logo

అల్పాహారం.. చేయూత అవసరం

పదోతరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. నవంబరు నుంచి మార్చి మొదటి వారం వరకు వీటిని కొనసాగించాలని విద్యాశాఖ కార్యచరణ ప్రణాళిక రూపొందించింది.

Updated : 03 Dec 2022 05:59 IST

మొదలైన ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, డోర్నకల్‌

పదోతరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. నవంబరు నుంచి మార్చి మొదటి వారం వరకు వీటిని కొనసాగించాలని విద్యాశాఖ కార్యచరణ ప్రణాళిక రూపొందించింది. ఉదయం, సాయంత్రం గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే విద్యార్థులు ఇంటి వద్ద తినకుండా పాఠశాలకు ముందుగా వచ్చి ఆలస్యంగా వెళ్తున్నారు. ఆ సమయంలో వారికి అల్పాహారం అందక పస్తులుంటున్నారు. ఇది ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మాత్రమే దాతలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల చేయూతతో అల్పాహారం అందుతోంది. ఇంకా అందని బడులున్నాయి.

నలభై పాఠశాలల్లో కొనసాగింపు

జిల్లాలో నలభై పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందుతుంది. దాతలు, ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో అందిస్తున్నారు. మిగిలిన బడుల్లో ఇదే తరహాలో అందించడానికి ఆ ప్రాంతంలోని దాతలు ముందుకు రావాలి.

దాతలు స్పందించాలి

సుదూర ప్రాంతాల నుంచి పిల్లలు ఆహారం తీసుకోకుండానే ఉదయం 7 గంటలకే ప్రత్యేక తరగతుల కోసం బడికి వస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం ఒక్కటే ఆకలి తీరుస్తుంది. సాయంత్రం ప్రత్యేక తరగతులు ముగించుకుని మళ్లీ ఇంటికి చేరే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. వీరికి పోషకాహారం చాలా అవసరం. పూర్వ విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రవాస భారతీయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తే విద్యార్థులకు ఆకలి తీర్చడంతో పాటు వారి చదువులకు చేయూత ఇచ్చినవారు అవుతారు. పుట్టిన, పెళ్లి రోజు వేడుకల సందర్భంగానూ విద్యార్థులకు అల్పాహారం అందించొచ్చు.

తక్కువ ఖర్చుతోనూ..  

తక్కువ వ్యయంతో పిల్లల ఆకలి తీర్చే మార్గం ఉంది. తక్కువ ఖర్చులో పల్లీలు, అటుకుల చుడువా, బిస్కెట్లు, శనగలు, పెసర్లు, బొబ్బెర్లు, ఉప్మా, జామకాయలు, అరటిపండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున ఖర్చు అవుతుంది.


వీరు ఆదర్శం..

కేసముద్రం మండలం కల్వల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 43 మంది పదోతరగతి విద్యార్థులున్నారు. నెల రోజుల నుంచి వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సర్పంచి గంట సంజీవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల వీరికి అల్పాహారం అందిస్తున్నారు. ఉదయం ప్రతి ఒక్కరికీ రూ.5 విలువ చేసే బిస్కెట్‌ ప్యాకెట్‌ను అందిస్తున్నారు. సాయంత్రం ప్రతి విద్యార్థికి 100 గ్రాముల చొప్పున ఉడికించిన బొబ్బెర్లు, శనగలు, వేరుశనగలను అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు ఎస్‌. వెంకటేశ్వర్లు తెలిపారు.


వీరంతా దంతాలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు. 134 మంది పదోతరగతి చదువుతున్నారు. వీరిని నాలుగు సెక్షన్లుగా విభజించారు. ఉత్తమ ఫలితాలు సాధన కోసం ఉదయం, సాయంత్రం గంట పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు 125 మంది పిల్లలు హాజరవుతున్నారు. అధిక సంఖ్యలో 10 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. వారి ఆకలి తీర్చేందుకు నవంబరులో ఉపాధ్యాయ బృందం బిస్కెట్లు, అరటిపండ్లు, అటుకులు, పల్లీలు ఇచ్చారు. శనగలు, బొబ్బెర్లను ఉడికించి గుగ్గిళ్ల రూపంలో అందించారు. రోజుకు రూ.1200 వరకు ఖర్చు చేశారు. తరగతులు ముగిసే వరకు దాతల అవసరం ఉంది. ఈమేరకు పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులను కలవాలని నిర్ణయించుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాస్‌ తెలిపారు.


పాఠ్యాంశాలపై దృష్టి పెడుతున్నాం
- కె.శివాని, కల్వల, కేసముద్రం

బడిలో ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నా. దాతలు, ఉపాధ్యాయుల సహకారంతో అందిస్తున్న అల్పాహారంతో ఆకలి తీరుతుంది. దీంతో పాఠాలపై దృష్టి పెడుతున్నాం.


పిల్లలకు ఎంతో ప్రయోజనం
- సంక బద్రినారాయణ, ప్రధానోపాధ్యాయుడు, మాధావపురం, మహబూబాబాద్‌

మా బడిలో పదోతరగతిలో 17 మంది విద్యార్థులున్నారు. వారికి ప్రతి రోజు అల్పాహారాన్ని సొంత ఖర్చులతో అందిస్తున్నాను. నాతో పాటు గ్రామంలోని మరి కొందరూ దాతలు ముందుకొస్తే పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధిస్తారు.


ప్రభుత్వ నిధులు లేవు
- డాక్టర్‌ అబ్దుల్‌హై, డీఈవో

పదోతరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధుల లేవు. విద్యార్థులకు దాతల సహకారంతోనే అల్పాహరం అందిస్తున్నాం. దీనికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానికుల ఆర్థిక సహకారంతో అందిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని