logo

హనుమకొండకు ప్రగతిహారం మణిహారం!

పల్లెలకు మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లు పట్టణాలకు పరిమితమైన జాతీయ రహదారులు ఇప్పుడు పల్లెలకు మణిహారంగా మారనున్నాయి. గతుకుల రహదారిపై అష్టకష్టాలు పడ్డ ప్రజల బాధలు తీరనున్నాయి. ఈ క్రమంలో రెండు జాతీయ రహదారులు ముద్దాడనుండడంతో ఎల్కతుర్తికి మహర్దశ పట్టనుంది.

Published : 03 Dec 2022 04:46 IST

ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ  రహదారి నిర్మాణానికి శ్రీకారం

 -న్యూస్‌టుడే, భీమదేవరపల్లి(హనుమకొండ జిల్లా)

ములుకనూర్‌ అంబేడ్కర్‌ కూడలి

పల్లెలకు మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లు పట్టణాలకు పరిమితమైన జాతీయ రహదారులు ఇప్పుడు పల్లెలకు మణిహారంగా మారనున్నాయి. గతుకుల రహదారిపై అష్టకష్టాలు పడ్డ ప్రజల బాధలు తీరనున్నాయి. ఈ క్రమంలో రెండు జాతీయ రహదారులు ముద్దాడనుండడంతో ఎల్కతుర్తికి మహర్దశ పట్టనుంది.

ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. ఎల్కతుర్తి--మెదక్‌ జాతీయ రహదారి 133.61 కిలోమీటర్లకు కేంద్రప్రభుత్వం రూ.1,458 కోట్లు కేటాయించింది.

* ఈ రహదారిని రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ2లో సిద్దిపేట పట్టణ పరిధిలోని రంగధాంపల్లి వంతెన నుంచి ఎల్కతుర్తి వరకు నిర్మించే ఈ మార్గానికి టెండర్‌ వేయగా ఔరంగాబాద్‌కు చెందిన ఏజీ కన్‌స్ట్రక్షన్‌ పనులు దక్కించుకుంది.

పరిశ్రమలకు అనుకూలం...

జాతీయ రహదారి ఏర్పాటుతో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా మారనుంది. జాతీయ రహదారి పక్కనే పరిశ్రమలు ఏర్పాటుతో రవాణా సౌకర్యం సులభతరం కానుంది. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌లో గ్రానైట్‌ పరిశ్రమలు 50కిపైగా ఏర్పడ్డాయి. గ్రానైట్‌ రాయిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా జాతీయ రహదారులతోపాటు హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌లో రైలు సౌకర్యం ఉంది. రవాణా సౌకర్యం పెరగనుండడంతో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉందని పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

మారనున్న రూపురేఖలు..

ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు విలీనం తర్వాత ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఎల్కతుర్తి-సిద్దిపేట ప్రధాన రహదారిలో ఎకరాకు రూ.కోటి ధర పలుకుతోంది. గతంలో ఎకరాకు రూ.10-15 లక్షల ధర ఉన్న భూములు  ఇప్పుడు రూ.30-50 లక్షలు పలుకుతోంది. భీమదేవరపల్లి మండలం వంగర శివారులో ఆహార పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం 150 ఎకరాలకుపైగా భూమి సేకరించి రైతులకు పరిహారం కింద ఎకరాకు రూ.18.80 లక్షలు చెల్లించింది.

* ఎల్కతుర్తి మండలంలో జాతీయ రహదారి ప్రారంభమై ఇందిరానగర్‌, భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ములుకనూర్‌, మంగళపల్లి, రాంనగర్‌ వరకు 18 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు.

వంద ఫీట్ల వెడల్పుతో..

విస్తరణలో మేజర్‌ జంక్షన్‌గా ఎల్కతుర్తి మారనుంది. మూడు కిలోమీటర్లు నాలుగు వరుసల రహదారి, 15 కిలోమీటర్లు పది మీటర్ల రహదారిగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో 25 కల్వర్టులు, ఎనిమిది మైనర్‌ జంక్షన్లు, ఒకటి మేజËర్‌ జంక్షన్‌ ఏర్పాటు కానున్నాయి. ఆయా గ్రామాల్లో వంద ఫీట్ల వెడల్పుతో జాతీయ రహదారి నిర్మిస్తున్నందున ములుకనూర్‌, ఇందిరానగర్‌లో కొన్ని ఇళ్లు తొలగించాల్సి వస్తోందని  అధికారులు తెలిపారు. భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించనున్నారు.

హనుమకొండ-కరీంనగర్‌ను కలిపే 563తో పాటు ఎల్కతుర్తి-సిద్దిపేట మధ్య  765 జాతీయ రహదారులకు ఇది ప్రధాన కూడలిగా మారనుంది.  


మార్కెట్‌ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలి
- చిదురాల శ్రీనివాస్‌, వ్యాపారి, ములుకనూర్‌

ఎల్కతుర్తి-సిద్దిపేట ప్రధాన రహదారిలో ములుకనూర్‌ కూడలిలో మూడు పోర్షన్ల ఇల్లు ఉంది. జాతీయ రహదారి విస్తరణలో ముందు గది సగం వరకు అధికారులు మార్క్‌ ఏర్పాటు చేశారు. ఓ గది వరకు కోల్పోవాల్సి వస్తోంది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు మార్కెట్‌ ధరకు అనుగుణంగా ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని