logo

నాలుగేళ్లు.. ఐదు లక్ష్యాలు

ఇంటర్‌ నాలుగు గోడల చదువు నుంచి హద్దులు లేని ఇంజినీరింగ్‌ మైదానంలోకి అడుగుపెట్టిన విద్యార్థులు ప్రారంభం నుంచే భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. ఈ నాలుగు సంవత్సరాల కోర్సుకు ఐదు దారులు ఆహ్వానిస్తున్నాయి.

Published : 02 Dec 2022 04:53 IST

ప్రణాళికతో సాగితే  ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు  

12 ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్‌  కళాశాలలు

4,552 విద్యార్థుల సంఖ్య

న్యూస్‌టుడే, వరంగల్‌ విద్యావిభాగం

ఇంటర్‌ నాలుగు గోడల చదువు నుంచి హద్దులు లేని ఇంజినీరింగ్‌ మైదానంలోకి అడుగుపెట్టిన విద్యార్థులు ప్రారంభం నుంచే భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. ఈ నాలుగు సంవత్సరాల కోర్సుకు ఐదు దారులు ఆహ్వానిస్తున్నాయి.  ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక విదేశాలు, ప్లేస్‌మెంట్లు, పై చదువులు, స్వయం ఉపాధి, మేనేజ్‌మెంట్‌ అనే ఈ అయిదు ఆహ్వానిస్తాయి. వారి వారి అభిరుచులకు తగ్గట్లుగా ఎంచుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇటీవల ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రత్యేక కథనం..

హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాల్లో చదివే వారికే అనేక అవకాశాలుంటాయని భావిస్తారు.. ద్వితీయ శ్రేణి నగరంగా ఎదిగిన వరంగల్‌లోనూ ఇప్పుడు ఇంజినీరింగ్‌ చదువుకునే విద్యార్థులకు అదనంగా పరిజ్ఞానం సంపాదించుకోవడానికి నయీంనగర్‌, సుబేదారి, గోపాలస్వామి గుడి లాంటి ప్రాంతాల్లో అనేక కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి.

విదేశీ విద్య

ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకున్నాక విదేశాల్లో పై చదువులు చదివి అక్కడే ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉన్నవారు ఎక్కువటగా ఉంటారు. ఇందుకోసం జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డు ఎక్జామినేషన్‌), జీమాట్‌, టోఫేల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీషు ఆస్‌ ఫోరెన్‌ లాంగేజేస్‌ లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులూ ఉండాలి. ఈ పరీక్షలు అభ్యర్థి ఆంగ్ల పరిజ్ఞానం, చదవడం ఆంగ్లంలో మాట్లాడడం, వినడం, చురుకుదనం మీద ఆధారపడి ఉంటాయి. వీటిపై రెండో సంవత్సరం చివరి నుంచి దృష్టి పెట్టి ఎక్కువ స్కోరు చేస్తే అమెరికాతో పాటు ఇతర దేశాలకు త్వరగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

వీటిపై దృష్టి సారించండి

ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం నుంచే భావ వ్యక్తీకరణ, ద్వితీయ సంవత్సరంలో ఆప్టిట్యూడ్‌లో నైపుణ్యం సంపాదించాలి. 

మార్కుల సాధనకు మొదటి సెమిస్టర్‌ నుంచి కృషి చేయాలిః ప్రాంగణ ఎంపికపై పరిజ్ఞానం, బృందచర్చల్లో పాల్గొనాలి. బట్టీ విధానం వద్దు. చరవాణిలో గూగుల్‌ను గురువుగా ఎంచుకోవాలి.

జర్నల్స్‌, డిజిటల్‌ లైబ్రరీ, అంతర్జాతీయ పత్ర సమర్పణలు, కళాశాలల్లో జరిగే సెమినార్లను సద్వినియోగం చేసుకోవాలి. ప్రాజెక్టులకు అధిక సమయం కేటాయించాలి.

మేనేజ్‌మెంట్‌

వ్యాపార రంగంలో ఆసక్తి కలవారు ఇంజినీరింగ్‌ తర్వాత క్యాట్‌ పరీక్ష రాసి మేనేజ్‌మెంటు కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది. సాధారణ కళాశాలల్లో కూడా ఎంబీఏ లాంటి కోర్సులు చేసుకోవచ్చు. ఇలాంటి వారికి దేశ విదేశాల్లో ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

ఉద్యోగం

ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకున్నాక స్వదేశంలో లేదా విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే కంప్యూటర్‌ సైన్స్‌ చదివే వారు కళాశాల చదువులతోపాటు జావా, పైథాన్‌ డాట్‌నెట్‌ వంటి ప్రొగ్రామింగ్‌లలో పట్టు సాధించడానికి తీరిక వేళల్లో కోచింగ్‌లు తీసుకోవడం మేలు. ఎక్కువగా ల్యాబ్‌లో గడుపుతూ మొదటి రెండు సంవత్సరాల్లో ప్రాథమికంగా పట్టు సాధించాలి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో కోడింగ్‌ ఎవరు బాగా చేస్తారో వారు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం త్వరగా పొందుతున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌ తదితర విభిన్న రంగాల్లోనూ రాణించాలంటే ఈ నాలుగు సంవత్సరాల్లో ముందస్తు ప్రణాళిక అవసరం. వీటికి ఆన్‌లైన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

కొందరు ఇంజినిరింగ్‌ తర్వాత పోటీ పరీక్షలకు కూడా సిద్ధం కావొచ్చు. దీనికి  మొదటి నుంచే సమకాలీన అంశాలతో పాటు జనరల్‌ సైన్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

పోలీసు, మిలటరీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారు సంబంధిత అంశాలపై శిక్షణ తీసుకుంటే మంచిది.

స్వయం ఉపాధి

చాలా మంది విదేశాలు, ఉద్యోగాలు అంటే మరికొందరు మాత్రం విభిన్నంగా ఆలోచనలు చేస్తున్నారు. స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్నారు. స్టార్టప్‌లను ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆవైపు ఆలోచనలు చేస్తే వారు మరికొందరికి ఉపాధి కల్పించవచ్చు.

పై చదువులు

మరోదారి పైచదువులు.. ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగాలకు బదులు పై చదువులకు వెళుతున్నారు. భవిష్యత్తులో టీచింగ్‌ లేదా ఇతర రంగాల్లో స్థిరపడటానికి ఇవి దోహదం చేస్తున్నాయి. మెకానికల్‌, కెమికల్‌, సివిల్‌, మైనింగ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌లలో పై చదువులకు వెళుతున్నారు. వీటి కోసం గేట్‌ పరీక్షలో స్కోరు సంపాదించడానికి ముందస్తు ప్రణాళిక అవసరం. ఆసక్తి ఉంటే పరిశోధన రంగంలోకి కూడా వెళ్లొచ్చు.


ఏడాదికి రూ.5.5 లక్షల ప్యాకెజీతో ఎంపికయ్యాను..  

పి.శ్రావణి, ఈసీఈ ఫైనలియర్‌, కేయూ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల

మాది కరీంనగర్‌. మొదటిసారి కళాశాల ప్రాంగణ ఎంపికలో పాల్గొని ఏడాదికి రూ.5.5 లక్షల ప్యాకేజితో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సంస్థలో ఎంపికయ్యాను. ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం నుంచే ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, వెర్బల్‌పై ఎక్కువ దృష్టి పెట్టాను.


ప్రణాళికతో చదివా..

ఎం.లిఖిత, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

మొదటి సంవత్సరం నుంచి చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళికతో చదివాను. చివరి సంవత్సరం ప్రాంగణ నియామకాల్లో డిలైట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ఎంపికయ్యాను. ప్రస్తుతం ఏడాదికి రూ.7.8 లక్షలు సంపాదిస్తున్నాను. భవిష్యత్తులో కంపెనీ స్థాపించి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యం ఉంది.


ప్రాంగణ ఎంపికలు ముఖ్యం  

ఆచార్య తాడిశెట్టి శ్రీనివాసులు, కేయూ మహిళా ఇంజినీరింగ్‌ ప్రిన్సిపల్‌, డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌

కళాశాల ప్రాంగణ ఎంపికల్లోనే ఉద్యోగం సాధిస్తే భవిష్యత్తు బాగుంటుంది. దీనికి ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైన సీనియర్లు, అధ్యాపకుల సలహాలు తీసుకోవాలి,  పరిశీలన శక్తి, పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి. ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, కోడింగ్‌పై పట్టు సాధించాలి.


ప్రతి సబ్జెక్ట్‌పై పట్టు అవసరం  

డా.మంచాల సదానందం, సహ ఆచార్యులు, కంప్యూటర్స్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌

ప్రణాళికాయుతంగా చదివితే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలి. పాఠ్య విషయాలతో పాటు అదనపు సమాచారం పొందాలి. గ్రంథాలయం, కంప్యూటర్‌, ప్రయోగశాలలను వినియోగించుకుంటూ అధ్యాపకులతో సందేహాలను నివృత్తి చేసుకోవాలి. టెక్నికల్‌ స్కిల్స్‌తో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌లో ప్రావీణ్యం పొందితే మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని