logo

అత్యాచారం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పీఏను అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేయడంతో నగరంలో పలు రాజకీయ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

Published : 03 Dec 2022 04:46 IST

వరంగల్‌ ఎంజీఎం కూడలిలో బైఠాయించిన కాంగ్రెస్‌ నాయకులు  

రంగంపేట, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పీఏను అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేయడంతో నగరంలో పలు రాజకీయ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వరంగల్‌, హనుమకొండ డీసీసీ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌ ఎంజీఎం కూడలిలో నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. లైంగిక దాడి వెనక అసలు దోషులను గుర్తించి న్యాయ విచారణ చేపట్టాలన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆడ పిల్లలపై అత్యాచారాలు, దాడులు పెరిగాయని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. లా చదువుతున్న అమ్మాయిని ట్రాప్‌ చేసి లైంగిక దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే లైంగిక దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. మాజీ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మట్టెవాడ పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి బైండోవర్‌ చేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు సరళాయాదవ్‌, మంతెన సునీత, మీసాల ప్రకాశ్‌, రామకృష్ణ, విక్రమ్‌, రమేష్‌, సంగీత్‌ కుమార్‌, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

అధికార బలంతో యువతులపై దాడులు

బాలసముద్రం, న్యూస్‌టుడే : తెరాసకు చెందిన ప్రజాప్రతినిధుల అణుచరులు అధికార బలంతో యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. వరంగల్‌ నగరంలో ఓ యువతిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై ఆమె స్పందించారు. యువతి హాస్టల్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఎమ్మెల్యే వద్ద పీఏగా పని చేసే శివ బంధువులే హాస్టల్‌ నడుపుతున్నారన్నారు. వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్స్‌లో మహిళలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలన్నారు.


ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

మట్టెవాడ, న్యూస్‌టుడే: వరంగల్‌ చౌరస్తాలో భాజపా జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నరేందర్‌ దిష్టిబొమ్మ దహనం చేసి మాట్లాడారు. కేసును లోతుగా విచారించాలని.. కుట్ర వెనక ఇతరుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని, అవసరమైతే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కుసుమ సతీష్‌, విద్యాసాగర్‌, రంజిత్‌, రఘునా రెడ్డి, శ్యాం, శ్రీనివాస్‌, సాంబయ్య, ప్రభాకర్‌, వెంకటేశ్‌, గోపి, సతీష్‌ పాల్గొన్నారు.


‘అనేక అనుమానాలు ఉన్నాయి’

ఈనాడు, వరంగల్‌: అత్యాచారం ఘటన వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని భాజపా నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ ఘటన గత నాలుగు రోజుల క్రితమే జరిగినా ఎందుకు బయటకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ ఈ కేసును ఎందుకు తొక్కి పడుతున్నారని, ఇటీవలే వరంగల్‌ సీపీ సైతం బదిలీ కావడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని