logo

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మహర్దశ

మహదేవపూర్‌, కాటారం, మహాముత్తారం, మల్హర్‌ మండలాలకు సాగు, తాగునీరు అందించే చిన్న కాళేశ్వర ఎత్తిపోతల పథకానికి టీఏసీ మంగళవారం ఆమోదం తెలిపింది.

Published : 30 Nov 2022 03:53 IST

ఎత్తిపోతలకు టీఏసీ ఆమోదం
న్యూస్‌టుడే, మహదేవపూర్‌, కాటారం , కాళేశ్వరం

మహదేవపూర్‌, కాటారం, మహాముత్తారం, మల్హర్‌ మండలాలకు సాగు, తాగునీరు అందించే చిన్న కాళేశ్వర ఎత్తిపోతల పథకానికి టీఏసీ మంగళవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ అధ్యక్షతన సాంకేతిక సలహా మండలి(టీఏసీ) సమావేశం సాగింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలపారు. ఇందులో చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సాంకేతిక, ఇతర అనుమతులకు ఆమోదం లభించింది. ప్రాజెక్ట్‌కు కేంద్రం నుంచి రావాల్సిన ముఖ్యమైన అనుమతులన్నీ వచ్చాయి.

2008లో శంకుస్థాపన

మహదేవపూర్‌ మండలం బీరసాగర్‌లో 2008 సెప్టెంబర్‌ 19వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి కాళేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్ల అంచనాతో ఈ ప్రాంత బీడు భూములను సస్యశామలం చేయడానికి రూపకల్పన చేశారు. నాలుగేళ్లలో(2012)లో పూర్తి చేయాల్సి ఉన్నా రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు, భూ సేకరణ, కాంట్రాక్ట్‌ ఏజెన్సీ, పలు కారణాలతో పనులు ఆలస్యం అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చిన్న కాళేశ్వరంగా పేరు మార్పుచేసి అటవీ, తదితర అనుమతలను సాధించింది. నిర్మాణ వ్యయాన్ని సైతం పెంచారు. ప్రాజెక్టులో ప్రధానంగా బీరసాగర్‌, కాటారం పంపుహౌస్‌ల పనులు పూర్తయ్యాయి. బీరసాగర్‌ పంపుహౌస్‌ పరిధిలో 44.045 కిలోమీటర్లకు 43.85 పైప్‌లైన్‌ పనులు, కాటారం పంపుహౌస్‌ పరిధిలో 22.67 కిలోమీటర్లకు 16.422 కి.మీ మేర పైప్‌లైన్‌ పనులు పూర్తయ్యాయి. కాటారం, మహాదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లో 14 చెరువులకు పైపులైన్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసి 45 వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించాలి. డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, పైప్‌లైన్‌, చెరువుల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టుకు 2,952 ఎకరాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 891 ఎకరాలు సేకరించారు. 2,059 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 12 చెరువులకు గాను ఆరింట్లో పనులు జరిగాయి. ఇప్పటి వరకు చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు 68 శాతం మేర పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టుకు అనుమతులన్నీ రావడంతో ఇక పనులపై దృష్టి సారించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని