logo

విభజన హామీలపై షర్మిల వైఖరేంటో చెప్పాలి

 పాదయాత్ర పేరుతో సీఎం కేసీఆర్‌, తెరాస నేతలపై అనాలోచితంగా మాట్లాడుతున్న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ముందుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలపై తన వైఖరేంటో చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 04 Dec 2022 04:47 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:  పాదయాత్ర పేరుతో సీఎం కేసీఆర్‌, తెరాస నేతలపై అనాలోచితంగా మాట్లాడుతున్న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ముందుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలపై తన వైఖరేంటో చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. హనుమకొండ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ముంపును కారణంగా చూపుతూ ఏడు మండలాలు తీసుకోవడంతోపాటు సీలేరు జలవిద్యుత్తు కేంద్రం విషయంలో తెలంగాణను మోసం చేసిన కేంద్ర, ఆంధ్రా ప్రభుత్వాలను ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ సూచనల మేరకే తెలంగాణలోని రైతులకు మేలు చేసే పలు ప్రాజెక్టులపై కేంద్రం ఆంక్షలు విధించినా.. ఒక్కసారి కూడా తన సోదరుడు జగన్‌ను ఆ అంశాలపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకుంటూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంటుందని, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే దాడులు పునరావృతమవుతాయని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీబీ ఛైర్మన్‌ మార్నేని రవీందర్‌, కుడా మాజీ ఛైర్మన్‌ మర్రి యాదవ్‌రెడ్డి, కార్పొరేటర్‌ ఇండ్ల నాగేశ్వర్‌రావు స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని