logo

ఖాళీ కడుపులు.. సాగని చదువులు

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించటానికి విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఉపాధ్యాయులు బోధన, పరీక్షలపై దృష్టి సారించారు. కరోనాతో మూడేళ్లుగా చదువులు కొంత వెనకబడటంతో గాడిలో పెట్టేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

Updated : 03 Dec 2022 04:54 IST

దాతలు ముందుకొస్తేనే.. అల్పాహారం
న్యూస్‌టుడే, భూపాలపల్లి

అల్పాహారం అందడం లేదని చేతులు ఎత్తిన భూపాలపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థినులు

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించటానికి విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఉపాధ్యాయులు బోధన, పరీక్షలపై దృష్టి సారించారు. కరోనాతో మూడేళ్లుగా చదువులు కొంత వెనకబడటంతో గాడిలో పెట్టేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అదనంగా ఒక్కో గంటపాటు ప్రత్యేక తరగతులు కొనసాగిస్తున్నారు. అయితే పిల్లలు ఖాళీ కడుపులతో చదువులను సాగించాల్సి వస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించి అల్పాహారం అందించేందుకు ముందుకు రావాలి. గత నెల 15 నుంచి అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఆదర్శ, కేజీబీవీల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 25 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు, అదేవిధంగా సాయంత్రం 4.45 నుంచి 5.45 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 93 ప్రభుత్వ పాఠశాలల నుంచి తెలుగు మీడియంలో 560 మంది విద్యార్థులు, ఆంగ్ల మాధ్యమం నుంచి 1,724 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఉదయం ఇంటి వద్ద తిని బడికి వెళ్తే తిరిగి సాయంత్రం 6 నుంచి 6.15 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులైతే మరో అరగంట ఆలస్యమవుతుంది. మధ్యాహ్న భోజనం చేసి పొద్దుపోయే వరకు ఆకలితో ఉండటం వారికి కష్టంగానే ఉంటోంది. ఓ వైపు ఆకలి వేస్తుంటే మరోవైపు బోధించే విషయం కూడా వారికి అర్థం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సాయంత్రం వేళల్లో అల్పాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

ఆకలి తీరుద్దాం...

సుదూర ప్రాంతాల నుంచి పిల్లలు ఆహారం తీసుకోకుండానే ఉదయం 7 గంటలకే ప్రత్యేక తరగతుల కోసం బడికి వస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం ఒక్కటే ఆకలి తీరుస్తుంది. సాయంత్రం ప్రత్యేక తరగతులు ముగించుకుని మళ్లీ ఇంటికి చేరే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. వీరికి పోషకాహారం చాలా అవసరం. పూర్వ విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రవాస భారతీయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తే విద్యార్థులకు ఆకలి తీర్చడంతో పాటు వారి చదువులకు చేయూత ఇచ్చినవారు అవుతారు. పుట్టిన, పెళ్లి రోజు వేడుకల సందర్భంగానూ విద్యార్థులకు అల్పాహారం అందించొచ్చు.

తక్కువ ఖర్చుతోనూ..  

తక్కువ ఖర్చుతో పిల్లల ఆకలి తీర్చే మార్గం ఉంది. తక్కువ ఖర్చులో పల్లీలు, అటుకుల చుడువా, బిస్కెట్లు, శనగలు, పెసర్లు, బొబ్బెర్లు, ఉప్మా, జామకాయలు, అరటిపండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున ఖర్చు అవుతుంది.


కలెక్టర్‌ చొరవ తీసుకోవాలి..

హెచ్‌ఎం గదిలో నిల్వచేసిన బాదం మిల్క్‌ బాటిళ్లు

భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు. మొత్తం 60 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. గతేడాది జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుని కొద్దిరోజుల పాటు అల్పాహారం అందించారు. ఈ ఏడాది ఇంతవరకు అందించకపోవడంతో విద్యార్థులు సాయంత్రం ఖాళీ కడుపులతోనే ఇంటికి వెళ్తున్నారు. ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు బాదం మిల్క్‌ బాటిళ్లు అందజేశారు. వీటిని రోజు సాయంత్రం వారికి అందిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.


వీరు ఆదర్శం...

చెల్పూరు ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతుల్లో అల్పాహారం అందిస్తున్న దృశ్యమిది..

గణపురం మండలం చెల్పూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి సాయంత్రం పూట బిస్కెటు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 25 మంది ఉన్నారు. కానీ ఈ ఏడాది ఇంత వరకు అల్పాహారం విద్యార్థులకు అందించడం లేదు.


మంచినీళ్లతోనే సరిపెట్టుకుంటున్నాం..
- ఎ.వర్ష, పదో తరగతి, జవహర్‌నగర్‌కాలనీ

ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందడం లేదు. చాలా మంది విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక మంచినీళ్లతోనే కడుపులు నింపుకొంటున్నారు. మూడు నెలల పాటు కొనసాగే ప్రత్యేక తరగతుల సందర్భంగా ప్రభుత్వమే అల్పాహారం ఏర్పాటు చేస్తే, అనేక మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది.


వారం తర్వాత నుంచి అందిస్తాం..
- జుమ్మూనాయక్‌, హెచ్‌ఎం, చెల్పూరు ఉన్నత పాఠశాల

వారం తర్వాత నుంచి చెల్పూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించడానికి చర్యలు తీసుకుంటాం.. గతేడాది అందించిన కొంతమంది వ్యాపారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలి.


త్వరలోనే చర్యలు తీసుకుంటాం..
- ఎం.రాజేందర్‌, డీఈవో.భూపాలపల్లి

రాష్ట్ర స్థాయిలో రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో జయశంకర్‌ జిల్లా మొదటి స్థానం సాధించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించాం. సాయంత్రం పూట పిల్లలకు అల్పాహారం అందించడానికి చర్యలు త్వరలోనే తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని