logo

విజయానికి.. 5 సూత్రాలు!

కొన్ని నెలలుగా సాధన.. ప్రిలిమినరీలో ప్రతిభ చాటారు.. కీలకమైన దేహదారుఢ్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.. మిగిలింది 8 రోజులే.. గడువు సమీపిస్తున్న కొద్ది అభ్యర్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది..

Updated : 30 Nov 2022 04:51 IST

పోలీసు అభ్యర్థులకు నిపుణుల సూచనలు
సాధనకు మిగిలింది 8 రోజులే..
న్యూస్‌టుడే, భూపాలపల్లి క్రైం

కొన్ని నెలలుగా సాధన.. ప్రిలిమినరీలో ప్రతిభ చాటారు.. కీలకమైన దేహదారుఢ్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.. మిగిలింది 8 రోజులే.. గడువు సమీపిస్తున్న కొద్ది అభ్యర్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది.. ఇన్నాళ్లు సాధన చేసినా.. తీరా పరీక్ష రోజు ఎలా ప్రదర్శన చేస్తారన్నదే ప్రధానం.. డిసెంబరు 8 నుంచి దేహదారుఢ్య పోటీ పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మిట్‌ కార్డులను సోమవారం నుంచి తీసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లాలో దాదాపు 223 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పోటీ పరీక్షకు అర్హత సాధించారు. ఈసారి పురుషుల విభాగంలో 1,600 మీటర్లు,  మహిళలకు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నారు. దీంతోపాటు షార్ట్‌ఫుట్‌, లాంగ్‌జంప్‌లో ఎలా రాణించాలనేది.. ఎస్సై, కానిస్టేబుళ్ల పోటీల విజేతలు సూచనలు అందిస్తున్నారు.  


మెల్లగా వేగం పెంచాలి  -రామకృష్ణ, ఎస్సై

1600 మీటర్లకు పురుష అభ్యర్ధులు 7.15 నిమిషాల్లో పూర్తిచేయాలి. ముందుగా 100-500 మీ., వరకు సాధన చేయాలి. తర్వాత 200 మీ., చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. టైమర్‌ ద్వారా సమయాన్ని చూసుకుంటూ ఉండాలి. సాధనలో పరుగుతో పాటు వార్మప్‌, పొత్తికడుపు వ్యాయామాలు చేయాలి.


800 మీటర్లకు మహిళా అభ్యర్థులు పరుగును 5.20 నిమిషాల్లోపు పూర్తి చేయాలి. మొదట నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. సాధనలోనూ ఇదే విధానం అలవాటు చేసుకోవాలి. చివరి 100మీ, దూరంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయి వేగం అందుకోవాలి. దీంతో అలసిపోకుండా లక్ష్యం పూర్తి చేస్తారు.


దూరం నిర్ణయించుకోవాలి -మిట్ట, శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌

లాంగ్‌జంప్‌లో పురుషులు నాలుగు మీటర్లు, మహిళలు 2.5 మీటర్ల దూరం దూకాలి. ముందుగా దూరం నిర్ణయించుకోవాలి. కొందరు తక్కువ దూరం నుంచి, మరికొందరు చాలా దూరం నుంచి దూకుతారు. అభ్యర్థులు వారికి అలవాటైన కొలతను అడుగులతో కొలుచుకోవాలి. స్ట్రాంగ్‌ఫుట్‌గా చాలామంది ఎడమ కాలు ఉపయోగిస్తారు. టేకాఫ్‌ బోర్డు దాటకుండా కాలును నేలకు గట్టిగా నొక్కి ఉంచితే గాల్లోకి సులువుగా లేవొచ్చు. రెండు కాళ్లను గాల్లో సైక్లింగ్‌ చేయాలి. దీంతో ఎక్కువ దూరం ముందుకు సాగవచ్చు. చివరగా భూమిని తాకేటప్పుడు రెండు చేతులను ముందుకు చాపాలి. చేతులు వెనక్కి పెడితే భూమిని తాకగానే వెనక్కిపడతారు. పౌల్‌గా పరిగణించడం లేదా వెనక్కిపెట్టిన చేతుల నుంచే దూరాన్ని లెక్కించడం చేస్తారు.


భుజం, మెడ సమన్వయం అవసరం -సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, కోచ్‌

పురుషులు 7.26 కిలోల ఇనుప గుండును 6.3 మీ., దూరం విసరాల్సి ఉంటుంది. మహిళలు నాలుగు కిలోల గుండును నాలుగు మీ, విసరాలి. ముందుగా గుండును కుడి చేతిలోకి తీసుకొని సగానికిపైగా లేపి శరీరాన్ని వెనక్కి వంచి గాలి పీల్చాలి. కుడికాలు ముందుకు వచ్చేలా అడుగు వేసి 75 డిగ్రీల కోణంలో విసరడం అలవాటు చేసుకోవాలి. గుండును పట్టుకున్నప్పుడు చిటికెన వేలితో బంధిస్తే జారి పోకుండా ఉంటుంది. గుండు నేలను తాకిన తర్వాతే వలయం నుంచి బయటకు రావాలి. వలయాన్ని రెండు వృత్తాలుగా విభజిస్తారు. మొదటి సగం నుంచి గుండు విసిరి, రెండో దాని నుంచి బయటకు రావాలి.  


ఆహారంపై దృష్టి సారించాలి

మంచి ఆహారంపై దృష్టి సారించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవాలి. నిత్యం పాలు, పండ్ల రసాలు, రాగిజావ, మొలకలు, బాదం తీసుకోవాలి. గుడ్లు, ఎండు ఫలాలు తింటే శక్తి ఎక్కువగా వస్తుంది. త్వరగా అలిసిపోయే అవకాశం ఉండదు. అభ్యర్థులు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా చేయాలి. మానసిక ప్రశాంతతో పాటు, శారీరక ఉల్లాసం పెరుగుతుంది. రోజుకు 6, 7 గంటలు నిద్రపోవాలి.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు