logo

వాడీవేడిగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

జనగామ పట్టణ పరిధిలోని వార్డుల్లో ప్రతిపాదించిన పనులకు మోక్షమెప్పుడు? నిధులు ఎప్పుడు వస్తాయి? పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పాలని జనగామ మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు పాలకవర్గాన్ని, అధికారులను నిలదీశారు.

Published : 30 Nov 2022 03:53 IST

వేదికపై మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జమున, అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, అధికారులు  

జనగామ, న్యూస్‌టుడే: జనగామ పట్టణ పరిధిలోని వార్డుల్లో ప్రతిపాదించిన పనులకు మోక్షమెప్పుడు? నిధులు ఎప్పుడు వస్తాయి? పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పాలని జనగామ మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు పాలకవర్గాన్ని, అధికారులను నిలదీశారు. జనగామలో మంగళవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఛైర్‌పర్సన్‌ పోకల జమున అధ్యక్షతన నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ హాజరయ్యారు. వివిధ వార్డుల సభ్యులు మాట్లాడారు. పట్టణంలో దోమల వ్యాప్తి, కుక్కలు, పందులు, కోతుల స్వైర విహారంతో ఇబ్బందులు పడుతున్నామని 8, 9 వార్డుల సభ్యులు జక్కుల అనిత, చందర్‌ ప్రస్తావించారు. నిధుల కొరత పేరిట సమస్యలను దాట వేస్తున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు, పనుల వివరాల గురించి కౌన్సిలర్‌ చందర్‌ వివరణ కోరారు. వివిధ వార్డుల్లో అదనపు విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాలని పలువురు సభ్యులు కోరారు. స్తంభాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని డీఈ చంద్రమౌళి తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్‌ నుంచి బస్టాండు వరకు, ప్రధాన రహదారులు, ఉపదారులపై ఆక్రమణలను తొలగించాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెరాస ఫ్లోర్‌లీడర్‌ మారబోయిన పాండు, 19వ వార్డు సభ్యురాలు పద్మ డిమాండ్‌ చేశారు. సమన్యాయం పాటిస్తూ ఆక్రమణల సమస్యను పరిష్కరించాలని భాజపా సభ్యుడు హరిశ్చంద్రగుప్త సూచించారు. ట్రేడ్‌లైసెన్సుల విషయంలో వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, డిసెంబరు వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఆడిట్‌ గురించి పలువురు సభ్యులు వివరణ కోరగా, డిసెంబరు 10 నుంచి ప్రారంభమవుతుందని కమిషనర్‌ రజిత వివరణ ఇచ్చారు. పురపాలిక పారిశుద్ధ్య  విభాగానికి 22 మంది కార్మికులను ఒప్పంద ప్రాతిపదికన తీసుకునేందుకు పురపాలకశాఖ సంచాలకులు ఆమోదం తెలిపి, ఐదు నెలలు గడుస్తున్నా అమలు కావడం లేదని వైస్‌ఛైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, తెరాస ఫ్లోర్‌లీడర్‌ పాండు వివరణ కోరారు. నిధుల కొరత కారణంగా మార్చి వరకు అదనపు సిబ్బందిని తీసుకోలేని పరిస్థితి ఉందని ఛైర్‌పర్సన్‌  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు