logo

యుక్త ప్రాయం.. కాపాడుకో ప్రాణం

ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు ద్విచక్రవాహనాలు నడపొద్దని వరంగల్‌ ట్రాఫిక్‌ ఠాణా సీఐ బాబులాల్‌ తెలిపారు. సోమవారం నగరంలోని స్కాలర్స్‌ జూనియర్‌ కళాశాలలో ‘ఈనాడు- ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించారు.

Published : 29 Nov 2022 03:51 IST

న్యూస్‌టుడే, మట్టెవాడ

మాట్లాడుతున్న సీఐ బాబులాల్‌

ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు ద్విచక్రవాహనాలు నడపొద్దని వరంగల్‌ ట్రాఫిక్‌ ఠాణా సీఐ బాబులాల్‌ తెలిపారు. సోమవారం నగరంలోని స్కాలర్స్‌ జూనియర్‌ కళాశాలలో ‘ఈనాడు- ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా వరంగల్‌ ట్రాఫిక్‌ ఠాణా సీఐ బాబులాల్‌ హాజరయ్యారు.  ఇటీవల జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో చిన్న పిల్లలు వాహనాలు నడపడం వల్ల జరిగినవే ఎక్కువ ఉన్నాయన్నారు. కొన్ని ప్రమాదాల్లో ఏకంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. పిల్లలకు వాహనాలు ఇస్తున్న కుటుంబ సభ్యులు కూడా ఓ కారణమని తెలిపారు. తప్పనిసరిగా వాహనం ఇవ్వాల్సివచ్చినప్పుడు శిరస్త్రాణం ధరించేలా చూడాలని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు కూడా 18 ఏళ్ల లోపు విద్యార్థులను వాహనాలతో రాకుండా చూడాలని సూచించారు.

విద్యార్థులకు అర్థమయ్యేలా..

రోడ్డు ప్రమాదాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఎస్సై రామారావు పాడిన పాట ఆలోచింపజేసింది. జీవితంలో సుస్థిర స్థానంలో నిలబడేంత వరకు  చేయకూడని అంశాలను  చక్కగా వివరించారు. విద్యార్థి దశలో ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలాంటి కేసులు నమోదు చేస్తారో విద్యార్థులకు అర్థమయ్యేవిధంగా  తెలియజేశారు.జల్సాలకు అలవాటు పడి యుక్త ప్రాయాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా సమాజం మెచ్చే యువతరంగా ఎదగాలని కోరారు. ట్రాఫిక్‌ నియమ నిబంధనలను వివరించారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌లోని రంగుల సూచనలు, ప్రమాదాలకు పడే శిక్షలు, తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ అనిల్‌కమార్‌, డైరెక్టర్లు రంజిత్‌కుమార్‌, రవీందర్‌యాదవ్‌, అశోక్‌, హలీమ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

లైసెన్సు తీసుకోవడం ఇలా..

మేజర్లు తొలిసారిగా లైసెన్స్‌ కోసం మీసేవ ద్వారా లెర్నింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీని కాలపరమితి 6 నెలలు ఉంటుంది. కాలపరిమితి లోపు ఎంవీఐ(మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌) పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణత అయితే పర్మినెంట్‌ లైసెన్స్‌ వస్తుంది. ప్రతి వాహనదారుడు లైసెన్స్‌, ఆర్‌సీ కార్డు, బీమా, కాలుష్య సర్టిఫికెట్‌తోపాటు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలి. ఇవేమీ లేకుండాపోలీసులకు పట్టుబడితే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతారు. ప్రమాదాలకు కారణం అయితే జరిమానాతోపాటు జైలు పాలవుతారని తెలిపారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వాహనదారుడిపైనా కేసులు నమోదు అవుతాయని వివరించారు.

అవగాహన సదస్సు ఉపయోగకరంగా ఉంది
- రంజిత్‌కుమార్‌,  కళాశాల డైరెక్టర్‌

కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్‌ నియమాలు, నిబంధనలు తెలియాల్సిన అవరసం ఉంది. ఈనాడు- ఈటీవీ యాజమాన్యం తీసుకున్న చొరవతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. ముఖ్యంగా మా కళాశాలకు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాల్లో వచ్చే విద్యార్థులను అనుమతించవద్దని నిర్ణయం తీసుకున్నాం. ఇదే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించాం. ‘ఈనాడు’ చొరవతో నిబంధనలు, చట్టాలు, శిక్షలు, అమలు తదితర అంశాలపై అవగాహన ఉపయోగకరంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని