logo

బందోబస్తు.. వైఫల్యం మస్తు!

వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పజాప్రస్థానం పాదయాత్రపై తెరాస శ్రేణులు సోమవారం సాగించిన దమనకాండలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది.

Published : 30 Nov 2022 03:53 IST

న్యూస్‌టుడే, నర్సంపేట: వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పజాప్రస్థానం పాదయాత్రపై తెరాస శ్రేణులు సోమవారం సాగించిన దమనకాండలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వాఖ్యలను నిరసిస్తూ సోమవారం చెన్నారావుపేట మండలంలో షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా యత్నించారు. పాదయాత్రలో ఏమైనా జరగొచ్చనే అనుమానంతో భారీ బందోవస్తు నిర్వహించిన పోలీసులు క్షేత్రస్థాయిలో దాడులను కట్టడి చేయడంలో ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు మూటగట్టుకున్నారు.

నిఘా వర్గాలు హెచ్చరించినా

ప్రజాప్రస్థానం పాదయాత్రలో నల్లబెల్లి, నర్సంపేట పట్టణ సభల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని చేసిన ప్రసంగం దృష్ట్యా చెన్నారావుపేట మండలంలో గొడవలు జరిగే ప్రమాదముందని నిఘా(ఇంటిలిజెన్సీ)వర్గాలు ఒక రోజు ముందుగానే తెలిపినా పోలీసులు సకాలంలో సరైన చర్యలు చేపట్టలేదు. షర్మిల చెన్నారావుపేట ప్రధాన కూడలిలో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి 5కి.మీ. దూరంలో ఉన్న జల్లి క్రాస్‌ వద్ద తెరాస కార్యకర్తలు, నాయకులు వైతెపాకు చెందిన ఫ్లెక్సీలు తగులబెట్టారు. ఈ సంఘటన తరువాతనైనా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఉంటే ఇంత జరిగేది కాదని రాజకీయ పరిశీలకులే కాదు కొందరు నిఘా అధికారులు పేర్కొనడం విశేషం.  లింగగిరికి కిలోమీటరు దూరంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన మధ్యాహ్న విడిది వద్దకు ఆమె రాకముందే కారవాన్‌(బస్సు)ను తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వడం, కనీసం సరైన చర్యలు చేపట్టక పోవడం విస్మయం కలిగించింది.

ముందస్తు చర్యలు శూన్యం

రాజకీయ పార్టీలు, ప్రజా, ఉద్యోగ సంఘాలు ఏమైనా ఆందోళనలు, ధర్నాలు చేపడితే ముందస్తుగా ఆయా పార్టీల, సంఘాల బాధ్యులను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తారు. షర్మిల పాదయాత్రలో తెరాస శ్రేణులు వైతెపా ఫ్లెక్సీలు కాల్చినా పోలీసులు సాధారణంగానే పరిగణించారు. పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి నెక్కొండ పోలీస్‌స్టేషన్‌ తీసుకెళ్లినా. కస్టడిలో ఉంచకుండా వెంటనే వదిలేయడంతో ఆరుగురు వాహనంలో వచ్చి కారవాన్‌పై పెట్రోలు చల్లి నిప్పంటించడం గమనార్హం. ఈ దాడిలో పాల్గొన్న ఓ ప్రజాప్రతినిధి, నాయకులు మళ్లీ ధర్నాలో పాల్గొన్నా పోలీసులు పట్టించుకోలేదు. షర్మిలను అరెస్టు చేసి తీసుకెళ్లాక పోలీసులు కారవ్యాన్‌, డీసీఎం, డీజే బాక్సుల వాహనాలను చెన్నారావుపేట స్టేషన్‌కు తీసుకొస్తుంటే దాడి చేసి ఫ్లెక్సీలు చించడం, కాల్చడం, అద్దాలు ధ్వంసం చేసినా సూరిపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని పెట్రోలు చల్లి కాలుస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఠాణా ప్రధాన ద్వారంలోకి వచ్చిన వాహనంపై రాయి విసిరి అద్దాలు పగులగొట్టారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రాయి విసిరిన యువకుడిని సీఆర్పీఎఫ్‌ పోలీసులు పట్టుకుంటే సివిల్‌ పోలీసులు వదిలి పెట్టడం కొసమెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని