logo

పల్లెలకు ఊరట!

నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు ఇది శుభవార్త. కేంద్ర ప్రభుత్వం అందించే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి.

Published : 02 Dec 2022 04:53 IST

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు ఇది శుభవార్త. కేంద్ర ప్రభుత్వం అందించే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఖాతాల్లోకి ప్రస్తుతం కొన్ని నిధులు జమ చేసింది. వీటిని సక్రమంగా వినియోగిస్తే మిగతావి విడుదలవుతాయి.

ఎనిమిది నెలల తర్వాత..  

పంచాయతీలకు కేంద్రం మూడు నెలలకోసారి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది.  గతంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే.. ఖజానా శాఖ ద్వారా పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యేవి. ప్రస్తుతం కేంద్రం పంచాయతీలతో కొత్తగా ఖాతాలు తెరిపించి  నేరుగా వాటిల్లో జమ చేస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నిధులు జమ కాకపోవడంతో పాటు రాష్ట్రం ఇచ్చేవి మూడు నెలలుగా రాలేదు. దీంతో పంచాయతీల నిర్వహణ భారంగా మారింది. ఎట్టకేలకు ఎనిమిది నెలల తర్వాత కేంద్రం నుంచి గ్రాంటు మంజూరైంది.

ఖాతాల స్తంభన లేదిక

గతంలో కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకునేది. పంచాయతీ ఖాతాలను ఫ్రీజింగ్‌లో ఉంచేది. మూడు, నాలుగు నెలల పాటు ఖాతాలను స్తంభింపజేసేది.  దీంతో పంచాయతీ ఖాతాల్లో డబ్బులున్నా విడిపించుకోలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కేంద్రం నేరుగా నిధులు పల్లెలకు ఇస్తుండటంతో పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


పట్టణ, స్థానిక సంస్థలకు ప్రగతి నిధులు

జనగామ, న్యూస్‌టుడే: నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న పుర, నగర పాలికలకు తీపి కబురు అందింది. నెలవారీగా ఇవ్వాల్సిన పట్టణ ప్రగతి నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా మున్సిపాలిటీలకు సహకారం పేరిట నిధులను విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో డోర్నకల్‌, తొర్రూరు, మరిపెడ, వర్ధన్నపేటకు మినహా ఇతర మున్సిపాలిటీలు, వరంగల్‌ కార్పొరేషన్‌కు మూడు నెలలకు కేటాయించారు.


కొత్తగా ఖాతాలు

జగదీశ్వర్‌, డీపీవో, హనుమకొండ జిల్లా

పంచాయతీల్లో కొత్తగా తీసిన బ్యాంకు ఖాతాలన్నీ పీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేశాం. లింక్‌ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ప్రతి పంచాయతీకి కొన్ని నిధులు జమ అయ్యాయి. త్వరలో పూర్తి స్థాయిలో వస్తాయి.


నేరుగా జమ చేయడం మంచిది

గురిజాల శ్రీరాంరెడ్డి, సర్పంచి, దామెర

ప్రస్తుతం కేంద్రం నేరుగా నిధులు ఇస్తామనడం మంచి పరిణామం. పంచాయతీల నిర్వహణ సజావుగా సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా వెంటనే జమచేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని