logo

ఇన్ఫార్మర్లు పద్ధతి మార్చుకోవాలి

ములుగు జిల్లాలో కొంతమంది వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటూ మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్న ఇన్ఫార్మర్లు పద్ధతి మార్చుకోవాలని సీపీఐ(మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి జగన్‌ హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు.

Published : 02 Dec 2022 04:31 IST

సీపీఐ(మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి జగన్‌ ప్రకటన

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడ, న్యూస్‌టుడే: ములుగు జిల్లాలో కొంతమంది వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటూ మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్న ఇన్ఫార్మర్లు పద్ధతి మార్చుకోవాలని సీపీఐ(మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి జగన్‌ హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. వాజేడు మండలానికి చెందిన ఇద్దరు నేతలు ఇసుక గుత్తేదారులు, ఓ జిల్లా స్థాయి అధికారితో చేతులు కలిపి గిరిజన గ్రామాల ప్రజలను యువతను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సొసైటీలు ఉన్నచోట మరో సొసైటీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

ప్రశ్నిస్తే కేసులు..

ప్రశ్నించిన యువకులను మావోయిస్టులతో సంబంధాలున్నట్లు కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలకు చెందిన మరో నలుగురు కూడా వివిధ పార్టీలతో ఉంటూ ఛత్తీస్‌గఢ్‌లోని ఇసుక వ్యాపారం కోసం కాంట్రాక్ట్‌ల పేరుతో విచ్చలవిడిగా పనులు చేసుకుంటూ పోలీసుల అధికారులకు సమాచారం చేరవేస్తూ మావోయిస్టు పార్టీ సభ్యులను అరెస్టులు చేయిస్తున్నారు. గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని వ్యాపారుల వద్ద రూ. లక్షల్లో వసూలు చేస్తూ, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఎదురుతిరిగిన వారిని చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తాడ్వాయికి చెందిన ఓ ఇద్దరు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు.  స్వయంగా జిల్లా స్థాయి ఉన్నతాధికారి ఒకరు గ్రామానికి ఒక ఇసుక సొసైటీ ఉండాలని ఉత్తర్వులు ఇచ్చి, మరల అదే గ్రామంలో మరో అధికారితో సొసైటీ ఏర్పాటు చేయిస్తూ గొడవలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అదనంగా ఏర్పాటు చేసిన సొసైటీలను అధికారులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇన్ఫార్మర్లు, అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పీఎల్జీఏ వారోత్సవాల్లో శిక్ష తప్పదని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని