logo

మార్కెటింగ్‌ శాఖలో ఇ సర్వీసెస్‌

సులభతర సేవలు, పారదర్శక లావాదేవీలే లక్ష్యంగా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ ఆన్‌లైన్‌ సేవల కోసం ఇ-సర్వీసెస్‌ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.

Published : 03 Dec 2022 04:46 IST

కొత్త యాప్‌ రూపకల్పన దిశగా అడుగులు

జనగామ మార్కెట్‌ కార్యాలయంలో లైసెన్స్‌డ్‌ వ్యాపారుల వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియను పరిశీలిస్తున్న రాష్ట్ర అదనపు సంచాలకుడు రవికుమార్‌ తదితరులు

జనగామ, న్యూస్‌టుడే: సులభతర సేవలు, పారదర్శక లావాదేవీలే లక్ష్యంగా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ ఆన్‌లైన్‌ సేవల కోసం ఇ-సర్వీసెస్‌ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల పరిధిలో లైసెన్సు కలిగిన ఖరీదుదారులు, అడ్తీదారుల ప్రాథమిక సమాచారం (బేసిక్‌ ఇన్ఫర్మేషన్‌) సేకరించి కంప్యూటరీకరిస్తున్నారు. మొదటి దశలో సమాచార సేకరణ, రెండో దశలో ప్రత్యేక వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా సేవల విస్తరణ జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని 17 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో సమాచార సేకరణ, చేరవేత కార్యక్రమం జరుగుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాల నమోదు

గత రెండు నెలలుగా ఆయా జిల్లాల వ్యవసాయ విపణులకు చెందిన ఖరీదుదారులకు సంబంధించి 12 రకాల వివరాలను, భాగస్వామ్య వ్యాపార సంస్థలకు చెందిన వారి 14 వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇందులో లైసెన్సు, బ్యాంకు పూచీకత్తు, సంస్థలు, వ్యాపార లావాదేవీల వివరాలు, ఆధార్‌, పాన్‌కార్డు, ఒప్పంద పత్రాలను కంప్యూటరీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ రాష్ట్ర సహాయక సంచాలకుల హోదా కలిగిన అధికారుల పర్యవేక్షణలో జరుగుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసేందుకు టీవోటీగా(ట్రైనర్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌)గా హనుమకొండ జిల్లా మార్కెటింగ్‌ అధికారి సురేఖను నియమించారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేసి, కొత్త సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించనున్నారు.

ఏ సేవలు..ఎందుకంటే?  

ఇ సర్వీసెస్‌ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం కారణంగా ఇనామ్‌ పథకం అమలు మరింత సులభతరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఖరీదుదారుల వివరాలన్నీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఖరీదులో పాల్గొనవచ్చు. ఇప్పటి వరకు కొనుగోలు తదితర వ్యాపార వివరాలను మార్కెట్‌ కార్యాలయాలకు వెళ్లి స్వయంగా సమర్పించాల్సి వస్తోంది. సరకుల ఎగుమతుల రవాణాకు అనుమతులను నేరుగా తీసుకోవాల్సి వస్తోంది. ఇ సర్వీసెస్‌ విధానం అమలులోకి వస్తే.. మిల్లుల కొనుగోళ్లు, ఇతర వ్యాపార లావాదేవీల రిటర్న్‌లను నేరుగా చరవాణుల ద్వారా సమర్పించవచ్చు. కొనుగోలు వివరాలను సంబంధిత మార్కెట్‌కు పంపించగానే, ఎగుమతి అనుమతిని నేరుగా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌ అనుమతి మీద క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే సదరు లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో అధికారులు, లైసెన్సుదారుల మధ్య పేచీ ఉండదు. అధికారిక వెబ్‌సైట్లో ఉన్న వ్యాపారస్తులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో రైతుల సరకు సొమ్ము చెల్లించని పక్షంలో ఆ వివరాలు ఉన్నతాధికారులకు చేరుతాయి. లైసెన్సు పునరుద్ధరణకు ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 17 విపణుల పరిధిలో 813 మంది ఖరీదు, 802 మంది అడ్తీలైసెన్సు కమిషన్‌దారులు, 17 మంది వ్యవసాయ నిపుణులు ఉన్నారు.


రైతులకు సులభతర సేవలు
- రవికుమార్‌, మార్కెటింగ్‌ శాఖ అదనపు సంచాలకుడు

వ్యవసాయ మార్కెట్ల నిర్వహణ, రైతులకు సులభతర సేవలు అందించేందుకు ఇ సర్వీసెస్‌ ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సుదారుల వివరాల సేకరణ, అప్‌లోడింగ్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య వారధిగా ఈ ప్రక్రియ ఉపకరిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని