logo

భూమి దూరం.. బతుకు దుర్భరం

గిరిజనుల పునరావాస పథకానికి అధికారుల తూట్లుభూ పంపిణీతో గిరిజనుల్లో వెలుగులు నింపాలనే లక్ష్యం అటకెక్కింది. గుట్టల పైనుంచి దింపి పునరావాసం కల్పిస్తామనే భరోసా బహుదూరంలోనే ఆగింది.

Published : 30 Nov 2022 03:59 IST

న్యూస్‌టుడే, వెంకటాపురం(ములుగు జిల్లా)

30 ఏళ్లుగా భూమి కోసం నిరీక్షిస్తున్న ఇప్పగూడెం గిరిజనులు

గిరిజనుల పునరావాస పథకానికి అధికారుల తూట్లుభూ పంపిణీతో గిరిజనుల్లో వెలుగులు నింపాలనే లక్ష్యం అటకెక్కింది. గుట్టల పైనుంచి దింపి పునరావాసం కల్పిస్తామనే భరోసా బహుదూరంలోనే ఆగింది. వెంకటాపురం మండలం ఇప్పగూడెం గిరిజనులు 30 ఏళ్లుగా చేతిలో దస్త్రాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలు పట్టుకుని ఎదురుచూడాల్సిన దుస్థితి. పట్టాలున్నా భూమి ఎక్కడుందో తెలియక కొందరైతే.. కళ్లెదుటే సాగు భూమి కనిపిస్తున్నా కబ్జా కబంధహస్తాలతో ఏమి చేయలేని దీనస్థితి ఇంకొందరిది.

దట్టమైన కీకారణ్యంలోని ఎత్తైన గుట్టలపై ఉండే చెలిమల గ్రామ గిరిజనులను బాహ్య ప్రపంచానికి చేరువ చేయాలని 1986లో అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. ఆలోచన తట్టిందే తడవుగా 32 కుటుంబాలకు చెందిన గిరిజనులను గుట్టలపై నుంచి కిందకు తీసుకొచ్చారు. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన మార్గంలోని ఇప్పగూడెం(జడ్‌) పరిధికి చెందిన స్థలంలో నివాసాలను ఏర్పాటు చేశారు. పక్కా గృహాలతో పాటు సాగుభూమిని పునరావాసంగా కల్పిస్తామని హామీలు సైతం ఇచ్చినా నేటికీ అమలు కాలేదు.

32 కుటుంబాల ఎదురుచూపులు

రెవెన్యూ అధికారుల తప్పిదం గిరిజనుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు వచ్చిపోతున్నా గిరిజనుల వేదన అరణ్యరోదనగానే మిలిగింది. హామీ మేరకు ఇప్పగూడెం(జడ్‌) రెవెన్యూ పరిధిలోని 6/1, 14, 16/1, 16/2, 22/2, 18/2, 13/2, 18/4, 22/4, 21/2 సర్వే నంబర్లలో 32 కుటుంబాలకు చెందిన గిరిజనులకు 1992లో అసైన్‌మెంట్‌లో భాగంగా 73 ఎకరాల విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేసి అప్పగించినట్లు దస్త్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ సమయంలో కొందరికి పట్టాదారు పాసుపుస్తకాలు, భూమి యాజమాన్య హక్కు పత్రాలు(టైటిల్‌డీడ్‌లు) ఇచ్చారు. చేతుల్లో పత్రాలు ఉన్నా సరిహద్దులు నిర్ణయించి చూపకపోవడంతో భూమి దక్కని పరిస్థితి నెలకొంది. ఇటీవల తెరాస ప్రభుత్వం సైతం డిజిటల్‌ పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చినా ఆ భూములు ఎక్కడున్నాయో తెలియడం లేదు.

కబ్జా కబంధహస్తాల్లో..

అసైన్‌మెంట్‌లో కేటాయించిన భూమి గిరిజనేతరుల కబ్జాలో ఉన్నట్లు గిరిజనులు పేర్కొంటున్నారు. దాదాపు 30 ఎకరాలకు పైగా ఆక్రమణలో ఉండగా, ఓ ఇద్దరికి చెందిన భూమిలో గిరిజనులే నివాసాలు కట్టుకుని జీవిస్తుండటం గమనార్హం. ఈ భూమితో పాటు కమ్యూనిస్టు పోరాటాల్లో భాగంగా అంకన్నగూడెం సమీపంలో 30 ఎకరాల భూమిని 25 ఏళ్ల కిందటనే చెట్టుపుట్ట కొట్టి సేద్యం చేస్తున్నా కనీసం హక్కులు కల్పించలేదు.


పట్టా ఉన్నా స్థలం చూపడం లేదు
సోడి పుల్లమ్మ, భుజంగరావు

గుట్టలపై ఉన్న తమను కిందకు దించారు. పునరావాసంలో భాగంగా సర్వే నం.14/8లో 2.06 ఎకరాలు, 18/2/4లో 2.19 ఎకరాల భూమి ఉన్నట్లు డిజిటల్‌ పట్టా అందజేశారు. కానీ నేటికీ భూమి చూపలేదు. గ్రామ సమీపంలో ఖాళీగా ఉన్న ఎకరం భూమిని చదును చేసి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.


మేకలు కాస్తూ జీవనం: బొగ్గుల మునయ్య

ఇళ్లు కట్టించిన అధికారులు, భూమిని ఎక్కడా చూపలేదు. నా పేరుతో సర్వే నం.14లో 2.35 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు చెబుతున్నారు. సెంటు భూమిని ఇవ్వలేదు. మేకలు కాస్తూ, కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాం.


మాకు అన్యాయం చేశారు: కుర్సం శంకర్‌

మా తల్లి సమ్మక్క పేరుతో సర్వే నం.16/2లో 2.15 ఎకరాల భూమి ఉన్నట్లు పత్రాలు ఇచ్చారు. వాటికి ఎలాంటి హక్కులు చూపలేదు. ఐదేళ్ల కిందట అమ్మ చనిపోయింది. కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలను కలిసినా మొర ఆలకించడం లేదు.


పూట గడవని పరిస్థితి: కుర్సం నీలమ్మ

కూలికి వెళ్తేగాని పూటగడవని పరిస్థితి. పిల్లల చిన్నతనంలోనే భర్త చనిపోయారు. నా పేరుతో సర్వే నం.14/3లో 2.15 ఎకరాలు, సర్వే నం.2/పిలో ఎకరం భూమి ఉన్నట్లు హక్కు పత్రాలు జారీ చేశారు. పట్టాలు చేతులో ఉన్నా భూమి ఎక్కడుందో నేటికీ చూపలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని