రంధ్రం) ఉన్న పిల్లలకు ఇక నుంచి కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో అధునాతన పద్ధతిలో కోత కుట్టులేకుండా శస్త్రచికిత్సలు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు.

Published : 29 Nov 2022 03:51 IST

డిసెంబరు 2 నుంచి ప్రారంభం

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: పుట్టుకతో గుండె లోపాలు(రంధ్రం) ఉన్న పిల్లలకు ఇక నుంచి కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో అధునాతన పద్ధతిలో కోత కుట్టులేకుండా శస్త్రచికిత్సలు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. ఇటీవల ఎంజీఎంలోని డైయిక్‌ కేంద్రంలో  ఈ సమస్యతో బాధపడుతున్న 44 మంది పిల్లలను గుర్తించి సికింద్రాబాద్‌ కిమ్స్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద సర్జరీలు చేయడానికి ఎంపిక చేశారు. కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో ఇద్దరు సీటీ సర్జన్లు ఉండగా, పిల్లలకు కిమ్స్‌లో ఆరోగ్య శ్రీ పథకం కింద ఎందుకు సర్జరీలు చేయిస్తున్నారని సంబంధిత శాఖ అధికారులు ఇక్కడిఅధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇద్దరు సీటీ సర్జన్లు ఉన్నా కేఎంసీలో నెలలో రెండుకు మించి శస్త్రచికిత్సలు చేయలేదని ఈ నెల 24న ఈనాడు ప్రధాన సంచికలో ‘డాక్టర్‌ డుమ్మా’ శీర్షికన ప్రచురించిన కథనంతో అధికారులు స్పందించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో పుట్టకతో గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డిసెంబర్‌ 2న శుక్రవారం కిమ్స్‌ నుంచి వస్తున్న కోత కుట్టు లేకుండా సర్జరీ చేయగల వైద్యనిపుణుడి సహాయంతో మొదట ఐదుగురు పిల్లలకు శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కేఎంసీ ఆసుపత్రిలో పుట్టుకతో గుండెరంద్రాలున్న పిల్లలు సర్జరీలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సోమవారం సుమారు 15 మంది పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు కార్డియాలజీ ఓపీ విభాగానికి రాగా వైద్యులు  డిసెంబర్‌ 2న రావాలని పంపించారు. ఈవిషయంపై నోడల్‌ అధికారి డాక్టర్‌ గోపాల్‌రావు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగానే డిసెంబర్‌ 2న కోతకుట్టులేకుండా కొంతమంది పిల్లలకు శస్త్రచికిత్సలు చేయాలనుకుంటున్నామని, అది విజయవంతమైతే క్రమంగా ప్రతి నెలా చేస్తామన్నారు. గుండె సంబంధిత సమస్యలున్నవారు, పిల్లలు ప్రతి సోమ, బుధవారం ఓపీ సేవలకు వస్తే పరీక్షలు నిర్వహించి అవసరాన్ని బట్టి చికిత్స, శస్త్రచికిత్సలు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని