logo

వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకతకు పదును

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు విజ్ఞాన మేళాలు బాగా ఉపయోగపడుతాయని  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Updated : 04 Dec 2022 06:25 IST

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


వైజ్ఞానిక ప్రదర్శనలు పరిశీలిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి- న్యూస్‌టుడే భూపాలపల్లి : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు విజ్ఞాన మేళాలు బాగా ఉపయోగపడుతాయని  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థి దశలోనే ఇలాంటి ప్రదర్శనలకు హాజరైతే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని, ప్రతి ఒక్కరూ సైన్స్‌ ఫెయిర్‌లో పాల్గొనేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మాంటిస్సోరి హైస్కూల్‌లో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు చదువులో వెనుకబడిపోకుండా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాం. టీవీల ద్వారా పాఠ్యాంశాల బోధన చేస్తూ కొనసాగించామని, ఇందుకు ఉపాధ్యాయులు ఎంతో కృషిచేశారన్నారు. కొవిడ్‌ కారణంగా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించుకోలేదని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞాన మేళాలు అన్ని జిల్లాల్లో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మన ఊరు.. మనబడి కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలను వెచ్చించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1150 గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌, 80 పైచిలుకు డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసినట్లు పేర్కొన్నారు.  కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ బుర్ర రమేష్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ దివాకర, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కళ్లెపు శోభ, మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ఛైర్మన్‌ హరిబాబు, ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, డీఈవో రాజేందర్‌, ఎంపీపీ మందల లావణ్య, మాంటిస్సోరి ఉన్నత పాఠశాల డైరెక్టర్‌ గండ్ర సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన అందుతోంది.. 2009లో మొదటి సారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఇంటర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలను ఏర్పాటు చేయటంతో విద్యారంగం పురోగమించింది. కేజీబీవీలు, కొన్ని గురుకుల విద్యాలయాల్లో బెంచీలు, తదితర మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించేందుకు విద్యాశాఖ మంత్రి సహకరించాలి.

- గండ్ర వెంటకరమణారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే


* జిల్లాల్లో మూతబడిన పాఠశాలలను ఆయా గ్రామస్థులు ఐక్యంగా మళ్లీ ప్రారంభించుకున్నారు. ఇందుకు ఒంటిమామిడి గ్రామమే నిదర్శనం. ప్రస్తుతం ఈ పాఠశాలలో 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు మెరుగైన విద్య అందించడానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

- పసునూటి దయాకర్‌, వరంగల్‌ ఎంపీ


* వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థుల సాంకేతిక విజ్ఞానం పెరుగుతుంది. భవిష్యత్తులో మంచి శాస్త్రవేెత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదగడానికి అవకాశాలుంటాయి. జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల మంజూరు కావడంతో ఎంతో మేలు జరుగుతుంది.

- జక్కు శ్రీహర్షిణి, జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌


* వచ్చే విద్యాసంవత్సరానికి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలను ఎంతో అద్బుతంగా తయారు చేయిస్తున్నాం. చక్కటి స్కూల్‌ డ్రెస్‌లు అందజేయనున్నాం.. స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో ప్రదర్శనలు చూస్తే అద్భుతంగా ఉంటున్నాయి.

- దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌


* మన జీవితంలో సైన్స్‌ నిత్యకృత్యంగా మారింది. మనం చేసే ప్రతిపనిలో సైన్స్‌ దాగి ఉంది. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. ప్రపంచంతోనే అతిపెద్ద కంపెనీలకు సీఈవోలు భారతీయులు పనిచేయడమే ఇందుకు నిదర్శనం..

- భవేష్‌ మిశ్రా, జిల్లా కలెక్టర్‌

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు