logo

రైతు వేదికల నిర్వహణకు నిధులు

వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక విస్తరణాధికారిని నియమించి.. వారి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైతు వేదికలను నిర్మించింది.

Published : 03 Dec 2022 04:46 IST

దేవరుప్పులలో..

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక విస్తరణాధికారిని నియమించి.. వారి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైతు వేదికలను నిర్మించింది. క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయి రైతుబంధు సంఘాలను ఏర్పాటు చేసి రైతులను బాధ్యులుగా చేసింది. వీరంతా అనుసంధానకర్తలుగా పని చేస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించేందుకు రైతు వేదికలను వినియోగించుకోవాల్సి ఉంది. ఇందుకోసం రైతుబంధు మండల బాధ్యుడికి ప్రత్యేకగదిని, సామగ్రిని సమకూర్చింది. ప్రతి విస్తరణాధికారి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో గంటసేపు రైతు వేదికల్లో రైతులకు అందుబాటులో ఉండాలని, అనంతరం క్షేత్ర సందర్శనకు వెళ్లాలని ఆదేశించింది. రైతు వేదికల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవడంతో ఇవి కొంతకాలం వినియోగానికి దూరంగా ఉన్నాయి. రైతు వేదికలను వినియోగంలోకి తెచ్చేందుకు వాటి నిర్వహణకు నెలకు రూ.9 వేలను ప్రభుత్వం అందజేయనున్నట్లు ఇటీవల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అప్పటి నుంచి రైతు వేదికలను మండల వ్యవసాయ విస్తరణాధికారులే నిర్వహిస్తున్నారు.

నెలకు రూ.9 వేలు

ప్రభుత్వ హామీ మేరకు..  నెలకు రూ.9 వేల చొప్పున గత ఐదు నెలలకు గాను రూ.45 వేలను ప్రభుత్వం జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి జమ చేసింది. ఈ నిధులను క్లస్టర్‌ వారీగా విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైతు వేదికల పేరిట బ్యాంకులో పొదుపు ఖాతాలను ప్రారంభించి  సమాచారమిస్తే వాటిని ఆ ఖాతాల్లో జమ చేయడానికి అధికారులు విస్తరణాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఇక నుంచి వేదికల నిర్వహణ మరింత సమర్థంగా సాగుతుందని భావిస్తున్నారు.

ఇలా ఖర్చు చేయాలి  

ఈ నిధులను రైతు వేదికలకు అంతర్జాల సేవల ఛార్జీలు, ఊడ్చేవారికి వేతనాలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపు తదితర అవసరాలకు వెచ్చించాలి. శాస్త్రవేత్తలతో ముఖాముఖి, రైతు సందర్శన యాత్రల తాలూకు ఛాయా చిత్రాల ముద్రణ తదితరాలకు ఖర్చుచేయాల్సి ఉంటుంది.


మెరుగైన సేవలు అందిస్తాం
- వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి

ఒక్కో రైతు వేదిక నిర్వహణకు రూ.45 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. నిధుల మంజూరుతో రైతు వేదికలు మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటాయి. మెరుగైన సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించేందుకు విస్తరణాధికారులతో బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించాం. ఒకటి రెండు రోజుల్లో వివరాలు సేకరించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  ఖాతాల్లో జమ చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని